Stock Deal
-
ఇండస్‌ఇండ్‌పై కోటక్ కన్ను!
ముంబై: ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో చాలాకాలం తర్వాత ఓ భారీ డీల్ కుదరవచ్చన్న వార్తలు షికారు చేస్తున్నాయి. ఇండస్ఇండ్ బ్యాంకును దిగ్గజ సంస్థ కోటక్ మహీంద్రా బ్యాంకు (కేఎంబీ) కొనుగోలు చేయొచ్చన్న ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఇది పూర్తి స్టాక్ డీల్‌గా ఉండొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈ వార్తలను ఇండస్ఇండ్ బ్యాంక్, దాని ప్రమోటర్లు ఖండించారు. ‘ఇవన్నీ వదంతులే. ఇవి నిరాధారమైనవి. ఇండస్ఇండ్ బ్యాంక్, ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ (ఐఐహెచ్ఎల్) ప్రమోటర్లుగా వీటిని ఖండిస్తున్నాం‘ అని పేర్కొన్నారు. ఇండస్ఇండ్ బ్యాంక్‌నకు ఎల్లవేళలా తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. దేశీ ఎకానమీ, ఆర్థిక సంస్థలకు ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఎదురైనప్పుడల్లా తాము సానుకూలంగా స్పందించామని, బ్యాంకును నిలబెట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని వివరించారు. హిందుజా గ్రూప్ ఆధ్వర్యంలో ఐఐహెచ్ఎల్ నడుస్తోంది. ఒకవేళ ఈ డీల్ గానీ కుదిరితే.. 2014లో ఐఎన్జీ వైశ్యా బ్యాంక్‌ను కోటక్ మహీంద్రా బ్యాంక్ విలీనం చేసుకున్న ఒప్పందం తర్వాత ప్రైవేట్ రంగంలో ఇదే అత్యంత భారీ డీల్ కానుంది. కేఎంబీ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు రూ. 2.75 లక్షల కోట్లు కాగా, ఇండస్ఇండ్ బ్యాంక్ది సుమారు రూ. 50,000 కోట్లుగా ఉంది. అవకాశాలు పరిశీలిస్తుంటాం.. ఇండస్ఇండ్ బ్యాంక్ కొనుగోలు వార్తలపై వ్యాఖ్యానించేందుకు కోటక్ మహీంద్రా గ్రూప్ నిరాకరించింది. అయితే, ఇటీవలే నిధులు సమీకరించిన నేపథ్యంలో కంపెనీలు, అసెట్ల కొనుగోలు అవకాశాలను పరిశీలిస్తూనే ఉంటామని పేర్కొంది. గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జైమిన్ భట్ ఈ విషయాలు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కోటక్ మహీంద్రా గ్రూప్ రూ. 7,000 కోట్లు సమీకరించింది. ‘క్యూ1లో ఈ నిధులను సమీకరించినప్పుడే మేం .. అసెట్స్, కంపెనీల్లాంటివి కొనుగోలు చేసే అవకాశాలను పరిశీలిస్తామని చెప్పాం. కాబట్టి అలాంటి అవకాశాలేమైనా వస్తే కచ్చితంగా పరిశీలిస్తాం. కాకపోతే దీనిపై (ఇండస్ఇండ్) వ్యాఖ్యానించడానికేమీ లేదు‘ అని భట్ చెప్పారు. డీల్ వార్తల నేపథ్యంలో బీఎస్ఈలో కేఎంబీ షేరు 2.36 శాతం పెరిగి రూ. 1,416 వద్ద ముగిసింది. ఇండస్ఇండ్ బ్యాంక్ షేరు దాదాపు 1 శాతం పెరిగి రూ. 616 వద్ద క్లోజయ్యింది. -
స్నాప్‌డీల్ చేతికి ఫ్రీచార్జ్
ఈ కామర్స్‌లో అతి పెద్ద డీల్ స్నాప్‌డీల్ నుంచి ఇక మొబైల్ రీచార్జ్‌లు, ఆర్థిక సేవలు బెంగళూరు: ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ స్నాప్‌డీల్, మొబైల్ లావాదేవీల ప్లాట్‌ఫామ్ ఫ్రీచార్జ్‌ను కొనుగోలు చేసింది. నగదు, స్టాక్ డీల్‌తో ఫ్రీచార్జ్‌ను కొనుగోలు చేశామని, భారత డిజిటల్ కామర్స్ రంగంలో ఇదే అతి పెద్ద కొనుగోలు అని స్నాప్‌డీల్ పేర్కొంది. అయితే ఫ్రీచార్జ్‌ను ఎంతకు కొనుగోలు చేసిందీ స్నాప్‌డీల్ వెల్లడించలేదు. గతంలో ఫ్లిప్‌కార్ట్ సంస్థ మైంత్రను రూ.2,000 కోట్లకు కొనుగోలు చేసింది. భారత ఇంటర్నెట్ పరిశ్రమలో ఇదే ఇప్పటివరకూ అతి పెద్ద డీల్‌గా చెబుతారు. ఫ్రీచార్జ్ మొబైల్ ప్లాట్‌ఫామ్ ద్వారా వినియోగదారులు మొబైల్ బిల్లులు, డీటీహెచ్ రీచార్జ్, ఇతర లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఫ్రీచార్జ్ కొనుగోలుతో తమ వినియోగదారుల సంఖ్య మరింతగా పెరిగిందని స్నాప్‌డీల్ సీఈఓ కునాల్ బహాల్ చెప్పారు. ఈ కొనుగోలు కారణంగా తమ సేవల పరిధి మరింతగా విస్తృతమవుతుందని, ఆర్థిక సేవలతో పాటు, మొబైల్ రీచార్జ్ కూడా అందిస్తామని పేర్కొన్నారు. తాము కొనుగోలు చేసినప్పటికీ, ఫ్రీచార్జ్ స్వతంత్ర ప్లాట్‌ఫామ్‌గానే కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఫ్రీచార్జ్‌లో 200 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, వీరంతా కొనసాగుతారని వివరించారు. స్నాప్‌డీల్‌తో భాగస్వామ్యం సరైన సమయంలో కుదిరిందని, మరింత మందికి చేరువకాలగమని ఫ్రీచార్జ్ వ్యవస్థాపకుల్లో ఒకరు, సీఈఓ కూడా అయిన కునాల్ షా పేర్కొన్నారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సంస్థల నుంచి ఎదురవుతున్న తీవ్రమైన పోటీని తట్టుకోవడానికి స్నాప్‌డీల్ సంస్థ తగిన ప్రయత్నాలు చేస్తోంది. దీంట్లో భాగంగానే గత వారం ఈ సంస్థ డిజిటల్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్‌ల ప్లాట్‌ఫామ్ రూపీపవర్ను కొనుగోలు చేసింది. లాజిస్టిక్స్ సంస్థ గోజావాస్ను చేజిక్కించుకుంది. మరిన్ని కొనుగోళ్లకు సిద్ధంగా ఉంది.