మద్యం.. ప్రియం | mrp rates not printing on alcohol quarter bottles | Sakshi
Sakshi News home page

మద్యం.. ప్రియం

Published Thu, Aug 31 2017 11:32 AM | Last Updated on Sun, Sep 17 2017 6:12 PM

మద్యం.. ప్రియం

మద్యం.. ప్రియం

అమలుకాని ఎమ్మార్పీ
క్వార్టర్‌ బాటిల్‌పై రూ.10 అదనపు వసూలు
మందుబాబుల జేబులకు చిల్లు


తణుకు:
మద్యం విక్రయాల్లో ఎమ్మార్పీ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ చేసిన హెచ్చరికలు బేఖాతరవుతున్నాయి. మద్యం తమకు ఆదాయ వనరుకాదంటూ ఆ శాఖ మంత్రి ప్రకటనలు అపహాస్యమవుతున్నాయి. ఎవరెన్ని చెప్పినా మాకేంటి అంటూ మద్యం వ్యాపారులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. ఎమ్మార్పీకి మించి అదనపు వసూళ్లు చేస్తున్నారు. జాతీయ రహదారికి 500 మీటర్లు లోపు మద్యం దుకాణాలు, ఎక్కడిక్కడ బెల్టు దుకాణాలు ఏర్పాటు చేస్తున్నా.. పర్యవేక్షించాల్సిన అధికారులు కిమ్మనడం లేదు. ప్రస్తుతం పలుచోట్ల క్వార్టర్‌ బాటిల్‌పై రూ.10 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే ఈ దందా నడుస్తున్నట్టు సమచారం. ఈ విధానాన్ని జిల్లా అంతటా విస్తరించేలా కొందరు టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు.


అదనం మామూలే
జిల్లాలో మొత్తం 474 మద్యం దుకాణాలకు ఇప్పటి వరకు సుమారు 90 శాతం మేర దుకాణాలు ఏర్పాటు చేశారు. అనుమతులు వచ్చిన షాపుల యజమానులు సిండికేట్‌గా మారారు. దీంతో బ్రాండ్‌ను బట్టి బాటిల్‌కు రూ.20 నుంచి రూ.40 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మందుబాబుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఈ దోపిడీని అరికట్టేవారే లేరా? అంటూ పలువురు వాపోతున్నారు. ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌గా లక్ష్మీనర్సింహం బాధ్యతలు చేపట్టాక మద్యం సిండికేట్ల గుండెల్లో గుబులు మొదలైంది.

ఆయన వచ్చిన వెంటనే ఎమ్మార్పీకు మించిన విక్రయాలపైనే దృష్టి సారించారు. అధికారులు మామూళ్లు తీసుకుని చూడనట్లు వదిలేస్తున్నారని వ్యాఖ్యలూ చేశారు. రెండు నెలల పాటు ఎమ్మార్పీకి మించిన విక్రయాలతోపాటు ముడుపుల బాగోతం ఆగింది. ప్రస్తుతం మరోసారి ఎమ్మార్పీకి మించిన విక్రయాలు ప్రారంభమయ్యాయి. జీఎస్టీ వల్ల ఎమ్మార్పీ కొత్త ధరలు బాటిల్‌పై ముద్రించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తుతోందని అధికారులు వెనకేసుకొస్తున్నారు. తణుకు, కొవ్వూరు, పెనుగొండ, పోలవరం సర్కిల్‌ పరిధిలో అదనపు వసూళ్లు చేస్తుండగా జిల్లాలో అన్ని ప్రాంతాల్లో ఎమ్మార్పీకి మించి విక్రయాలకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు లోపాయికారీ ఒప్పందాలు చేసుకుంటున్నట్టు సమాచారం. ‘కమిషనర్‌ సంగతి మేం చూసుకుంటాం.. మా సంగతి మీరు చూసుకోండి’ అని కొందరు నేతల ముసుగులో రంగంలోకి దిగారు.

వారిదే కీలక పాత్ర
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర రహదారుల వెంబడి ఉన్న షాపులను తొలగించాల్సి ఉన్నా ప్రభుత్వ స్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చి పాలకుల మనసు మార్చడంలో జిల్లాకు చెందిన కొందరు కీలక భూమిక పోషించారు. రాష్ట్ర రహదారులను జిల్లా ప్రధాన రహదారులుగా మార్చి సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పక్కన పెట్టేందుకు దోహదపడ్డారు. మద్యం వ్యాపారంలో చక్రం తిప్పుతున్న కొందరు వ్యూహాత్మకంగా అడ్డంకులు తొలగించుకుంటున్నట్లు సమాచారం. మద్యం షాపుల ఏర్పాటుపై పెద్ద ఎత్తున మహిళలు ఆందోళనలు చేసినా ప్రభుత్వం మద్యం వ్యాపారులకే బాసటగా నిలిచింది.

ఇళ్లు, పాఠశాలలు, ఆలయాల మధ్యనే షాపులు ఏర్పాటు చేసుకునేలా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మరోవైపు కమిషనర్‌ లక్ష్మీనర్సింహం రాకతో ఈసారి ఎమ్మార్పీ మించి విక్రయాలకు బ్రేక్‌ పడుతుందని అందరూ భావించారు. అందుకు తగినట్లుగా ఎక్కడైనా ఎమ్మార్పీకి మించి విక్రయాలు చేపట్టినా, ముడుపుల భాగోతం నడిచినా తనకు ఫోన్‌లో ఫిర్యాదు చేయాలని కమిషనర్‌ పిలుపునిచ్చారు. అయితే కమిషనర్‌ సంగతి చూసుకుంటామనుకున్నారో ఏమో తెలియదు గానీ నేతల కనుసన్నల్లో మరోసారి ఎమ్మార్పీకి మించిన విక్రయాలకు తెరలేపారు.

చర్యలు తీసుకుంటాం ఎమ్మార్పీకి మించి
అదనంగా వసూలు చేయకుండా కట్టుదిట్టంగా చర్యలు చేపట్టాం. అన్నిచోట్లా  ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటుచేశాం. ఎక్కడైనా
వసూలు చేస్తున్నట్లు సమాచారం ఉంటే చర్యలు తప్పవు. – కె.శ్రీనివాస్, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్, భీమవరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement