ఆమిర్ ఖాన్‌ను దూరం చేసుకుందామా?
న్యూఢిల్లీ: భారత్‌లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు పెద్ద పీట వేస్తున్న సోషల్ మీడియా కూడా నేడు అసహనంపై బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టడం శోచనీయంగా ఉంది. ఆయన చేసిన వ్యాఖ్యల స్ఫూర్తిని గ్రహించకపోయినా సరే, ఆయన చేసిన వ్యాఖ్యలను యధాతథంగా కాకుండా వక్రీకరించి మాట్లాడడం, ఆమిర్ ఖాన్‌తో ఎలాంటి సంబంధంలేని ఎవరో భార్యాభర్తలు గొడవ పడి అందులో ఒకరు ఆత్మహత్యకు పాల్పడితే ఆ సంఘటనను ఆమిర్‌కు ముడిపెట్టడం ఎంతవరకు సమంజసం! నెట్ న్యూట్రాలిటీ (తటస్థత వైఖరి) అంటే ఇదేనా ?
లగాన్, తారా జమీన్ పర్, పీకే లాంటి విభిన్న చిత్రాలను తీసి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఆమిర్‌ఖాన్‌ను అర్థం చేసుకున్నది ఇంతేనా? ‘సత్యమేవ జయతే’ టీవీ కార్యక్రమం ద్వారా ప్రభుత్వాలకు పట్టని సామాజిక సమస్యలను ప్రజలకుముందుకు తీసుకొచ్చిన విషయాన్ని అప్పుడే మరిచిపోయామా? ముంబైలో పుట్టి ప్రపంచ ప్రసిద్ధి చెందిన సల్మాన్ రష్దీ రాసిన పుస్తకం ‘ది సెటానిక్ వర్సెస్’ను భారత్‌లో నిషేధించడమే కాకుండా 2012లో జైపూర్‌లో జరిగిన లిటరేచర్ ఫెస్టివల్‌కు వస్తానంటే రానియ్యలేదే!
అలాగే ప్రపంచ ప్రసిద్ధ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ హిందూ దేవతలను నగ్నంగా చిత్రీకరించాడన్న కారణంగా ఆయన్ని దేశం నుంచే తరిమేశామే! జీవిత చరమాంకంలో పుట్టిన గడ్డ భారత్‌లో తుదిశ్వాస విడుస్తానంటే కూడా కాదన్నమే! వారిలాగే ఆమిర్ ఖాన్‌ను కూడా వదులుకుందామా? సహనం అంటే ఇదేనా! అవును, భారతీయులు సహనపరులు. భోఫోర్స్ కుంభకోణం, బొగ్గు స్కామ్, సిక్కుల ఊచకోత, గుజరాత్ అల్లర్లు, వారసత్వ పాలన, కుళ్లు రాజకీయాలు, తరతరాల ప్రభుత్వాల అసమర్థత తదితరాలను సహించాంగదా!
-ఇది ఓ సెక్యులరిస్ట్ కామెంట్