ఆన్‌లైన్ రిటైల్ పోర్టల్ స్నాప్‌డీల్‌పై వచ్చిన ఆరోపణలపై సంస్థ స్పందించింది. చట్టం, నిబంధనల ప్రకారం విక్రయాదారులు వ్యవహరించాల్సి ఉందని పేర్కొంది. కన్సూమర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి సెంటర్ (సీఈఆర్‌సీ) అంశాలను పరిగణనలోకి తీసుకొని విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది.
నకిలి ఉత్పత్తుల బెడద ప్రపంచవ్యాప్తంగా ఉందని అందుకే బ్రాండ్ షీల్డ్ ద్వారా వీటి నిరోధానికి తాము ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది. థర్డ్ పార్టీ బ్రాండ్ల విషయంలో పూర్తి పరిశీలన అనంతరం ఆయా బ్రాండ్లు నకిలీవని తేలితే వెంటనే కేవలం ఒక రోజులోనే వాటిని తొలగిస్తున్నామని తెలిపింది. మార్కెట్ ప్లేస్ ఆధారిత అమ్మకాల్లో ఆయా ఉత్పత్తిదారులు, విక్రయదారులు వీటికి బాధ్యత వహిస్తారని తెలిపింది. ఈ మేరకు స్నాప్‌డీల్ ప్రతినిధి మంగళవారం ఒక ప్రకటన జారీ చేశారు. 2018 జనవరినుంచి అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం ప్యాకేజీలపై ధర, ఉత్పత్తిదారుడు పేరు, తేదీ, ఎక్స్‌పైరీ తేదీ వివరాలను అందించాల్సిన బాధ్యత సెల్లర్స్‌కు ఉందని పేర్కొన్నారు.
కాగా భారీ డిస్కౌంట్లు ఇచ్చేందుకు పలు వస్తువుల ఎంఆర్‌పీలను స్నాప్‌డీల్ పెంచేస్తూ, అక్రమాలకు పాల్పడుతూ వినియోగదారులకు టోకరా ఇస్తోందని తాజా అథ్యయనం వెల్లడించింది. అధిక ధరలతో, అరకొర లేబిలింగ్‌తో ఉన్న ఉత్పత్తులన్నింటినీ స్నాప్‌డీల్ ఉపసంహరించేలా చర్యలు చేపట్టాలంటూ అహ్మదాబాద్‌కు చెందిన కన్సూమర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి సెంటర్ (సీఈఆర్‌సీ)డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ)ని ఆశ్రయించింది. స్నాప్‌డీల్‌లో ఉత్పత్తుల వారీగా ఎంత ధరలకు విక్రయిస్తున్నారనే దానిపై సమగ్ర దర్యాప్తు అవసరమని సీఈఆర్‌సీ సీజీఎం ప్రీతి షా డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment