ఆమిర్ వ్యాఖ్యలతో పెరిగిన బిజినెస్
ముంబై: వ్యతిరేక ప్రచారం కారణంగా కొన్ని సందర్భాల్లో నష్టం కన్నా లాభమే ఎక్కువ జరుగుతుంది. ఏ ప్రచారం లేకపోవడంకన్నా ఏదో ప్రచారం ఉండడం మేలని నమ్మే రాజకీయ నాయకుల గురించి మనకు తెల్సిందే. దేశంలో అసహన పరిస్థితులు పెరిగిపోతున్నాయంటూ బాలివుడ్ నటుడు ఆమిర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవడం, ఆయన వ్యాఖ్యలు పూర్తిగా వ్యక్తిగతమైనవని, వాటితో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న ‘స్నాప్‌డీల్’ అప్లికేషన్ కంపెనీ చెప్పడం తెల్సిందే. ‘సుబ్బి పెళ్లి ఎంకి చావుకొచ్చింది’ అన్నట్టు ఆమిర్ ఖాన్ వ్యాఖ్యల వల్ల స్నాప్‌డీల్ మార్కెట్ పడిపోతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేశాయి. వాస్తవానికి వారి అంచనాలు తలకిందులై స్నాప్‌డీల్ మార్కెట్ మరింత పుంజుకుంది.
ఆమిర్ ఖాన్ వ్యాఖ్యలు చేసిన నవంబర్ 23వ తేదీనాడు గూగుల్ ప్లే స్టోర్‌లో స్నాప్‌డీల్ ఇండియా ర్యాంక్ 28వ స్థానంలో ఉండగా, ఆ మరుసటి రోజు కూడా అదే ర్యాంక్ కొనసాగింది. ఆ తదుపరి రోజు, అంటే 25వ రోజున ‘ఘర్‌వాప్సీ’ తరహాలో ‘యాప్‌వాప్సీ’ అనే వ్యతిరేక ప్రచారం సోషల్ మీడియాలో ఊపందుకొంది. తద్వారా స్నాప్‌డీల్ ఒక స్థానాన్ని అధిగమించి 27వ ర్యాంక్‌కు చేరుకుంది. నవంబర్ 26వ తేదీ నాడు ఒక్కసారిగా ఐదు ర్యాంకులు అధిగమించి 22వ ర్యాంక్‌కు చేరుకుంది. గత 30 రోజుల కాలంలో ఐదు ర్యాంక్‌లు అధిగమించడం ఇదే మొదటిసారి.