సంక్షోభంలో స్నాప్‌డీల్‌!! | Crisis at Snapdeal: Founders take 100% salary cut | Sakshi
Sakshi News home page

సంక్షోభంలో స్నాప్‌డీల్‌!!

Published Thu, Feb 23 2017 12:38 AM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM

సంక్షోభంలో స్నాప్‌డీల్‌!! - Sakshi

సంక్షోభంలో స్నాప్‌డీల్‌!!

600 మంది ఉద్యోగుల తొలగింపు
జీతం వదులుకుంటున్న వ్యవస్థాపకులు
వ్యూహాల్లో తప్పిదాలు జరిగాయని ఒప్పుకోలు


న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌ అమ్మకాల్లో ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లకు గట్టిపోటీనిస్తూవచ్చిన స్నాప్‌డీల్‌ ప్రస్తుతం సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఇటు నిధుల ప్రవాహం మందగించడం, అటు నష్టాలు పెరుగుతుండటం వంటి అంశాలతో కంపెనీ కుదేలవుతోంది. ఈ నేపథ్యంలో ప్రాధాన్యేతర కార్యకలాపాల నుంచి తప్పుకోవాలని, వ్యయాలు భారీగా తగ్గించుకోవాలని సంస్థ నిర్ణయించింది. ఇందులో దాదాపు 500–600 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు సమాచారం. ఈ–కామర్స్‌ మార్కెట్‌ప్లేస్, మొబైల్‌ వాలెట్‌ సంస్థ ఫ్రీచార్జ్, లాజిస్టిక్స్‌ విభాగం వల్కన్‌ ఎక్స్‌ప్రెస్‌ మొదలైన అనుబంధ సంస్థల్లోని ఉద్యోగాల్లో కోత పడొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు, పై స్థాయిలోని మరికొందరు ఎగ్జిక్యూటివ్స్‌ జీతభత్యాల్లో కూడా కోత పడనుంది. కంపెనీ వ్యవస్థాపకులు కూడా తమ జీతాలను వదులుకోవాలని నిర్ణయించుకున్నారు.

తప్పు చేశాం..
కంపెనీని లాభాల్లోకి మళ్లించేందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను సమర్ధంగా వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నామని సంస్థ వ్యవస్థాపకుడు కునాల్‌ బెహల్‌.. ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇందులో భాగంగా తాను, మరో వ్యవస్థాపకుడు రోహిత్‌ బన్సల్‌ జీతాన్ని పూర్తిగా వదులుకుంటున్నామని వివరించారు. మరికొందరు పైస్థాయి ఎగ్జిక్యూటివ్స్‌ కూడా జీతంలో కోత విధించుకోవడానికి సిద్ధపడ్డారని ఆయన పేర్కొన్నారు. తమ వ్యాపార వ్యూహాల్లో తప్పిదాలు చోటుచేసుకున్నాయని ఈ సందర్భంగా ఆయన అంగీకరించారు. ‘ఈ మార్కెట్లోకి కుప్పతెప్పలుగా పెట్టుబడులు వచ్చి పడ్డాయి. దీంతో యావత్‌ పరిశ్రమతో పాటు మన సంస్థ కూడా తప్పిదాలు చేయడం ప్రారంభమైంది. సరైన లాభసాటి విధానం, మార్కెట్‌ గురించి పూర్తిగా అంచనా వేయకుండానే వ్యాపారాన్ని విస్తరించడం మొదలుపెట్టాం.

తొలి వెంచర్‌లో ఇంకా పట్టు సాధించకుండా.. లాభాలు చూడకుండానే ఇతరత్రా కొంగొత్త ప్రాజెక్టుల్లోకి అడుగుపెట్టాం. ప్రస్తుతం అవసరమైనదానికంటే కూడా అధిక స్థాయిలో టీమ్‌ను, ఇన్‌ఫ్రాను విస్తరించుకుంటూ పోయాం‘ అని బెహల్‌ పేర్కొన్నారు. కంపెనీని మళ్లీ గట్టెక్కించాలంటే.. ప్రధాన వ్యాపారంపై దృష్టిపెట్టి ప్రాధాన్యేతర వ్యాపారాల నుంచి వైదొలగడం, వ్యయాలను గణనీయంగా తగ్గించుకోవడం, సాధ్యమైనంత త్వరగా లాభాల బాట పట్టడం, వచ్చిన లాభాలనే వృద్ధికి.. కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉపయోగించుకోవడం వంటి చర్యలు అవసరమని  తెలిపారు. ఈ క్రమంలో కొందరు ఉద్యోగులకు ఉద్వాసన పలకాల్సి రావడం బాధాకరమైన అంశమని పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం సంస్థలో దాదాపు 8,000 మంది ఉద్యోగులు ఉన్నారు.

నష్టాలతో కుదేలు..
కొన్నాళ్ల క్రితం దాకా నంబర్‌ వన్‌ స్థానానికి పోటీపడిన స్నాప్‌డీల్‌.. గత పదిహేను నెలలుగా గడ్డుకాలం ఎదుర్కొంటోంది. పెరుగుతున్న నష్టాలు, టాప్‌ మేనేజ్‌మెంట్‌లో మార్పులు, పోటీ సంస్థ అమెజాన్‌ దూకుడుగా కార్యకలాపాలు విస్తరిస్తుండటం మొదలైన వాటితో స్నాప్‌డీల్‌ ఉక్కిరిబిక్కిరవుతోంది. 2015–2016 ఆర్థిక సంవత్సరంలో స్నాప్‌డీల్‌ సిబ్బంది సంబంధిత వ్యయాలు ఏకంగా 148 శాతం ఎగిసి రూ. 911 కోట్లకు పెరిగాయి. కంపెనీ అమ్మకాలు 56% వృద్ధితో రూ. 1,457 కోట్లు నమోదు కాగా.. నష్టాలు మాత్రం రెట్టింపై రూ. 2,960 కోట్లకు పెరిగాయి. స్నాప్‌డీల్‌ ఇటీవలే మార్కెట్‌ప్లేస్‌ షాపోను మూసివేసింది.

స్నాప్‌డీల్, ట్యాక్సీ సేవల సంస్థ ఓలాలో కూడా ఇన్వెస్ట్‌ చేసిన జపాన్‌ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్‌ ఈ రెండింటిలో కలిపి దాదాపు రూ. 3,226 కోట్ల (475 మిలియన్‌ డాలర్లు) రైటాఫ్‌ చేసింది. ఈ పరిస్థితుల నేపథ్యంలోనే స్నాప్‌డీల్‌ కఠిన నిర్ణయాలపై దృష్టి సారించింది. 2016 ఆఖరు నాటికి స్నాప్‌డీల్‌ మాతృసంస్థ జాస్పర్‌ ఇన్ఫోటెక్‌ బ్యాం కు ఖాతాల్లో రూ. 1,200 కోట్లు, డిజిటల్‌ చెల్లింపుల అనుబంధ సంస్థ ఫ్రీచార్జ్‌ ఖాతాల్లో సుమారు 300–400 కోట్లు ఉన్నట్లు అంచనా.

ఫ్రీచార్జ్‌ సీఈవో గోవింద్‌ రాజన్‌ రాజీనామా
స్నాప్‌డీల్‌ టాప్‌ మేనేజ్‌మెంట్‌లో మార్పులు, చేర్పులు కొనసాగుతున్నాయి. తాజాగా అనుబంధ సంస్థ ఫ్రీచార్జ్‌ సీఈవో గోవింద్‌ రాజన్‌ రాజీనామా చేశారు. దీనికి కారణాలేంటన్నది వెల్లడి కాలేదు. 2015లో ఈ మొబైల్‌ వాలెట్‌ సంస్థను స్నాప్‌డీల్‌ కొనుగోలు చేసిన అనంతరం రాజన్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌గా చేరారు. గతేడాది మే లో సీఈవోగా పదోన్నతి పొందారు. ఫ్రీచార్జ్‌కి 1 బిలియన్‌ డాలర్ల పైగా వేల్యుయేషన్‌తో సుమారు 150–200 మిలియన్‌ డాలర్లు సమీకరించాలని గత కొన్నాళ్లుగా కంపెనీ ప్రయత్నిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement