హైటెన్షన్ వైర్లు తెగిపడి 11మంది మృతి
గౌహతి: అసోంలోని టిన్‌సుకియా జిల్లాలో నిరసనకారుల ఆందోళన పెను ప్రమాదానికి దారి తీసింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరపడంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హై వోల్టేజీ కేబుల్ తెగిపడిన దుర్ఘటనలో 11మంది మరణించగా, మరో 20మందికి తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం..మూడు రోజుల క్రితం జరిగిన జంట హత్యలకు కారకులైన వారిని తమకు అప్పగించాలంటూ కొంతమంది...స్థానిక పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి విధ్వంసం సృష్టించారు. కత్తులు, కర్రలతో విధ్వంసం సృష్టించారు. పరిస్థితి అదుపు తప్పటంతో ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నంలో పోలీసులు కాల్పులు జరిపారు. అయితే గాల్లోకి దూసుకుపోయిన కొన్ని బుల్లెట్లు దగ్గరలో వున్న కరెంట్ పోల్‌కు తాకడంతో అది కుప్పకూలింది. అది నేరుగా ఆందోళన చేస్తున్న వారిపై పడటం, హై వోల్టేజి కేబుల్ వైర్లు వారిని తాకడం క్షణాల్లో జరిగిపోయింది.
ఘటనా స్థలంలోనే 9 మంది చనిపోగా, మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటనలో మరి కొంతమందికి బుల్లెట్ గాయాలు తగిలాయి. కాగా పరిస్థితి చేయి దాటడంతో గాల్లోకి, ఆందోళనకారులపై కాల్పులు జరపాల్సివ చ్చిందని డీజీపీ ముఖేష్ సహాయ్ చెప్పారు.కేంద్ర పారామిలిటరీ దళాలు, పోలీసు బలగాలను సంఘటనా స్థలానికి తరలించిన సీనియర్ అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఆందోళనకారులతో చర్చలు జరుపుతున్నారు.