
స్నాప్‌డీల్ పీకేసింది.. పేటీఎం పిలుస్తోంది!
న్యూఢిల్లీ: సంక్షోభంలో ఉన్న స్నాప్‌డీల్, స్టేజిల్లా వందల సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలుకగా... వారికి పేటీఎం ఆహ్వానం పలికింది. పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈవో విజయ్ శేఖర్ శర్మ ట్విట్టర్‌లో ఇందుకు సంబంధించి ఓ ట్వీట్ చేశారు. వ్యాపార పునర్‌వ్యవస్థీకరణ కారణంగా ఢిల్లీ రాజధాని ప్రాంతంలో ఉద్యోగం కోల్పోయిన టెక్/ప్రొడక్టు ఉద్యోగులకు తాము ఆహ్వానం పలుకుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. దేశంలోని ప్రముఖ ఈ కామర్స్ సంస్థల్లో ఒకటైన స్నాప్‌డీల్ సుమారు 500–600 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు గత వారం ప్రకటించిన విషయం తెలిసిందే.
త్వరగా వృద్ధి చెందే క్రమంలో పొరపాట్లు చేసినట్టు స్పాప్‌డీల్ సహ వ్యవస్థాపకుడు కునాల్‌బాహ్ అంగీకరించారు. వ్యయాలు తగ్గించుకుని వ్యాపారాన్ని తిరిగి గాడిన పెట్టే క్రమంలో ఉద్యోగులను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. చెన్నై కేంద్రంగా నడిచే ఆన్‌లైన్ హోటల్ గదుల బుకింగ్ సంస్థ స్టేజిల్లా మార్కెట్లో విపరీతమైన పోటీ కారణంగా కార్యకలాపాలు నిలిపివేయాలని నిర్ణయించింది.