
సమావేశంలో మాట్లాడుతున్న అకున్ సబర్వాల్
సాక్షి, హైదరాబాద్ : మల్టీప్లెక్స్‌లు, సినిమా హాళ్లల్లో ప్యాకేజ్డ్ వస్తువులను ఎంఆర్‌పీ రేటు కంటే ఎక్కువ ధరకు విక్రయించరాదని తూనికల, కొలతల శాఖ కంట్రోలర్ అకున్ సబర్వాల్ స్పష్టం చేశారు. సినిమాహాళ్లలో, మల్టీప్లెక్స్‌లలో ఎంఆర్‌పి కంటే అధికంగా వసూలు చేస్తున్నారని అనేక ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో తూనికల కొలతల శాఖ గత నెలలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నిబంధనలు ఉల్లంఘిస్తున్న సంస్థలపై కేసులు నమోదు చేసింది.
ఈ విషయంపై మంగళవారం రోజు పౌరసరఫరాల భవన్‌లో సినిమాహాల్స్, మల్టీప్లెక్స్ యజమాన్యాలతో అకున్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..బహిరంగ మార్కెట్‌లో ఎంఆర్‌పీ ప్రకారం ఏవిధంగా అయితే వస్తువులను విక్రయిస్తారో అదే విధంగా సినిమాల హాళ్లు, మల్టిప్లెక్స్‌లలో కూడా విక్రయించాలని ఆదేశించారు. ఎంఆర్‌పి కంటే ఒక్క పైసా కూడా అధికంగా వసూలు చేయకూడదని స్పష్టం చేశారు. పైసా అదనంగా వసూలు చేసినా తూనికల కొలతల శాఖ ప్యాకేజ్డ్ కమోడిటీస్ నిబంధనలకు పూర్తి విరుద్ధమని పేర్కొన్నారు. వినియోగదారుల చట్టం ప్రకారం ప్రతి వస్తువు విక్రయానికి సంబంధించి వినియోగదారునికి ఖచ్చితంగా బిల్లు ఇవ్వాలని, ఇది ప్రతి మల్టీప్లెక్స్, సినిమా థియేటర్ యజమాన్యాల బాధ్యత అని పేర్కొన్నారు.
సెప్టెంబర్ 1వ తేది నుంచి కచ్చితంగా ధరలను ముద్రించుకోవాలని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కేసులతో పాటు అధిక మొత్తంలో జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. వినియోగదారుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తే టోల్‌ఫ్రీ నంబర్ 180042500333, వాట్సాప్ నంబర్ 7330774444కు ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment