సాఫ్ట్‌బ్యాంకుకు 9,000 కోట్లు హుష్
♦ పెట్టుబడులకు అచ్చిరాని భారత్
♦ స్నాప్‌డీల్, ఓలాలో ఇన్వెస్ట్‌మెంట్స్‌తో భారీ నష్టాలు
న్యూఢిల్లీ: జపాన్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్‌కు భారత్‌లో పెట్టుబడులు అంతగా కలిసి రావడం లేదు. క్యాబ్ ఆగ్రిగేటర్ ఓలా, ఈ–కామర్స్ సంస్థ స్నాప్‌డీల్‌లో భారీగా పెట్టిన పెట్టుబడులు విలువ గణనీయంగా తరిగిపోతోంది. ఈ రెండింటిలో పెట్టిన పెట్టుబడుల విలువ ఏకంగా రూ.9 వేల కోట్ల మేర కరిగిపోయినట్లు సాఫ్ట్‌బ్యాంక్ వెల్లడించింది. స్నాప్‌డీల్‌లో పెట్టుబడుల కారణంగా సుమారు 1 బిలియన్ డాలర్ల మేర (దాదాపు రూ. 6,500 కోట్లు) నష్టాలు చవిచూడాల్సి వచ్చినట్లు తెలిపింది. ఈ మొత్తం 2016–17లో స్నాప్‌డీల్‌లో పెట్టిన పెట్టుబడులకు దాదాపు సమానం.
‘భారత ఈ కామర్స్ మార్కెట్లో పోటీ గణనీయంగా పెరిగిపోవడంతో సంస్థ వ్యాపార పనితీరు ఆశించిన దాని కన్నా తక్కువ స్థాయిలో ఉంది’’ అని ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా సాఫ్ట్‌బ్యాంక్ తెలిపింది. ‘అకౌంటింగ్ విధానాలు, కరెన్సీ హెచ్చుతగ్గులు, మార్కెట్ పరిణామాలకు అనుగుణంగా పెట్టుబడుల విలువ తరచూ పెరుగుతుండటం లేదా తగ్గుతుండటం జరుగుతుంది. తాజా ఫలితాలు పూర్తి ఆర్థిక సంవత్సరం చోటుచేసుకున్న పరిణామాలను ప్రతిఫలిస్తాయి‘ అని పేర్కొంది.
భారత మార్కెట్లో సుమారు 10 బిలియన్ డాలర్ల పైగా ఇన్వెస్ట్ చేయనున్నట్లు ప్రకటించిన సాఫ్ట్‌బ్యాంక్... ప్రస్తుతం స్నాప్‌డీల్‌ను ఫ్లిప్‌కార్ట్‌కు విక్రయించే ప్రణాళికపై కసరత్తు చేస్తోంది. ఈ ప్రతిపాదనకు దాదాపుగా స్నాప్‌డీల్ బోర్డు సభ్యులందరి దగ్గర్నుంచీ మద్దతు దక్కించుకున్న సాఫ్ట్‌బ్యాంక్ .. మరో కీలక ఇన్వెస్టరైన నెక్సస్ వెంచర్ పార్ట్‌నర్స్(ఎన్‌వీపీ) ఆమోదం కోసం ప్రయత్నిస్తోంది. ఎన్‌వీపీ కూడా విక్రయ ప్రతిపాదన పట్ల సుముఖంగా మారుతున్న నేపథ్యంలో త్వరలోనే ఈ డీల్‌కు ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
సమస్యల్లో స్టార్టప్‌లు ..
దేశీ సంస్థ ఫ్లిప్‌కార్ట్, అటు అమెరికన్ సంస్థ అమెజాన్ వంటి దిగ్గజాలతో పోటీపడలేక చతికిలబడిన స్నాప్‌డీల్ ప్రస్తుతం దేశీ ఈకామర్స్ మార్కెట్లో .. మూడో స్థానంలో ఉంది. సుమారు 6.5 బిలియన్ డాలర్ల వేల్యుయేషన్‌తో స్నాప్‌డీల్ 2016 ఫిబ్రవరిలో నిధులు సమీకరించింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం బిలియన్ డాలర్లకే ఫ్లిప్‌కార్ట్‌కు దీన్ని విక్రయించే అవకాశాలు ఉన్నట్లు అంచనా.
ఇక, సాఫ్ట్‌బ్యాంక్ ఇన్వెస్ట్ చేసిన మరో స్టార్టప్ ఓలా కూడా తీవ్రమైన పోటీ ఎదుర్కొంటోంది. అమెరికాకు చెందిన ప్రత్యర్థి సంస్థ ఉబెర్ భారీగా పెట్టుబడులు కుమ్మరిస్తూ దూసుకుపోతోంది. దీంతో ఓలా కూడా నిధులను కుమ్మరించక తప్పడం లేదు. భారీగా ప్రకటనలు, ప్రచార కార్యక్రమాలు, ఉద్యోగుల వ్యయాలతో 2015–16లో కన్సాలిడేటెట్ ప్రాతిపదికన ఓలా దాదాపు రూ. 2,311 కోట్ల నష్టాలు ప్రకటించింది.