ఫ్లిప్‌కార్ట్‌కు షాకిస్తున్న స్నాప్‌డీల్
ఫ్లిప్‌కార్ట్‌కు షాకిస్తున్న స్నాప్‌డీల్
Published Fri, Jul 14 2017 11:42 AM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM
న్యూఢిల్లీ : ఈ-కామర్స్ మార్కెట్‌లో దిగ్గజ కంపెనీగా ఉన్న ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌ను తిరస్కరించి, మరో కంపెనీకి చేయి అందిస్తోంది స్నాప్‌డీల్. కొనుగోలుకు తక్కువ విలువ కడుతున్న ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌కు నో చెప్పిన స్నాప్‌డీల్, ఇక ఫ్లిప్‌కార్ట్‌కు అమ్మడం కంటే, మరో కంపెనీతో జతకట్టడమే మంచిదని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పబ్లిక్‌గా లిస్టు అయిన ఒకే ఒక్క ఈ-కామర్స్ కంపెనీగా పేరున్న ఇన్ఫీబీమ్‌తో స్నాప్‌డీల్ విలీన చర్చలు జరుపుతున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ఈ రెండింటి మధ్య డీల్ 1 బిలియన్ డాలర్ల(రూ.6446కోట్లకు పైగా)కు కుదురుతున్నట్టు కూడా తెలిపాయి. గతవారమే ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేసిన 700-750 మిలియన్ డాలర్ల డీల్‌ను స్నాప్‌డీల్ బోర్డు తిరస్కరించింది. ఆ ఆఫర్‌ను స్నాప్‌డీల్ తిరస్కరించడంతో మరోసారి ఆ కంపెనీకి 900-950 మిలియన్ డాలర్లకు విలువకట్టాలని మరోవైపు నుంచి ఫ్లిప్‌కార్ట్ చూస్తోంది. కానీ స్నాప్‌డీల్, ఇన్ఫీబీమ్‌తో చర్చలు సాగిస్తోంది.
ప్రస్తుతం ఇన్ఫీబీమ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6106 కోట్లగా ఉంది. స్నాప్‌డీల్ రాకతో వీటి విలీన సంస్థ 2 బిలియన్ సంస్థగా అవతరించనుంది. అయితే ఈ డీల్‌లో స్నాప్‌డీల్ లాజిస్టిక్ బిజినెస్‌లు వుల్కాన్ ఎక్స్‌ప్రెస్(లాజిస్టిక్ విభాగం), పేమెంట్స్ ప్లాట్‌ఫామ్ ప్రీఛార్జ్‌లను కలుపడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం స్నాప్‌డీల్ ముందు మూడు ఆప్షన్లున్నాయని కంపెనీ సహవ్యవస్థాపకుడు, సీఈఓ కునాల్ బహల్ చెప్పారు. ఒకటి ఫ్లిప్‌కార్ట్‌తో క్లోజ్ డీల్‌కు ఆమోదించడం, రెండు ఇన్ఫీబీమ్‌తో విలీనమవ్వడం లేదా స్వతంత్ర సంస్థగా ఉండటానికి వుల్కాన్ ఎక్స్‌ప్రెస్, ఫ్రీఛార్జ్‌లను వంటి ఆస్తులను అమ్మేసి నిధులు సేకరించడం అని ఆయన చెప్పారు. ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తున్న ఆఫర్‌కు మెజార్టీ, మెనార్టీ షేర్‌హోల్డర్స్ మధ్య ఆమోదం రాకపోవడంతో ఇది తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే. తాజాగా ఇన్ఫీబీమ్‌తో జరుపుతున్న తాజా చర్చలు షేర్‌హోల్డర్స్ ఆమోదిస్తున్నారో లేదో ఇంకా స్పష్టంకాలేదు.
Advertisement
Advertisement