ఇండస్‌ఇండ్‌పై కోటక్‌ కన్ను! | Kotak Mahindra Bank is exploring takeover of IndusInd Bank | Sakshi
Sakshi News home page

ఇండస్‌ఇండ్‌పై కోటక్‌ కన్ను!

Published Tue, Oct 27 2020 5:35 AM | Last Updated on Tue, Oct 27 2020 5:35 AM

Kotak Mahindra Bank is exploring takeover of IndusInd Bank - Sakshi

ముంబై: ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ రంగంలో చాలాకాలం తర్వాత ఓ భారీ డీల్‌ కుదరవచ్చన్న వార్తలు షికారు చేస్తున్నాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంకును దిగ్గజ సంస్థ కోటక్‌ మహీంద్రా బ్యాంకు (కేఎంబీ) కొనుగోలు చేయొచ్చన్న ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. ఇది పూర్తి స్టాక్‌ డీల్‌గా ఉండొచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈ వార్తలను ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, దాని ప్రమోటర్లు ఖండించారు. ‘ఇవన్నీ వదంతులే. ఇవి నిరాధారమైనవి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్, ఇండస్‌ఇండ్‌ ఇంటర్నేషనల్‌ హోల్డింగ్స్‌ (ఐఐహెచ్‌ఎల్‌) ప్రమోటర్లుగా వీటిని ఖండిస్తున్నాం‘ అని పేర్కొన్నారు.

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌నకు ఎల్లవేళలా తమ పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. దేశీ ఎకానమీ, ఆర్థిక సంస్థలకు ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఎదురైనప్పుడల్లా తాము సానుకూలంగా స్పందించామని, బ్యాంకును నిలబెట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని వివరించారు. హిందుజా గ్రూప్‌ ఆధ్వర్యంలో ఐఐహెచ్‌ఎల్‌ నడుస్తోంది. ఒకవేళ ఈ డీల్‌ గానీ కుదిరితే.. 2014లో ఐఎన్‌జీ వైశ్యా బ్యాంక్‌ను కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ విలీనం చేసుకున్న ఒప్పందం తర్వాత ప్రైవేట్‌ రంగంలో ఇదే అత్యంత భారీ డీల్‌ కానుంది. కేఎంబీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ దాదాపు రూ. 2.75 లక్షల కోట్లు కాగా, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ది సుమారు రూ. 50,000 కోట్లుగా ఉంది.  

అవకాశాలు పరిశీలిస్తుంటాం..
ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ కొనుగోలు వార్తలపై వ్యాఖ్యానించేందుకు కోటక్‌ మహీంద్రా గ్రూప్‌ నిరాకరించింది. అయితే, ఇటీవలే నిధులు సమీకరించిన నేపథ్యంలో కంపెనీలు, అసెట్ల కొనుగోలు అవకాశాలను పరిశీలిస్తూనే ఉంటామని పేర్కొంది. గ్రూప్‌ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ జైమిన్‌ భట్‌ ఈ విషయాలు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో కోటక్‌ మహీంద్రా గ్రూప్‌ రూ. 7,000 కోట్లు సమీకరించింది. ‘క్యూ1లో ఈ నిధులను సమీకరించినప్పుడే మేం .. అసెట్స్, కంపెనీల్లాంటివి కొనుగోలు చేసే అవకాశాలను పరిశీలిస్తామని చెప్పాం. కాబట్టి అలాంటి అవకాశాలేమైనా వస్తే కచ్చితంగా పరిశీలిస్తాం. కాకపోతే దీనిపై (ఇండస్‌ఇండ్‌) వ్యాఖ్యానించడానికేమీ లేదు‘ అని భట్‌ చెప్పారు.  
డీల్‌ వార్తల నేపథ్యంలో బీఎస్‌ఈలో కేఎంబీ షేరు 2.36 శాతం పెరిగి రూ. 1,416 వద్ద ముగిసింది. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేరు దాదాపు 1 శాతం పెరిగి రూ. 616 వద్ద క్లోజయ్యింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement