బ్లాక్ బస్టర్ లిస్టింగ్.. ఎవరికి లాభం
సాక్షి, బిజినెస్ డెస్క్: క్వెస్ కార్పొ కంపెనీ... రూ.317 ఇష్యూ ధరతో ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు వచ్చింది. ఈ షేర్ స్టాక్ మార్కెట్లో మంగళవారం రోజు 57 శాతం లాభంతో రూ.499 వద్ద లిస్టయింది. ఇంట్రాడేలో 60 శాతం లాభంతో రూ.509 గరిష్ట స్థాయిని తాకిన ఈ షేర్ చివరకు 59 శాతం లాభంతో రూ.503 వద్ద ముగిసింది. ఈ క్వెస్ కార్పొ ఐపీఓ 144 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. గత రెండేళ్లలో ఈ స్థాయి సబ్‌స్క్రిప్షన్, లిస్టింగ్ లాభాలు సాధించిన షేర్ ఇదే.
ఒక్క క్వెస్ కార్పొ కంపెనీయే కాదు, ఇటీవల ఐపీఓకు వచ్చిన మహానగర్ గ్యాస్, ఇన్ఫీబీమ్, టీమ్‌లీజ్ పలు షేర్లు భారీ లిస్టింగ్ లాభాలను సాధించాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ 11 షేర్లు స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాగా, వీటిల్లో 7 షేర్లు 20-59 శాతం లిస్టింగ్ లాభాలు కళ్లజూసాయి. కానీ ఈ లాభాలు చాలావరకూ ప్రమోటర్లు, యాంకర్ ఇన్వెస్టర్లకే పరిమితం. కొంతవరకూ సంస్థాగత ఇన్వెస్టర్లకూ మెరుగే. కానీ రిటైల్ ఇన్వెస్టర్లకు మాత్రం మంచి ఐపీఓకు దరఖాస్తుచేయడం లాటరీ టికెట్ కొనడం వంటిదే.
బాగా సబ్‌స్క్రయిబ్ అయితే...
గతంలో జరిగిన కుంభకోణాల కారణంగా సెబి ఐపీవో అలాట్‌మెంట్ నిబంధనల్లో భారీ మార్పులు చేసింది. దీంతో అధికంగా ఓవర్‌సబ్‌స్క్రయిబ్ అయిన షేర్లు మెజారిటీ రిటైల్ ఇన్వెస్టర్లకు అలాట్‌కావు. గతంలో సబ్‌స్క్రిప్షన్ స్థాయిని బట్టి దరఖాస్తు చేసినవారందరికీ, ఒకే వ్యక్తి ఎన్ని దరఖాస్తులు వేసినా ఆ దామాషాలో ఎన్నోకొన్ని షేర్ల కేటాయింపు జరిగేది. ఇప్పుడలా కాదు. ఒక వ్యక్తి, లేదా కుటుంబం లేదా ఒకే చిరునామా నుంచి ఎక్కువ దరఖాస్తులు వస్తే ఆల్గోరిథమ్ ద్వారా వాటిని గుర్తించి, ఆ దరఖాస్తులన్నింటినీ తొలగిస్తారు. రిటైలర్ల కోసం కేటాయించిన మొత్తం షేర్లను లాట్స్‌గా విభజిస్తారు. ఉదాహరణకు క్వెస్ కార్పొ ఐపీఓకు 45 షేర్లు ఒక లాట్. రిటైలర్లకు కేటాయించిన మొత్తం షేర్లు 7 లక్షలు. దీని ప్రకారం అర్హమైన దరఖాస్తుల్ని కంప్యూటర్ ద్వారా లాటరీ తీసి, వాటికి మాత్రం ఒక్కో లాట్ చొప్పున షేర్లు కేటాయిస్తారు. క్వెస్ కార్పొ రిటైల్ పోర్షన్ 33 రెట్లు ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయ్యింది. దరఖాస్తు చేసినవారికి కనీస లాట్‌ను కేటాయించాల్సివున్నందున, 33 రెట్లు ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయినా, దాదాపు 1000 దరఖాస్తుల్లో ఒకదానికి మాత్రమే కేటాయింపు జరుగుతుంది. మిగిలివారికి 15 రోజులపాటు ఐపీవో కోసం చెల్లించిన డబ్బుకు వడ్డీ నష్టం మిగులుతుంది.
లిస్టయిన తర్వాత కొంటే...
అధిక రెట్లు ఓవర్‌సబ్‌స్క్రయిబ్ అయిన షేరు ఎలాగూ భారీ ధరతో లిస్టవుతుంది. దాంతో ఐపీఓకు దరఖాస్తుచేసినా, అలాట్‌కాని ఇన్వెస్టర్లందరూ ఆ షేరును ఎక్కువ ధర వద్ద కొని ఇరుక్కుపోతుంటారు. ఎప్పటినుంచో ట్రేడవుతున్న షేర్లతో పోలిస్తే లిస్టింగ్ షేర్లలో రాబడి తక్కువని, లేదా నష్టం వస్తుందని బీఎస్‌ఈ ఐపీఓ ఇండెక్స్ వెల్లడిస్తోంది. కొత్త లిస్టయిన షేర్ల కదలికల్ని ఈ ఐపీఓ ఇండెక్స్ ప్రతిబింబిస్తుంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకూ బీఎస్‌ఈ ఐపీఓ ఇండెక్స్ పెరక్కపోగా, 2 శాతం క్షీణించింది. 2016 జనవరి 1 న 3,414 పాయింట్ల వద్దనున్న ఐపీఓ ఇండెక్స్ ప్రస్తుతం 3,340 సమీపంలో ట్రేడవుతోంది. అదే బీఎస్‌ఈ సెన్సెక్స్ ఈ ఏడాది ఇప్పటివరకూ 6 శాతం పెరిగింది. ఉదాహరణకు తాజా బ్లాక్‌బస్టర్ లిస్టింగ్ క్వెస్ కార్ప్ ఇష్యూ ధర రూ. 310తో పోలిస్తే రూ. 500 వద్ద లిస్టయి ప్రమోటర్లకు, అలాట్‌మెంట్ దొరికిన అదృష్టవంతులకూ 58 శాతం లాభాన్నిచ్చింది. కానీ ఆ రోజు కొన్న ఇన్వెస్టర్లకు మరుసటి రోజుకే 6 శాతం నష్టాన్ని తీసుకొచ్చింది. నెలల గడిచే కొద్దీ లిస్టింగ్ ధర నుంచి కొన్ని షేర్ల ధర క్రమేపీ పెరగవచ్చు. మరికొన్ని తగ్గవచ్చు.
సంస్థలకు భేష్
పలు మ్యూచువల్ ఫండ్ సంస్థలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు, హై నెట్‌వర్త్ ఇండివిడ్యువల్స్ లిస్టింగ్ లాభాల కోసమే ఐపీఓ షేర్లకు దరఖాస్తు చేస్తారని నిపుణులంటున్నారు. వారు లిస్ట్ కాగానే అలాట్ అయిన షేర్లను లాభాలకు అమ్ముకొని ఎగ్జిట్ అవుతున్నారు. ఇష్యూ జారీచేయడానికి 15 రోజుల ముందు యాంకర్ ఇన్వెస్టర్లకు ఇష్యూ ధరపై కంపెనీ షేర్లు విక్రయిస్తుంది. క్వెస్ కార్ప్ దాదాపు 15 మంచి యాంకర్ ఇన్వెస్టర్లకు రూ. 317 ధరపై భారీగా షేర్లను విక్రయించింది.
యాంకర్ ఇన్వెస్టర్లలో ప్రమోటర్ల సన్నిహితులు, సంస్థాగత ఇన్వెస్టర్లు వుంటారు. వీరు షేరు లిస్టయిన నెల రోజుల తర్వాత కావాలంటే షేర్లను మార్కెట్లో అమ్ముకోవొచ్చు. వీరితో పాటు ఐపీఓలో కేటాయింపు పొందిన సంస్థాగత ఇన్వెస్టర్లు కూడా భారీ లిస్టింగ్‌తో లబ్దిపొందుతారు. ఈ సంస్థలకు కేటాయించే పోర్షన్ ఓవర్‌సబ్‌స్క్రయిబ్ అయినా, వీటన్నింటికీ దరఖాస్తుచేసినవాటిలో కొన్ని షేర్ల కేటాయింపు జరుగుతుంది. పెద్దమొత్తంలో దరఖాస్తుచేసే అవకాశం సంస్థలకు వుంటుంది. రూ. 2 లక్షలలోపు దరఖాస్తుచేస్తేనే రిటైల్ ఇన్వెస్టరు కింద పరిగణిస్తారు.