బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదం (ఫైల్ ఫోటో)
ముంబై : ప్రేమ రెండు మనసులకు సంబంధించినది. ఒక అబ్బాయి తాను ఇష్టపడే అమ్మాయికి ప్రేమను వ్యక్తం చేశాక, ఆ ప్రేమను ఆమె తిరస్కరించవచ్చు, అంగీకరించవచ్చు. ఆమె నిర్ణయాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి అబ్బాయికి ఉంటుంది. కానీ గటోకోపర్ నియోజకవర్గపు బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదం చేసిన వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తున్నాయి. ఒక అమ్మాయిని ప్రేమించి తన ప్రేమను వ్యక్తం చేశాకా... అబ్బాయిని తిరస్కరిస్తే... అలాంటి అమ్మాయిలను కిడ్నాప్ చేసైనా సరే ఆ అబ్బాయికిచ్చే వివాహం జరిపిస్తానంటూ రామ్ కదం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అమ్మాయికి ఇష్టం లేకపోయినా.. అబ్బాయిల కోసం ఆమెను కిడ్నాప్ చేస్తా అనడం వివాదాస్పదంగా మారింది. కదం ఈ వ్యాఖ్యలను చాలా సీరియస్‌గా చేశారు. అంతే కాకుండా వారికి సాయం చేసేందుకు, ఏ సమయంలోనైనా సరే తనకు ఒక్క ఫోన్ కాల్ కొట్టడంటూ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారు. ఒక్క ఫోన్ చేస్తే చాలు అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చి అబ్బాయితో పెళ్లి జరిపిస్తామని తెలిపారు.
"మీకు సాయం కావాల్సి వస్తే, నాకు ఫోన్ చేయండి. ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆమెనే పెళ్లి చేసుకుంటాను కానీ అమ్మాయి నా ప్రేమను తిరస్కరిస్తోంది అని చెప్పి సహాయం అడగండి. నేను తప్పకుండా సహాయం చేస్తాను. అదే సమయంలో మీ తల్లిదండ్రులను కూడా పిలిపించాలి. అమ్మాయి వారికి నచ్చితే నేనే కిడ్నాప్ చేసి అమ్మాయిని తీసుకొచ్చి అబ్బాయితో పెళ్లి జరిపిస్తా. ఇక నా ఫోన్ నెంబర్ తీసుకోండి" అంటూ దహీ హండీ(ఉట్టి కొట్టే) కార్యక్రమంలో పాల్గొన్న రామ్ కదం అన్నారు. రామ్ కదం చేసిన ఈ వ్యాఖ్యల వీడియోను ఎన్‌సీపీ జితేంద్ర అవధ్ ట్విటర్‌లో షేర్ చేశారు. ట్విటర్‌లో షేర్ చేసిన ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది.
కదం చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చట్టసభ్యులు ఇలా ఆలోచిస్తే, మహారాష్ట్రలో మహిళల రక్షణ ఎక్కడుంటుందని జితేంద్ర ప్రశ్నించారు. వీడియో వైరల్ కావడం, నెటిజెన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించడంతో రామ్ కదం ఆత్మరక్షణలో పడిపోయారు. ముందుగా పిల్లలు తల్లిదండ్రులకు తెలపాలని మాత్రమే తాను చెప్పినట్లు రామ్ కదం అంటున్నారు. రాజకీయ కుట్రతో కొందరు తనపై లేనిపోని నిందలు వేస్తున్నారని ఆరోపించారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే రామ్ కదం ఏటా గట్కోపర్‌లో దహీ హండీ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు హాజరవుతుంటారు. సోమవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఈ వేడుకలకు హాజరయ్యారు.
बेताल वक्तव्य करणारा भाजपा नेत्यांमध्ये आणखी ऐकाची भर.. रक्षाबंधन , दहिकाला उत्सव या पवित्र सणा दिवशी आमदाराने तोडले आपल्या अकलेचे तारे !
— Dr.Jitendra Awhad (@Awhadspeaks) September 4, 2018
कशा राहतील यांचा राज्यात महिला सुरक्षित? pic.twitter.com/Z5JAx5ewrN
Comments
Please login to add a commentAdd a comment