ఫ్రీచార్జ్‌పై యాక్సిస్ బ్యాంక్ కన్ను
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ సంస్థ స్నాప్‌డీల్‌లో భాగమైన ఫ్రీచార్జ్‌ను ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ కొనుగోలు చేయనుంది. ఇందుకోసం సుమారు రూ. 350–400 కోట్ల దాకా చెల్లించేలా స్నాప్‌డీల్‌తో ఒప్పందం కూడా ఖరారు చేసుకున్నట్లు సమాచారం. డీల్ దాదాపు పూర్తయిపోయినట్లేనని, మరికొద్ది రోజుల్లో దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ’కీలకమైన వ్యాపార ప్రకటన’ చేసేందుకు గురువారం విలేకరుల సమావేశం నిర్వహించనున్నట్లు యాక్సిస్ బ్యాంక్ వెల్లడించిన నేపథ్యంలో డీల్ వార్త మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. 2015 ఏప్రిల్‌లో ఫ్రీచార్జ్‌ను స్నాప్‌డీల్ 400 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. అప్పట్లో దేశీ స్టార్టప్ సంస్థలకు సంబంధించి ఇది అతిపెద్ద డీల్‌గా నిల్చింది. ఫ్రీచార్జ్ కొనుగోలుతో దీని 5 కోట్ల మంది మొబైల్ వాలెట్ యూజర్లు యాక్సిస్‌కు చేరువ కాగలరు.
ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌కు స్నాప్‌డీల్ ఓకే?
తమ సంస్థ కొనుగోలు కోసం ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేసిన 900–950 మిలియన్ డాలర్ల డీల్‌కు స్నాప్‌డీల్ బోర్డు ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. ఇక స్నాప్‌డీల్‌లోని మిగతా వాటాదారుల ఆమోదం లభించాల్సి ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ వారంలోనే ఇరు సంస్థలు ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉన్నట్లు వివరించాయి. శుక్రవారం జరిగే బోర్డు సమావేశంలో షేర్ల మార్పిడి నిష్పత్తిని ఫ్లిప్‌కార్ట్ ఖరారు చేయొచ్చు. విలీన సంస్థలో సాఫ్ట్‌బ్యాంక్‌కు 20% వాటాలు దక్కే అవకాశముంది. ప్రారంభ దశలో స్నాప్‌డీల్ బ్రాండ్ పేరును ఫ్లిప్‌కార్ట్ అలాగే కొనసాగించవచ్చని తెలుస్తోంది. స్నాప్‌డీల్ కొనుగోలుకు తొలుత బిలియన్ డాలర్లు ఇవ్వజూపిన ఫ్లిప్‌కార్ట్.. ఆ తర్వాత వ్యాపార కార్యకలాపాల మదింపు అనంతరం 550 మిలియన్ డాలర్లకు కుదించి.. మళ్లీ తాజాగా 900–950 మిలియన్ డాలర్లకు పెంచింది.