MRP rate
-
ఆరోపణలపై స్పందించిన స్నాప్‌డీల్
ఆన్లైన్ రిటైల్ పోర్టల్ స్నాప్‌డీల్‌పై వచ్చిన ఆరోపణలపై సంస్థ స్పందించింది. చట్టం, నిబంధనల ప్రకారం విక్రయాదారులు వ్యవహరించాల్సి ఉందని పేర్కొంది. కన్సూమర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి సెంటర్ (సీఈఆర్సీ) అంశాలను పరిగణనలోకి తీసుకొని విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. నకిలి ఉత్పత్తుల బెడద ప్రపంచవ్యాప్తంగా ఉందని అందుకే బ్రాండ్ షీల్డ్ ద్వారా వీటి నిరోధానికి తాము ప్రయత్నిస్తున్నామని వెల్లడించింది. థర్డ్ పార్టీ బ్రాండ్ల విషయంలో పూర్తి పరిశీలన అనంతరం ఆయా బ్రాండ్లు నకిలీవని తేలితే వెంటనే కేవలం ఒక రోజులోనే వాటిని తొలగిస్తున్నామని తెలిపింది. మార్కెట్ ప్లేస్ ఆధారిత అమ్మకాల్లో ఆయా ఉత్పత్తిదారులు, విక్రయదారులు వీటికి బాధ్యత వహిస్తారని తెలిపింది. ఈ మేరకు స్నాప్‌డీల్ ప్రతినిధి మంగళవారం ఒక ప్రకటన జారీ చేశారు. 2018 జనవరినుంచి అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం ప్యాకేజీలపై ధర, ఉత్పత్తిదారుడు పేరు, తేదీ, ఎక్స్పైరీ తేదీ వివరాలను అందించాల్సిన బాధ్యత సెల్లర్స్‌కు ఉందని పేర్కొన్నారు. కాగా భారీ డిస్కౌంట్లు ఇచ్చేందుకు పలు వస్తువుల ఎంఆర్పీలను స్నాప్‌డీల్ పెంచేస్తూ, అక్రమాలకు పాల్పడుతూ వినియోగదారులకు టోకరా ఇస్తోందని తాజా అథ్యయనం వెల్లడించింది. అధిక ధరలతో, అరకొర లేబిలింగ్‌తో ఉన్న ఉత్పత్తులన్నింటినీ స్నాప్‌డీల్ ఉపసంహరించేలా చర్యలు చేపట్టాలంటూ అహ్మదాబాద్‌కు చెందిన కన్సూమర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి సెంటర్ (సీఈఆర్సీ)డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ)ని ఆశ్రయించింది. స్నాప్‌డీల్‌లో ఉత్పత్తుల వారీగా ఎంత ధరలకు విక్రయిస్తున్నారనే దానిపై సమగ్ర దర్యాప్తు అవసరమని సీఈఆర్సీ సీజీఎం ప్రీతి షా డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. -
సినిమా ప్రేక్షకులకు గుడ్ న్యూస్
-
‘పైసా ఎక్కువ వసూలు చేసినా కేసే’
సాక్షి, హైదరాబాద్ : మల్టీప్లెక్స్‌లు, సినిమా హాళ్లల్లో ప్యాకేజ్డ్ వస్తువులను ఎంఆర్పీ రేటు కంటే ఎక్కువ ధరకు విక్రయించరాదని తూనికల, కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ స్పష్టం చేశారు. సినిమాహాళ్లలో, మల్టీప్లెక్స్‌లలో ఎంఆర్పి కంటే అధికంగా వసూలు చేస్తున్నారని అనేక ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో తూనికల కొలతల శాఖ గత నెలలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘిస్తున్న సంస్థలపై కేసులు నమోదు చేసింది. ఈ విషయంపై మంగళవారం రోజు పౌరసరఫరాల భవన్లో సినిమాహాల్స్, మల్టీప్లెక్స్ యజమాన్యాలతో అకున్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బహిరంగ మార్కెట్లో ఎంఆర్పీ ప్రకారం ఏవిధంగా అయితే వస్తువులను విక్రయిస్తారో అదే విధంగా సినిమాల హాళ్లు, మల్టిప్లెక్స్‌లలో కూడా విక్రయించాలని ఆదేశించారు. ఎంఆర్పి కంటే ఒక్క పైసా కూడా అధికంగా వసూలు చేయకూడదని స్పష్టం చేశారు. పైసా అదనంగా వసూలు చేసినా తూనికల కొలతల శాఖ ప్యాకేజ్డ్ కమోడిటీస్ నిబంధనలకు పూర్తి విరుద్ధమని పేర్కొన్నారు. వినియోగదారుల చట్టం ప్రకారం ప్రతి వస్తువు విక్రయానికి సంబంధించి వినియోగదారునికి ఖచ్చితంగా బిల్లు ఇవ్వాలని, ఇది ప్రతి మల్టీప్లెక్స్, సినిమా థియేటర్ యజమాన్యాల బాధ్యత అని పేర్కొన్నారు. సెప్టెంబర్ 1వ తేది నుంచి కచ్చితంగా ధరలను ముద్రించుకోవాలని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కేసులతో పాటు అధిక మొత్తంలో జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. వినియోగదారుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తే టోల్‌ఫ్రీ నంబర్ 180042500333, వాట్సాప్ నంబర్ 7330774444కు ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించారు. -
ఊరట: ఆ స్టాక్‌ను మరో మూడు నెలలు అమ్ముకోవచ్చు
సాక్షి, న్యూఢిల్లీ : జీఎస్టీ అమల్లోకి వచ్చే కొన్ని రోజుల ముందు వర్తకులు హడావుడిగా తన స్టాక్‌ను క్లియర్ చేసుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. బంపర్ డిస్కౌంట్లతో తమ పాత స్టాక్‌ను అమ్ముడుకోవడానికి ప్రయత్నించారు. ఆ తర్వాత మిగిలిపోయే స్టాక్‌కు కొత్త ఎంఆర్పీ రేట్లను ముద్రించి విక్రయించాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో ప్రభుత్వం కఠిన చర్యలే ఎదుర్కొంటారని వర్తకులను హెచ్చరించింది కూడా. చాలా మంది వర్తకులు వద్ద ఇంకా జీఎస్టీ ముందున్న స్టాక్ మిగిలిపోయే ఉంది. వాటికి కొత్త ఎంఆర్పీలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రీ-జీఎస్టీ స్టాక్‌పై వర్తకులకు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. ప్రీ-జీఎస్టీ ఉత్పత్తులను అమ్ముకోవడానికి తుది గడువును మూడు నెలల పాటు అంటే డిసెంబర్ 31 వరకు పొడిగించింది. ఈ గడువు పొడిగింపుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిందని, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీచేయాల్సి ఉందని ఆర్థిక మంత్రిత్వశాఖ వర్గాలు తెలిపిన సంగతి తెలిసిందే. -
మద్యం.. ప్రియం
♦ అమలుకాని ఎమ్మార్పీ ♦ క్వార్టర్ బాటిల్‌పై రూ.10 అదనపు వసూలు ♦ మందుబాబుల జేబులకు చిల్లు తణుకు: మద్యం విక్రయాల్లో ఎమ్మార్పీ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఎక్సైజ్ శాఖ కమిషనర్ చేసిన హెచ్చరికలు బేఖాతరవుతున్నాయి. మద్యం తమకు ఆదాయ వనరుకాదంటూ ఆ శాఖ మంత్రి ప్రకటనలు అపహాస్యమవుతున్నాయి. ఎవరెన్ని చెప్పినా మాకేంటి అంటూ మద్యం వ్యాపారులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఎమ్మార్పీకి మించి అదనపు వసూళ్లు చేస్తున్నారు. జాతీయ రహదారికి 500 మీటర్లు లోపు మద్యం దుకాణాలు, ఎక్కడిక్కడ బెల్టు దుకాణాలు ఏర్పాటు చేస్తున్నా.. పర్యవేక్షించాల్సిన అధికారులు కిమ్మనడం లేదు. ప్రస్తుతం పలుచోట్ల క్వార్టర్ బాటిల్‌పై రూ.10 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే ఈ దందా నడుస్తున్నట్టు సమచారం. ఈ విధానాన్ని జిల్లా అంతటా విస్తరించేలా కొందరు టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు. అదనం మామూలే జిల్లాలో మొత్తం 474 మద్యం దుకాణాలకు ఇప్పటి వరకు సుమారు 90 శాతం మేర దుకాణాలు ఏర్పాటు చేశారు. అనుమతులు వచ్చిన షాపుల యజమానులు సిండికేట్‌గా మారారు. దీంతో బ్రాండ్‌ను బట్టి బాటిల్‌కు రూ.20 నుంచి రూ.40 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మందుబాబుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఈ దోపిడీని అరికట్టేవారే లేరా? అంటూ పలువురు వాపోతున్నారు. ఎక్సైజ్ శాఖ కమిషనర్‌గా లక్ష్మీనర్సింహం బాధ్యతలు చేపట్టాక మద్యం సిండికేట్ల గుండెల్లో గుబులు మొదలైంది. ఆయన వచ్చిన వెంటనే ఎమ్మార్పీకు మించిన విక్రయాలపైనే దృష్టి సారించారు. అధికారులు మామూళ్లు తీసుకుని చూడనట్లు వదిలేస్తున్నారని వ్యాఖ్యలూ చేశారు. రెండు నెలల పాటు ఎమ్మార్పీకి మించిన విక్రయాలతోపాటు ముడుపుల బాగోతం ఆగింది. ప్రస్తుతం మరోసారి ఎమ్మార్పీకి మించిన విక్రయాలు ప్రారంభమయ్యాయి. జీఎస్టీ వల్ల ఎమ్మార్పీ కొత్త ధరలు బాటిల్‌పై ముద్రించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తుతోందని అధికారులు వెనకేసుకొస్తున్నారు. తణుకు, కొవ్వూరు, పెనుగొండ, పోలవరం సర్కిల్ పరిధిలో అదనపు వసూళ్లు చేస్తుండగా జిల్లాలో అన్ని ప్రాంతాల్లో ఎమ్మార్పీకి మించి విక్రయాలకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు లోపాయికారీ ఒప్పందాలు చేసుకుంటున్నట్టు సమాచారం. ‘కమిషనర్ సంగతి మేం చూసుకుంటాం.. మా సంగతి మీరు చూసుకోండి’ అని కొందరు నేతల ముసుగులో రంగంలోకి దిగారు. వారిదే కీలక పాత్ర సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర రహదారుల వెంబడి ఉన్న షాపులను తొలగించాల్సి ఉన్నా ప్రభుత్వ స్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చి పాలకుల మనసు మార్చడంలో జిల్లాకు చెందిన కొందరు కీలక భూమిక పోషించారు. రాష్ట్ర రహదారులను జిల్లా ప్రధాన రహదారులుగా మార్చి సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పక్కన పెట్టేందుకు దోహదపడ్డారు. మద్యం వ్యాపారంలో చక్రం తిప్పుతున్న కొందరు వ్యూహాత్మకంగా అడ్డంకులు తొలగించుకుంటున్నట్లు సమాచారం. మద్యం షాపుల ఏర్పాటుపై పెద్ద ఎత్తున మహిళలు ఆందోళనలు చేసినా ప్రభుత్వం మద్యం వ్యాపారులకే బాసటగా నిలిచింది. ఇళ్లు, పాఠశాలలు, ఆలయాల మధ్యనే షాపులు ఏర్పాటు చేసుకునేలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు కమిషనర్ లక్ష్మీనర్సింహం రాకతో ఈసారి ఎమ్మార్పీ మించి విక్రయాలకు బ్రేక్ పడుతుందని అందరూ భావించారు. అందుకు తగినట్లుగా ఎక్కడైనా ఎమ్మార్పీకి మించి విక్రయాలు చేపట్టినా, ముడుపుల భాగోతం నడిచినా తనకు ఫోన్లో ఫిర్యాదు చేయాలని కమిషనర్ పిలుపునిచ్చారు. అయితే కమిషనర్ సంగతి చూసుకుంటామనుకున్నారో ఏమో తెలియదు గానీ నేతల కనుసన్నల్లో మరోసారి ఎమ్మార్పీకి మించిన విక్రయాలకు తెరలేపారు. చర్యలు తీసుకుంటాం ఎమ్మార్పీకి మించి అదనంగా వసూలు చేయకుండా కట్టుదిట్టంగా చర్యలు చేపట్టాం. అన్నిచోట్లా ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటుచేశాం. ఎక్కడైనా వసూలు చేస్తున్నట్లు సమాచారం ఉంటే చర్యలు తప్పవు. – కె.శ్రీనివాస్, ఎక్సైజ్ సూపరింటెండెంట్, భీమవరం