బీజేపీ ఐటీ సెల్ పై సంచలన ఆరోపణలు
- ఆమిర్ ను తొలగించేలా స్నాప్ డీల్ పై ఒత్తిడి
- ఏకంగా ఐటీసెల్ చీఫ్ నుంచి ఆదేశాలు
- మాజీ వాలంటీర్ ఆరోపణలు
గత ఏడాది నవంబర్ లో అసహనం వివాదంపై ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి. మోదీ ప్రభుత్వాన్ని విమర్శించేరీతిలో ఆయన వ్యాఖ్యలు ఉండటంతో ఆయనను తన బ్రాండ్ అంబాసిడర్ గా తొలగించేలా ప్రముఖ ఈ-కామర్స్ వెబ్ సైట్ స్నాప్ డీల్ పై ఒత్తిడి తేవాలని ఏకంగా బీజేపీ సోషల్ మీడియా సెల్ నుంచి ఆదేశాలు వచ్చినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ వివాదంలో స్నాప్ డీల్ పై ఒత్తిడి పెంచేలా సోషల్ మీడియాలో, వాట్సాప్ లలో ప్రచారం ముమ్మరం చేయాలని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అరవింద్ గుప్తా తన శ్రేణులకు సూచించారని మాజీ వాలంటీర్ ఒకరు వెల్లడించారు. గతంలో బీజేపీ సోషల్ మీడియా సెల్ వాలంటీర్ గా పనిచేసిన సాధ్వి ఖోస్లా త్వరలో తీసుకువస్తున్న ఓ పుస్తకంలో ఈ ఆరోపణలు చేశారు. గత ఏడాది చివర్లో వాలంటీర్ గా తప్పుకొన్న ఆమె ప్రస్తుతం 'ఐ యామ్ ద ట్రోల్' పేరిట ఒక పుస్తకాన్ని తీసుకువస్తున్నారు.
2015 నవంబర్ 23న ఓ కార్యక్రమంలో ఆమిర్ ఖాన్ మాట్లాడుతూ దేశంలో అసహనం వివాదం నేపథ్యంలో తన భార్య భారత్ విడిచివెళ్లిపోదామా? అని అడిగిందని, దేశంలోని భయానక పరిస్థితి ఆమెతో అలా అనిపించిందని పేర్కొన్నాడు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆమిర్ ను ఇరకాటంలో పెట్టే ప్రచారానికి బీజేపీ ఐటీ సెల్ పూనుకుందని, ఆయనను స్నాప్ డీల్ బ్రాండ్ అంబాసిడర్ గా తొలగించేలా ఒత్తిడి తెచ్చిందని ఆమె ఖోస్లా ఆరోపించారు.
ఏకంగా పార్టీ ఐటీ సెల్ చీఫ్ అరవింద్ గుప్తా ఈ విషయంలో సూచనలు ఇస్తూ వాట్సాప్ లో తనకు మెసేజ్ లు పంపించారని, అంతేకాకుండా ఆమిర్ ను తొలగించేందుకు ఉద్దేశించిన ఆన్ లైన్ పిటిషన్ పై నెటిజన్లతో సంతకాలు చేయించాలని సూచిస్తూ లింక్ కూడా పంపించారని ఆమె పేర్కొన్నారు. ఈ వివాదం నేపథ్యంలో 2016 జనవరిలో బ్రాండ్ అంబాసిడర్ గా ఆమిర్ కాంట్రాక్టు ముగియగా.. దానిని స్నాప్ డీల్ కొనసాగించలేదు. అయితే, ఈ పుస్తకంలోని ఆరోపణలను అరవింద్ గుప్తా తిరస్కరించారు. ఆమె కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఇలాంటి ఆరోపణలు చేస్తున్నదని, తాము ట్రోల్ ను ఎప్పుడూ ప్రోత్సహించలేదని చెప్పారు.