స్నాప్‌డీల్ చేతికి ఫ్రీచార్జ్
ఈ కామర్స్‌లో అతి పెద్ద డీల్
స్నాప్‌డీల్ నుంచి ఇక మొబైల్ రీచార్జ్‌లు, ఆర్థిక సేవలు
బెంగళూరు: ఆన్‌లైన్ మార్కెట్ ప్లేస్ స్నాప్‌డీల్, మొబైల్ లావాదేవీల ప్లాట్‌ఫామ్ ఫ్రీచార్జ్‌ను కొనుగోలు చేసింది. నగదు, స్టాక్ డీల్‌తో ఫ్రీచార్జ్‌ను కొనుగోలు చేశామని, భారత డిజిటల్ కామర్స్ రంగంలో ఇదే అతి పెద్ద కొనుగోలు అని స్నాప్‌డీల్ పేర్కొంది. అయితే ఫ్రీచార్జ్‌ను ఎంతకు కొనుగోలు చేసిందీ స్నాప్‌డీల్ వెల్లడించలేదు. గతంలో ఫ్లిప్‌కార్ట్ సంస్థ మైంత్రను రూ.2,000 కోట్లకు కొనుగోలు చేసింది. భారత ఇంటర్నెట్ పరిశ్రమలో ఇదే ఇప్పటివరకూ అతి పెద్ద డీల్‌గా చెబుతారు. ఫ్రీచార్జ్ మొబైల్ ప్లాట్‌ఫామ్ ద్వారా వినియోగదారులు మొబైల్ బిల్లులు, డీటీహెచ్ రీచార్జ్, ఇతర లావాదేవీలు నిర్వహించుకోవచ్చు.
ఫ్రీచార్జ్ కొనుగోలుతో తమ వినియోగదారుల సంఖ్య మరింతగా పెరిగిందని స్నాప్‌డీల్ సీఈఓ కునాల్ బహాల్ చెప్పారు. ఈ కొనుగోలు కారణంగా తమ సేవల పరిధి మరింతగా విస్తృతమవుతుందని, ఆర్థిక సేవలతో పాటు, మొబైల్ రీచార్జ్ కూడా అందిస్తామని పేర్కొన్నారు. తాము కొనుగోలు చేసినప్పటికీ, ఫ్రీచార్జ్ స్వతంత్ర ప్లాట్‌ఫామ్‌గానే కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఫ్రీచార్జ్‌లో 200 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, వీరంతా కొనసాగుతారని వివరించారు. స్నాప్‌డీల్‌తో భాగస్వామ్యం సరైన సమయంలో కుదిరిందని, మరింత మందికి చేరువకాలగమని ఫ్రీచార్జ్ వ్యవస్థాపకుల్లో ఒకరు, సీఈఓ కూడా అయిన కునాల్ షా పేర్కొన్నారు.
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సంస్థల నుంచి ఎదురవుతున్న తీవ్రమైన పోటీని తట్టుకోవడానికి స్నాప్‌డీల్ సంస్థ తగిన ప్రయత్నాలు చేస్తోంది. దీంట్లో భాగంగానే గత వారం ఈ సంస్థ డిజిటల్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్‌ల ప్లాట్‌ఫామ్ రూపీపవర్‌ను కొనుగోలు చేసింది. లాజిస్టిక్స్ సంస్థ గోజావాస్‌ను చేజిక్కించుకుంది. మరిన్ని కొనుగోళ్లకు సిద్ధంగా ఉంది.