'ఉద్యోగాల భద్రతే మాకు టాప్-ప్రియారిటీ'
'ఉద్యోగాల భద్రతే మాకు టాప్-ప్రియారిటీ'
Published Mon, Apr 10 2017 9:05 AM | Last Updated on Mon, Oct 22 2018 5:27 PM
బెంగళూరు : నిన్నమొన్నటిదాకా ఆన్ లైన్ షాపింగ్ లో మారుమోగిన స్మాప్ డీల్ పరిస్థితి ప్రస్తుతం అతలాకుతలంగా మారింది. ఆ నష్టాలను అధిగమించడానికి ప్రత్యర్థైన ఫ్లిప్ కార్ట్ కు స్నాప్ డీల్ ను అమ్మేస్తున్నారంటూ వార్తలు ఊపందుకున్నాయి. కానీ ఇప్పటివరకు దానిపై స్నాప్ డీల్ ఎలాంటి కామెంట్ చేయనప్పటికీ, ఉద్యోగులు మాత్రం తమ ఉద్యోగాలపై ఆందోళన చెందుతున్నారు. అయితే ఉద్యోగుల భద్రతకు ఎలాంటి ముప్పు ఉండదని కంపెనీ వ్యవస్థాపకులు కునాల్ బహల్, రోహిత్ బన్సాల్ భరోసా ఇస్తున్నారు. కంపెనీ ఇన్వెస్టర్లు వివిధ రకాల ఆప్షన్లపై చర్చలు సాగిస్తున్నప్పటికీ.. తాము మాత్రం జాబ్ సెక్రురిటీకే టాప్-ప్రియారిటీ ఇస్తామని చెప్పారు.
ఉద్యోగాలకు భరోసా ఇస్తూ ఈ మేరకు ఓ ఈ-మెయిల్ ను ఆదివారం బహల్, స్నాప్ డీల్ ఉద్యోగులకు పంపారు. ''మేము చేయగలిగిందంతా చేస్తాం.. అంతకంటే ఎక్కువ చేయడానికైనా మేము సిద్ధమే. ఇన్వెస్టర్లతో కలిసి పనిచేసేటప్పుడు, ఎంప్లాయిమెంట్లో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూసుకుంటాం'' అని ఈ-మెయిల్ లో తెలిపారు. గత రెండు నెలలుగా కంపెనీ భవితవ్యంపై ఉద్యోగుల్లో నెలకొన్న అనిశ్చితిపై వ్యవస్థాపకులు భరోసా కల్పిస్తూ స్పందించడం ఇది మూడోసారి. వచ్చే రెండు వారాల్లో ఇంక్రిమెంట్లు ప్రకటించబోతున్నట్టు కూడా వ్యవస్థాపకులు పేర్కొన్నారు. శరవేగంగా దూసుకెళ్తున్న ఈ-కామర్స్ మార్కెట్లో స్నాప్ డీల్ తట్టుకోలేక, నెంబర్ -2 స్థానాన్ని కోల్పోయింది. మరోవైపు ఊహాగానాలను నిజం చేస్తూ ఫ్లిప్ కార్ట్ కు స్నాప్ డీల్ అమ్మే విషయాన్ని కంపెనీ ఈ నెలలోనే ప్రకటించబోతుందట.
Advertisement