న్యూఢిల్లీ: ఇన్ఫీబీమ్ అవెన్యూస్ షేర్ శుక్రవారం 70 శాతం.. అక్షరాలా 70 శాతం క్షీణించింది. బీఎస్‌ఈలో గురువారం రూ.196 వద్ద ముగిసిన ఈ షేర్ శుక్రవారం 70.24 శాతం(రూ.139) నష్టపోయి రూ.58.80 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 73 శాతం పతనంతో తాజా ఏడాది కనిష్ట స్థాయి, రూ.53.80ను తాకింది. బీఎస్‌ఈలో 1.9 కోట్లు, ఎన్‌ఎస్‌ఈలో 15 కోట్లకు పైగా షేర్లు ట్రేడయ్యాయి. ఒక్క రోజులోనే కంపెనీ మార్కెట్ క్యాప్ ముప్పావు వంతు, రూ. 9,200 కోట్లు హరించుకుపోయి రూ. 3,902 కోట్లకు పడిపోయింది. కంపెనీ వార్షిక సాధారణ సమావేశం(ఈజీఎమ్) నేడు(శనివారం) జరగనున్నది.
అంతా ఆ మెసేజ్ వల్లే...!
కంపెనీ అకౌంటింగ్ విధానాలపై ఆందోళన కలిగించే వాట్సాప్ మెసేజ్ ట్రేడర్ల మధ్య వైరల్ కావడంతో ఈ కంపెనీ షేర్ ఈ స్థాయిలో పడిపోయిందని నిపుణులంటున్నారు. ఈక్విరస్ సెక్యూరిటీస్ పేరు మీద ఈ వాట్సాప్ మెసేజ్ వచ్చిందని సమాచారం. అయితే కొన్ని నెలల క్రితమే ఈ మెసేజ్‌ను ఈక్విరస్ సంస్థ, కొంతమంది క్లయింట్లకు పంపించిందని, అయితే కంపెనీ ఏజీఎమ్‌కు ఒక్క రోజు ముందు ఈ మెసేజ్ వైరల్ అయిందని మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.
కంపెనీ స్వచ్ఛంద వివరణ...
షేర్ ధర భారీగా పతనం కావడంతో ఇన్ఫీబీమ్ స్వచ్ఛందంగా వివరణ ఇచ్చింది. కంపెనీ పనితీరుపై ప్రభావం చూపించే ప్రతీ చిన్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు స్టాక్ ఎక్సే్చంజ్‌లకు అందజేస్తున్నామని ఇన్ఫీబీమ్ వెల్లడించింది. అంతేకాకుండా స్టాక్ ఎక్స్చేంజ్‌లు ఎప్పుడు, ఏ వివరం అడిగినా, సకాలంలో అందజేశామని పేర్కొంది. షేర్ ధరల సరళిని ప్రభావితం చేసే పెండింగ్ సమాచారమేదీ లేదని తెలిపింది.
కాగా ఇన్ఫీబీమ్ కంపెనీ తన అనుబంధ సంస్థకు ఎలాంటి వడ్డీ లేకుండా రుణాన్ని ఇచ్చిందన్న వార్తల పట్ల బీఎస్‌ఈ వివరణ కోరింది. తమ అనుబంధ సంస్థ, ఎన్‌ఎస్‌ఐ ఇన్ఫీనీయమ్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్‌కు ఎలాంటి తనఖా లేకుండా వడ్డీ రహిత రుణాలిచ్చామని ఇన్ఫీబీమ్ కంపెనీ వివరణ ఇచ్చింది. ఆ కంపెనీ ఆరంభమైనప్పటి నుంచి ఈ తరహా రుణాలిస్తున్నామని, ఇవి స్వల్పకాలిక రుణాలని, తాము ఎప్పుడు అడిగితే అప్పుడు ఆ అనుబంధ కంపెనీ ఈ రుణాలను తీర్చేసేదని పేర్కొంది.
పేలవంగా ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిస్టింగ్
రైల్వే ఇంజినీరింగ్, కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఇర్కాన్ ఇంటర్నేషనల్ పేలవంగా లిస్టయింది. ఇష్యూ ధర రూ.475తో పోల్చితే ఎన్‌ఎస్‌ఈలో 13% నష్టంతో రూ.413 వద్ద లిస్టయింది. ఇంట్రాడేలో రూ.465, రూ.409 గరిష్ట, కనిష్ట స్థాయిలను తాకింది. చివరకు 13 శాతం నష్టంతో రూ.415 వద్ద ముగిసింది.
మార్కెట్ ముగిసిన తర్వాత కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.3,919 కోట్లుగా ఉంది. మరోవైపు ప్రభుత్వ రంగ గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ ఐపీఓ శుక్రవారం పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయింది. ఈ ఐపీఓ ప్రైస్‌బాండ్ రూ.114–118. కాగా 4 కంపెనీలు–చార్టర్డ్ స్పీడ్, నెక్కన్ పవర్ అండ్ ఇన్‌ఫ్రా, నర్మద బయో–కెమ్, డయాగ్నస్టిక్స్ కంపెనీ మెట్రోపొలిస్ హెల్త్‌కేర్ కంపెనీలు కూడా ఐపీఓకు రావడం కోసం సెబీకి దరఖాస్తు చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment