infibeam
-
గూగుల్, ఫేస్‌బుక్‌తో రిలయన్స్ జట్టు
రిటైల్ పేమెంట్స్ లైసెన్స్ కోసం టెక్ దిగ్గజం గూగుల్, ఫేస్బుక్ సంస్థలతో కలిసి ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ న్యూ అంబ్రెల్లా ఎంటిటీ(ఎన్‌యూఐ)ని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. దేశీయంగా డిజిటల్ పేమెంట్స్ మార్కెట్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేజ్(యూపీఐ) మాదిరిగానే వాటా పొందేందుకు రిలయన్స్ ఆసక్తి కనబరుస్తుంది. దీనికోసం రిలయన్స్, గూగుల్, ఫేస్బుక్ సంస్థలు సో హమ్ భారత్ అనుబంధ సంస్థ ఇన్ఫీబీమ్ ఎవెన్యూస్ లిమిటెడ్ సంస్థతో కలిసి ఎన్‌యూఐ లైసెన్స్ కోసం భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ)కి దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ బృందంలో గూగుల్, ఫేస్బుక్ తక్కువ వాటాను కలిగి ఉన్నాయి. దేశ డిజిటల్ ఎకానమీని బలోపేతం చేయడానికి తమ బృందం ఒక ప్లాన్‌ను ఆర్బీఐకి సమర్పించినట్లు తెలుస్తుంది. భారతదేశంలో యూపీఐ, ఇతర డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలు విజయవంతం కావడంతో ఆర్బీఐ 2020 ఆగస్టులోఎన్యూఐ బిడ్లను ఆహ్వానించింది. ఆర్బిఐ ఇటీవల ఎన్యుయు దరఖాస్తుల గడువును మార్చి 31, 2021కు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఆరు నెలల్లో సెంట్రల్ బ్యాంక్ ఈ ప్రతిపాదనలను అధ్యయనం చేస్తుంది. రిలయన్స్‌తో పాటు టాటా గ్రూప్, అమెజాన్-ఐసీఐసీఐ బ్యాంక్-యాక్సిస్ బ్యాంక్, పేటీఎం-ఓలా-ఇండస్లాండ్ బ్యాంక్ వేర్వేరుగా ఎన్యూఐల కోసం ఆర్బీఐకి దరఖాస్తులు చేసేందుకు సిద్ధం అయ్యాయి. చదవండి: గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు భారీ ఊరట రెండు సెకన్లకు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్! -
ఒక్క వాట్సాప్ మెసేజ్ : రూ. 9,200 కోట్లు గోవింద..!!
న్యూఢిల్లీ: ఇన్ఫీబీమ్ అవెన్యూస్ షేర్ శుక్రవారం 70 శాతం.. అక్షరాలా 70 శాతం క్షీణించింది. బీఎస్ఈలో గురువారం రూ.196 వద్ద ముగిసిన ఈ షేర్ శుక్రవారం 70.24 శాతం(రూ.139) నష్టపోయి రూ.58.80 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 73 శాతం పతనంతో తాజా ఏడాది కనిష్ట స్థాయి, రూ.53.80ను తాకింది. బీఎస్ఈలో 1.9 కోట్లు, ఎన్ఎస్ఈలో 15 కోట్లకు పైగా షేర్లు ట్రేడయ్యాయి. ఒక్క రోజులోనే కంపెనీ మార్కెట్ క్యాప్ ముప్పావు వంతు, రూ. 9,200 కోట్లు హరించుకుపోయి రూ. 3,902 కోట్లకు పడిపోయింది. కంపెనీ వార్షిక సాధారణ సమావేశం(ఈజీఎమ్) నేడు(శనివారం) జరగనున్నది. అంతా ఆ మెసేజ్ వల్లే...! కంపెనీ అకౌంటింగ్ విధానాలపై ఆందోళన కలిగించే వాట్సాప్ మెసేజ్ ట్రేడర్ల మధ్య వైరల్ కావడంతో ఈ కంపెనీ షేర్ ఈ స్థాయిలో పడిపోయిందని నిపుణులంటున్నారు. ఈక్విరస్ సెక్యూరిటీస్ పేరు మీద ఈ వాట్సాప్ మెసేజ్ వచ్చిందని సమాచారం. అయితే కొన్ని నెలల క్రితమే ఈ మెసేజ్‌ను ఈక్విరస్ సంస్థ, కొంతమంది క్లయింట్లకు పంపించిందని, అయితే కంపెనీ ఏజీఎమ్‌కు ఒక్క రోజు ముందు ఈ మెసేజ్ వైరల్ అయిందని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. కంపెనీ స్వచ్ఛంద వివరణ... షేర్ ధర భారీగా పతనం కావడంతో ఇన్ఫీబీమ్ స్వచ్ఛందంగా వివరణ ఇచ్చింది. కంపెనీ పనితీరుపై ప్రభావం చూపించే ప్రతీ చిన్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు స్టాక్ ఎక్సే్చంజ్‌లకు అందజేస్తున్నామని ఇన్ఫీబీమ్ వెల్లడించింది. అంతేకాకుండా స్టాక్ ఎక్స్చేంజ్లు ఎప్పుడు, ఏ వివరం అడిగినా, సకాలంలో అందజేశామని పేర్కొంది. షేర్ ధరల సరళిని ప్రభావితం చేసే పెండింగ్ సమాచారమేదీ లేదని తెలిపింది. కాగా ఇన్ఫీబీమ్ కంపెనీ తన అనుబంధ సంస్థకు ఎలాంటి వడ్డీ లేకుండా రుణాన్ని ఇచ్చిందన్న వార్తల పట్ల బీఎస్ఈ వివరణ కోరింది. తమ అనుబంధ సంస్థ, ఎన్ఎస్ఐ ఇన్ఫీనీయమ్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఎలాంటి తనఖా లేకుండా వడ్డీ రహిత రుణాలిచ్చామని ఇన్ఫీబీమ్ కంపెనీ వివరణ ఇచ్చింది. ఆ కంపెనీ ఆరంభమైనప్పటి నుంచి ఈ తరహా రుణాలిస్తున్నామని, ఇవి స్వల్పకాలిక రుణాలని, తాము ఎప్పుడు అడిగితే అప్పుడు ఆ అనుబంధ కంపెనీ ఈ రుణాలను తీర్చేసేదని పేర్కొంది. పేలవంగా ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిస్టింగ్ రైల్వే ఇంజినీరింగ్, కన్స్ట్రక్షన్ కంపెనీ ఇర్కాన్ ఇంటర్నేషనల్ పేలవంగా లిస్టయింది. ఇష్యూ ధర రూ.475తో పోల్చితే ఎన్ఎస్ఈలో 13% నష్టంతో రూ.413 వద్ద లిస్టయింది. ఇంట్రాడేలో రూ.465, రూ.409 గరిష్ట, కనిష్ట స్థాయిలను తాకింది. చివరకు 13 శాతం నష్టంతో రూ.415 వద్ద ముగిసింది. మార్కెట్ ముగిసిన తర్వాత కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.3,919 కోట్లుగా ఉంది. మరోవైపు ప్రభుత్వ రంగ గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ ఐపీఓ శుక్రవారం పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయింది. ఈ ఐపీఓ ప్రైస్‌బాండ్ రూ.114–118. కాగా 4 కంపెనీలు–చార్టర్డ్ స్పీడ్, నెక్కన్ పవర్ అండ్ ఇన్ఫ్రా, నర్మద బయో–కెమ్, డయాగ్నస్టిక్స్ కంపెనీ మెట్రోపొలిస్ హెల్త్‌కేర్ కంపెనీలు కూడా ఐపీఓకు రావడం కోసం సెబీకి దరఖాస్తు చేశాయి. -
ఫ్లిప్‌కార్ట్‌కు షాకిస్తున్న స్నాప్‌డీల్
న్యూఢిల్లీ : ఈ-కామర్స్ మార్కెట్లో దిగ్గజ కంపెనీగా ఉన్న ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌ను తిరస్కరించి, మరో కంపెనీకి చేయి అందిస్తోంది స్నాప్‌డీల్. కొనుగోలుకు తక్కువ విలువ కడుతున్న ఫ్లిప్‌కార్ట్ ఆఫర్‌కు నో చెప్పిన స్నాప్‌డీల్, ఇక ఫ్లిప్‌కార్ట్‌కు అమ్మడం కంటే, మరో కంపెనీతో జతకట్టడమే మంచిదని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పబ్లిక్‌గా లిస్టు అయిన ఒకే ఒక్క ఈ-కామర్స్ కంపెనీగా పేరున్న ఇన్ఫీబీమ్తో స్నాప్‌డీల్ విలీన చర్చలు జరుపుతున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. ఈ రెండింటి మధ్య డీల్ 1 బిలియన్ డాలర్ల(రూ.6446కోట్లకు పైగా)కు కుదురుతున్నట్టు కూడా తెలిపాయి. గతవారమే ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేసిన 700-750 మిలియన్ డాలర్ల డీల్‌ను స్నాప్‌డీల్ బోర్డు తిరస్కరించింది. ఆ ఆఫర్‌ను స్నాప్‌డీల్ తిరస్కరించడంతో మరోసారి ఆ కంపెనీకి 900-950 మిలియన్ డాలర్లకు విలువకట్టాలని మరోవైపు నుంచి ఫ్లిప్‌కార్ట్ చూస్తోంది. కానీ స్నాప్‌డీల్, ఇన్ఫీబీమ్తో చర్చలు సాగిస్తోంది. ప్రస్తుతం ఇన్ఫీబీమ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6106 కోట్లగా ఉంది. స్నాప్‌డీల్ రాకతో వీటి విలీన సంస్థ 2 బిలియన్ సంస్థగా అవతరించనుంది. అయితే ఈ డీల్‌లో స్నాప్‌డీల్ లాజిస్టిక్ బిజినెస్‌లు వుల్కాన్ ఎక్స్‌ప్రెస్(లాజిస్టిక్ విభాగం), పేమెంట్స్ ప్లాట్‌ఫామ్ ప్రీఛార్జ్లను కలుపడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం స్నాప్‌డీల్ ముందు మూడు ఆప్షన్లున్నాయని కంపెనీ సహవ్యవస్థాపకుడు, సీఈఓ కునాల్ బహల్ చెప్పారు. ఒకటి ఫ్లిప్‌కార్ట్‌తో క్లోజ్ డీల్‌కు ఆమోదించడం, రెండు ఇన్ఫీబీమ్తో విలీనమవ్వడం లేదా స్వతంత్ర సంస్థగా ఉండటానికి వుల్కాన్ ఎక్స్‌ప్రెస్, ఫ్రీఛార్జ్లను వంటి ఆస్తులను అమ్మేసి నిధులు సేకరించడం అని ఆయన చెప్పారు. ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తున్న ఆఫర్‌కు మెజార్టీ, మెనార్టీ షేర్‌హోల్డర్స్ మధ్య ఆమోదం రాకపోవడంతో ఇది తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే. తాజాగా ఇన్ఫీబీమ్తో జరుపుతున్న తాజా చర్చలు షేర్‌హోల్డర్స్ ఆమోదిస్తున్నారో లేదో ఇంకా స్పష్టంకాలేదు. -
బ్లాక్ బస్టర్ లిస్టింగ్.. ఎవరికి లాభం
సాక్షి, బిజినెస్ డెస్క్: క్వెస్ కార్పొ కంపెనీ... రూ.317 ఇష్యూ ధరతో ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు వచ్చింది. ఈ షేర్ స్టాక్ మార్కెట్లో మంగళవారం రోజు 57 శాతం లాభంతో రూ.499 వద్ద లిస్టయింది. ఇంట్రాడేలో 60 శాతం లాభంతో రూ.509 గరిష్ట స్థాయిని తాకిన ఈ షేర్ చివరకు 59 శాతం లాభంతో రూ.503 వద్ద ముగిసింది. ఈ క్వెస్ కార్పొ ఐపీఓ 144 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. గత రెండేళ్లలో ఈ స్థాయి సబ్స్క్రిప్షన్, లిస్టింగ్ లాభాలు సాధించిన షేర్ ఇదే. ఒక్క క్వెస్ కార్పొ కంపెనీయే కాదు, ఇటీవల ఐపీఓకు వచ్చిన మహానగర్ గ్యాస్, ఇన్ఫీబీమ్, టీమ్‌లీజ్ పలు షేర్లు భారీ లిస్టింగ్ లాభాలను సాధించాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ 11 షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాగా, వీటిల్లో 7 షేర్లు 20-59 శాతం లిస్టింగ్ లాభాలు కళ్లజూసాయి. కానీ ఈ లాభాలు చాలావరకూ ప్రమోటర్లు, యాంకర్ ఇన్వెస్టర్లకే పరిమితం. కొంతవరకూ సంస్థాగత ఇన్వెస్టర్లకూ మెరుగే. కానీ రిటైల్ ఇన్వెస్టర్లకు మాత్రం మంచి ఐపీఓకు దరఖాస్తుచేయడం లాటరీ టికెట్ కొనడం వంటిదే. బాగా సబ్స్క్రయిబ్ అయితే... గతంలో జరిగిన కుంభకోణాల కారణంగా సెబి ఐపీవో అలాట్మెంట్ నిబంధనల్లో భారీ మార్పులు చేసింది. దీంతో అధికంగా ఓవర్‌సబ్‌స్క్రయిబ్ అయిన షేర్లు మెజారిటీ రిటైల్ ఇన్వెస్టర్లకు అలాట్కావు. గతంలో సబ్స్క్రిప్షన్ స్థాయిని బట్టి దరఖాస్తు చేసినవారందరికీ, ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తులు వేసినా ఆ దామాషాలో ఎన్నోకొన్ని షేర్ల కేటాయింపు జరిగేది. ఇప్పుడలా కాదు. ఒక వ్యక్తి, లేదా కుటుంబం లేదా ఒకే చిరునామా నుంచి ఎక్కువ దరఖాస్తులు వస్తే ఆల్గోరిథమ్ ద్వారా వాటిని గుర్తించి, ఆ దరఖాస్తులన్నింటినీ తొలగిస్తారు. రిటైలర్ల కోసం కేటాయించిన మొత్తం షేర్లను లాట్స్గా విభజిస్తారు. ఉదాహరణకు క్వెస్ కార్పొ ఐపీఓకు 45 షేర్లు ఒక లాట్. రిటైలర్లకు కేటాయించిన మొత్తం షేర్లు 7 లక్షలు. దీని ప్రకారం అర్హమైన దరఖాస్తుల్ని కంప్యూటర్ ద్వారా లాటరీ తీసి, వాటికి మాత్రం ఒక్కో లాట్ చొప్పున షేర్లు కేటాయిస్తారు. క్వెస్ కార్పొ రిటైల్ పోర్షన్ 33 రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ అయ్యింది. దరఖాస్తు చేసినవారికి కనీస లాట్‌ను కేటాయించాల్సివున్నందున, 33 రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ అయినా, దాదాపు 1000 దరఖాస్తుల్లో ఒకదానికి మాత్రమే కేటాయింపు జరుగుతుంది. మిగిలివారికి 15 రోజులపాటు ఐపీవో కోసం చెల్లించిన డబ్బుకు వడ్డీ నష్టం మిగులుతుంది. లిస్టయిన తర్వాత కొంటే... అధిక రెట్లు ఓవర్‌సబ్‌స్క్రయిబ్ అయిన షేరు ఎలాగూ భారీ ధరతో లిస్టవుతుంది. దాంతో ఐపీఓకు దరఖాస్తుచేసినా, అలాట్‌కాని ఇన్వెస్టర్లందరూ ఆ షేరును ఎక్కువ ధర వద్ద కొని ఇరుక్కుపోతుంటారు. ఎప్పటినుంచో ట్రేడవుతున్న షేర్లతో పోలిస్తే లిస్టింగ్ షేర్లలో రాబడి తక్కువని, లేదా నష్టం వస్తుందని బీఎస్ఈ ఐపీఓ ఇండెక్స్ వెల్లడిస్తోంది. కొత్త లిస్టయిన షేర్ల కదలికల్ని ఈ ఐపీఓ ఇండెక్స్ ప్రతిబింబిస్తుంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకూ బీఎస్ఈ ఐపీఓ ఇండెక్స్ పెరక్కపోగా, 2 శాతం క్షీణించింది. 2016 జనవరి 1 న 3,414 పాయింట్ల వద్దనున్న ఐపీఓ ఇండెక్స్ ప్రస్తుతం 3,340 సమీపంలో ట్రేడవుతోంది. అదే బీఎస్ఈ సెన్సెక్స్ ఈ ఏడాది ఇప్పటివరకూ 6 శాతం పెరిగింది. ఉదాహరణకు తాజా బ్లాక్‌బస్టర్ లిస్టింగ్ క్వెస్ కార్ప్ ఇష్యూ ధర రూ. 310తో పోలిస్తే రూ. 500 వద్ద లిస్టయి ప్రమోటర్లకు, అలాట్మెంట్ దొరికిన అదృష్టవంతులకూ 58 శాతం లాభాన్నిచ్చింది. కానీ ఆ రోజు కొన్న ఇన్వెస్టర్లకు మరుసటి రోజుకే 6 శాతం నష్టాన్ని తీసుకొచ్చింది. నెలల గడిచే కొద్దీ లిస్టింగ్ ధర నుంచి కొన్ని షేర్ల ధర క్రమేపీ పెరగవచ్చు. మరికొన్ని తగ్గవచ్చు. సంస్థలకు భేష్ పలు మ్యూచువల్ ఫండ్ సంస్థలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు, హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ లిస్టింగ్ లాభాల కోసమే ఐపీఓ షేర్లకు దరఖాస్తు చేస్తారని నిపుణులంటున్నారు. వారు లిస్ట్ కాగానే అలాట్ అయిన షేర్లను లాభాలకు అమ్ముకొని ఎగ్జిట్ అవుతున్నారు. ఇష్యూ జారీచేయడానికి 15 రోజుల ముందు యాంకర్ ఇన్వెస్టర్లకు ఇష్యూ ధరపై కంపెనీ షేర్లు విక్రయిస్తుంది. క్వెస్ కార్ప్ దాదాపు 15 మంచి యాంకర్ ఇన్వెస్టర్లకు రూ. 317 ధరపై భారీగా షేర్లను విక్రయించింది. యాంకర్ ఇన్వెస్టర్లలో ప్రమోటర్ల సన్నిహితులు, సంస్థాగత ఇన్వెస్టర్లు వుంటారు. వీరు షేరు లిస్టయిన నెల రోజుల తర్వాత కావాలంటే షేర్లను మార్కెట్లో అమ్ముకోవొచ్చు. వీరితో పాటు ఐపీఓలో కేటాయింపు పొందిన సంస్థాగత ఇన్వెస్టర్లు కూడా భారీ లిస్టింగ్‌తో లబ్దిపొందుతారు. ఈ సంస్థలకు కేటాయించే పోర్షన్ ఓవర్‌సబ్‌స్క్రయిబ్ అయినా, వీటన్నింటికీ దరఖాస్తుచేసినవాటిలో కొన్ని షేర్ల కేటాయింపు జరుగుతుంది. పెద్దమొత్తంలో దరఖాస్తుచేసే అవకాశం సంస్థలకు వుంటుంది. రూ. 2 లక్షలలోపు దరఖాస్తుచేస్తేనే రిటైల్ ఇన్వెస్టరు కింద పరిగణిస్తారు.