ఏది సహనం ఏదసహనం ఓ మహాత్మా!
సమకాలీనం
ఒక్క మతోన్మాదమే కాకుండా ఈరోజు జీవితం అన్ని పార్శ్వాల్లోనూ అసహనం ప్రబలు తోంది. రాజకీయ, ఆర్థిక, సామాజిక, భాషా, ప్రాంతీయ పరమైన అసహనాలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. ఏ ప్రమాణాలతో చూసినా బహుళ సంఖ్యాకుల్లో సహనమే భారత వైవిధ్యానికి రక్షణ. కొన్నేళ్లుగా పెరుగుతున్న పోకడలే ప్రమాదకరంగా ఉన్నాయి. సహనా నికి ప్రతీక భారతదేశం అని చెబుతూ, ‘మా తాతలు నేతులు తాగారు మా మూతుల వాసన చూడండి’ అంటే నడిచే రోజులు కావివి. ఇప్పుడేం జరుగుతోందన్నదే ముఖ్యం.
అసాధారణ అసహనం పట్లా అతి సహనంగా ఉన్నామా? మన సహజ సహనం వీడి అసహనంతో ఉంటున్నామా? లేక రెండూనా? అంతుబట్టని స్థితి నెలకొంటోంది. చిత్ర ప్రముఖుడు అమీర్‌ఖాన్ తన భార్య కిరణ్‌రావ్‌కు వచ్చిన ఓ ఆలోచనను ప్రస్తావించి,‘‘..... ఏమిటిది? ఏం జరుగుతోంది?’’ అని తన మనసు పంచుకొని, ఆందోళన వ్యక్తం చేయడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. లేని ‘అసహనా’న్ని పెద్దది చేసి చూపుతూ భారత ప్రతిష్టను ఆయన మంటగలుపుతున్నాడంటూ ఊగిపోతున్న వారి మాటలు... ‘లేదు లేదు, అసహనం ఉంది, అది తీవ్ర స్థాయిలోనే ఉంద’ని ధృవీకరించేవిగా ఉన్నాయి. అమీర్ అలా మాట్లాడి ఉండాల్సింది కాదని, ఆయనది దేశద్రోహుల భాష అని, ఐక్యరాజ్య సమితిలో మనకు శాశ్వత సభ్యత్వం రాకుండా పాక్ పన్నిన కుట్రలో ఇది భాగమనీ, అట్లయితే ఆయన్ని పాకిస్తాన్ వెళ్లమనండని, ఆయన సినిమాల్ని నిషేధించండని ఇలా... చాలా విమర్శలే వచ్చాయి.
‘ఇంతకీ, అమీర్ ఏమి మాట్లాడాడు...?’ అది తెలుసుకొని స్పందించడంలోనే ఈ వ్యాఖ్యాతల ‘సహనం’ లోపించింది. పోనీ, ఏం మాట్లాడి ఉండాల్సింది? ఎవరితోనైనా ముందు సంప్రదించి, అనుమతి తీసుకుని ఆ మేరకే మాట్లాడి ఉండాల్సిందా? ఇదేనా ప్రజా స్వామ్యం? సగటు ఆలోచనాపరులందరిలోనూ ఇప్పుడీ సందేహాలు కలుగు తున్నాయి. ఎందుకంటే, ఆయన మాటల్ని ముక్కలుగా విరిచి, వీలయిన రీతిలో అన్వయించి, పెడార్థాలు తీస్తున్న వారి వాదనలు వింటే ఆశ్చర్యం కలుగుతుంది! రామునితోక..... పివరుండిట్లనియే అని విడగొట్టి చదవడం వల్ల వచ్చిన ఇబ్బంది ఇది. ఇందులో మీడియా పాత్రేం తక్కువది కాదు! ఈ దేశంలో... ప్రభుత్వం, చట్టం, రాజ్యాంగం నీడన రక్షణ పొందుతున్న కొందరు పెద్దలు మాట్లాడినట్టు అమీర్‌ఖాన్ మరీ బాధ్యతా రహితంగా ఏం మాట్లాడలేదే!
‘హిందువులు కాని వారు దేశం వీడిపోవాలి’ అనో, ‘గోవధ నిషేధాన్ని సమర్థించని వారికీ దేశంలో స్థానం లేదు- వారంతా పాకిస్తాన్ వెళ్లాల’నో, ‘పశుమాంసం తినే వారిని ఉరితీయాల’నో అనలేదు. ఇద్దరు దళిత కుర్రాళ్లను దుండగులు సజీవ దహనం చేసినపుడు, ‘దారినపోయే ఎవరో, కుక్కలపై రెండు రాళ్లు విసిరితే అందుకు తమ ప్రభుత్వం బాధ్యత వహించజాలద’నీ అనలేదు. అలా మాట్లాడినవారంతా సహనశీలురయ్యారు. ‘రోజూ వస్తున్న వార్తా కథనాల తీవ్రత చూస్తే... గతంలో కన్నా ఇప్పుడు భయం పెరిగి, అభద్రత నెలకొందని అనిపిస్తోంది.... నేనూ నా భార్య కిరణ్ జీవితమంతా భారత్‌లోనే ఉన్నాం.
కానీ, తను మొదటిసారి... భారత్ విడిచి వెళ్దామా? అంది, ఆమెకెందుకా ఆలోచన వచ్చిందో గాని, అలా మాట్లాడటం దురదృష్టకరం...’ అని తన మనసు విప్పి చెప్పిన అమీర్, అసంబద్ధంగా మాట్లాడాడు అన్నది ఇప్పుడీ పెద్దల సూత్రీకరణ! ‘ఈ దేశం అమీర్‌కు ఇంత స్థానం కల్పిస్తే, ఇలా మాట్లాడతాడా?’ అంటారు. దేశంలో ఏం జరుగుతున్నా... నోరు విప్పొద్దనే ఒప్పందం మీద ఆయన్ని స్టార్‌ని చేశారా ఎవరైనా? ఆయన సినీ హీరో అయి సంపాదించిందంతా ఎవరైనా ఉదారంగా విరాళమిస్తే వచ్చిందా? పోనీ, ఏదైనా చట్టాన్ని ఉల్లంఘించి సంపాదిస్తే, శిక్షించకుండా దయతో ఉపేక్షించారా?
ఏం పెద్ద మనుషులు వీరు?
తమకు సరిపోని భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారని కవులు, రచయితలను మతోన్మాదులు మట్టుపెట్టడం అసహనం కాదా? కర్ణాటకలో కల్బుర్గి, మహారాష్ట్రలో పాండేను హతమార్చడం, సుధీంద్ర కులకర్ణిపై ఇంకు పోయడం దేశ వ్యాప్తంగా కవులు, కళాకారుల్ని కలవరానికి గురి చేసింది. అవార్డులు, గౌరవ పురస్కారాల్ని వెనక్కి ఇచ్చి తమ నిరసన తెలిపారు. ఒక వ్యక్తి గోవును చంపి మాంసం తిన్నాడనే నింద మోపి, ఉన్మాదులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని అక్కడికక్కడే ఆయన్ని హతమార్చడం అసహనం అవదా? వీటిని సరైన రీతిలో నియంత్రించాల్సిన పాలనా వ్యవస్థలు చేష్టలుడిగి ఉండటాన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి? ప్రభుత్వం ఇంటింటి వద్ద కాపలా ఉంచో, ప్రతి ఉన్మాది మీద నిఘా పెట్టో రక్షణ కల్పించలేకపోవచ్చు! కానీ, అసహనం పెరిగి, చట్టవ్యతిరేక ఘటనలు చోటు చేసుకున్నపుడు తక్షణం స్పందించడం ద్వారా సరైన సంకేతాలు పంపాలి.
మన ప్రధాని నరేంద్ర మోదీ చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్న అమెరికా అధ్యక్షుడు ఒబామా, ఇలాంటి స్థితే వచ్చినపుడు ఎలా స్పందించారో తెలీదా! ఒక నల్లజాతి ప్రొఫెసర్‌పై అమెరికా నడిబజారులో దాడి జరిగితే, స్వయంగా అక్కడికి వెళ్లి, ‘ఇది అరుదుగా జరిగే అసాధారణ ఘటన, మేం ఇటువంటివి ఎక్కడా జరుగనివ్వం’ అని విస్పష్టంగా ఖండిస్తూ, సదరు ప్రొఫెసర్‌ను వైట్‌హౌజ్‌కు తెచ్చుకొని సహపంక్తి భోజనం చేశారు. భవిష్యత్ భద్రతా చర్యలపై అమెరికన్లకు ఓ భరోసా కల్పించారు. ఇక్కడ అలా చేయకపోవడం ద్వారా, పెచ్చరిల్లిన మత అసహనం పట్ల పాలకులు అత్యంత సహనం చూపిన వారవుతున్నారు. అదే అలుసుతో పెట్రేగిన ఉన్మాదులు ‘కబడ్దార్’అని ఊగిపోయారు ఒక దశలో! అక్కడక్కడ ముఖ్యమంత్రులకే హెచ్చరికలు చేశారు.
ఇక నాలుకల విచ్చలవిడి తనానికి హద్దే లేదు. భారతదేశంలోని ముస్లింలందరినీ పాకిస్తాన్ పంపిస్తే ఇక్కడ జనాభా తగ్గి, హిందువులంతా హాయిగా ఉంటారని ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ అనడం ఏ రకమైన సహనానికి ప్రతీక? ‘ప్రతి హిందూ మహిళ కనీసం నలుగురిని కనాలి’ అన్న ఇంకో ఎంపీ, సాక్షీ మహారాజ్, గోవధకు పాల్పడే వారిని ఉరితీసేందుకు ఓ చట్టమే తేవాలనడం సహనమా? అసహనమా? బీజేపీకి చెందిన ప్రముఖ నాయకుడు, అస్సాం ప్రస్తుత గవర్నర్ పీబీ ఆచార్య ‘భారత్ హిందువులది, అసంతృప్తి ఉన్న ముస్లింలు పాకిస్తాన్ లేదా బంగ్లాదేశ్ వెళ్లవచ్చ’ని బహిరంగంగా ప్రకటించడం ఏ లౌకిక రాజ్యాంగ సూత్రాలకు లోబడి చెప్పిందో ఈ సహనశీలురే వివరించాలి. భారత రాజ్యాంగం కల్పించే హక్కులకు పూచీకత్తుగా ఉంటానని ప్రమాణం చేసిన కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్, ‘మోదీని వ్యతిరేకించేవారు యథేచ్ఛగా పాకిస్తాన్ వెళ్లవచ్చు’ అంటారు. అదే గిరిరాజ్ సింగ్, 2014 ఎన్నికలప్పుడు ‘సోనియాగాంధీ ఏ నల్లతోలు నైజీరియనో అయితే ఈ స్థాయికి వచ్చి ఉండేవారా?’ అని వదరుబోతుతనం చాటి, క్షమాపణ చెప్పాలని నైజీరియన్ హై కమిషన్ డిమాండ్ చేస్తే చివరకు తోక ముడిచారు.
ఎల్లెడలా పెరుగుతున్న ‘అసహనాలు’
ఒక్క మతోన్మాదమే కాకుండా ఈరోజు జీవితం అన్ని పార్శ్వాల్లోనూ అసహనం ప్రబలుతోంది. రాజకీయ, ఆర్థిక, సామాజిక, భాషా, ప్రాంతీయ పరమైన అసహనాలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. మనిషి మనుగడను తీవ్ర అశాంతికి గురి చేస్తున్నాయి. ఏ ప్రమాణాలతో చూసినా బహుళ సంఖ్యాకుల్లో సహనమే భారత వైవిధ్యానికి రక్షణ. గత కొన్నేళ్లుగా పెరుగుతున్న పోకడలే ప్రమాదకరంగా ఉన్నాయి. సహనానికి ప్రతీక భారతదేశం అని చెబుతూ, ‘మా తాతలు నేతులు తాగారు మా మూతుల వాసన చూడండి’ అంటే నడిచే రోజులు కావివి. ఇప్పుడేం జరుగుతోందన్నదే ముఖ్యం. మానవసంబంధాలు పలుచబారడంతో పెరుగుతున్న సామాజిక అసహనం నుంచి చట్టసభల్లో ప్రత్యర్థులే ఉండొద్దని కుట్రలు-కుతంత్రాలు పన్నే రాజకీయ అసహనం వరకు అంతటా అలముకొందీ జాఢ్యం. అవధుల్లేని అధికారపు రుచి మరిగి, ఇక విపక్షంలో ఉండలేని రాజకీయ అసహనానికి హద్దులే లేవు. రాజస్థాన్లో గుజ్జర్లు, గుజరాత్‌లో పటేళ్లు, ఉత్తర భారతంలో జాట్లు జరిపిన సామాజిక ఆందోళనలు వారిలో పెరుగుతున్న అసహనానికి ప్రతీక.
నదీ జలాలకోసం ముదురుతున్న వివాదాలు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల మధ్యే కాకుండా ఆయా రాష్ట్ర ప్రజల మధ్య అసహనం పెరుగుదలకు కారణమౌతున్నాయి. కేరళ-తమిళనాడు మధ్య ముళ్లపెరియార్ డ్యామ్ వివాదం, తమిళనాడు-కర్ణాటక మధ్య కావేరీ జలజగడం, కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ (ఉమ్మడి) తుంగభద్ర-కృష్ణా జల పంచాయతీ, ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య కృష్ణా-గోదావరీ జలాల వివాదం, తెలంగాణ-మహారాష్ట్ర మధ్య బాబ్లీ నీటి తగాదా.... ఇవన్నీ కూడా పాలకుల్లో, పౌరుల్లో అసహనాన్ని పెంచుతున్నాయి. భాషాపరమైన అసహనాలు పెచ్చుమీరుతున్నాయనడానికి ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో తెలుగు వారి ఆందోళన ప్రత్యక్ష ఉదాహరణ. మనుషుల నిత్యావసరాలైన విద్య-వైద్యం వ్యాపారమయం కావడంతో సంబంధీకులందరిలోనూ అసహనం ప్రబలుతోంది. కోర్సులు పూర్తికాగానే ఉద్యోగాలు, పెద్ద జీతాలు రావాలనే ఆరాటంలో విద్యార్థులు, వారిపై ఒత్తిడి పెంచుతున్న తల్లిదండ్రులు, ఈ పరిస్థితిని సొమ్ము చేసుకుంటున్న విద్యాసంస్థలు... ఇలా అందిరిలోనూ ఏదో ఒక దశలో అసహనం బట్టబయలౌతోంది. సంఘంలో ఆర్థిక అంతరాలు అఘాతాలు సృష్టిస్తున్నాయి.
ఆదాయం లేక జీవన ప్రమాణాలు పెరగని చోట ఆర్థిక ఇబ్బందులు, ఇబ్బడి ముబ్బడిగా ‘తేలిక’ సంపాదన పెరిగిన చోట ఆధునిక జీవన సరళి తెచ్చిన కొత్త సమస్యలు.... ఇలా కారణమేదైతేనేం కుటుంబాల్లో అసహనం పెచ్చుమీరుతోంది. అంతిమంగా అది అశాంతికి దారి తీస్తోంది. మిగతా అన్ని రంగాల్లో లాగానే ఇక్కడ కూడా విలువలు నశించడంతో సగటు జీవనం సంక్లిష్టమై అసహనం అసాధారణ స్థాయికి చేరుతోంది. కడకది కుటుంబ కలతలకు, విడాకులకు, ఆత్మహత్యలకు, హత్యలకు దారి తీస్తున్న విపరిణామాలెన్నో! చిన్న తగాదాలు, సూటిపోటి మాటలకే బలవన్మరణాలు మామూలయ్యాయి. ‘నేను ప్రేమిస్తున్నాను, కనుక నువ్వు ప్రేమించాల్సిందే’ ననే ఏకపక్ష ఉన్మాదం యాసిడ్ దాడులకో, హత్యలకో పురిగొల్పేంత అసహ నాలు పెచ్చు మీరాయి. భారత సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన ‘సహనం’ ఈ రోజు నవతరానికి పుక్కిట పురాణమైపోతోంది.
ఏ వెలుగులకీ ప్రస్థానం?
‘అసహనమే ఒక విధమైన హింస, అది ప్రజాస్వామ్య స్ఫూర్తి ఎదుగుదలకు పెద్ద అవరోధం’ అంటారు పూజ్య బాపూజీ. సహనమైనా, అసహనమైనా... పాలకుల స్వభావాన్ని బట్టి, వారిచ్చే సంకేతాల్ని బట్టి ఆయా సమాజాల్లో వాటి హెచ్చు-తగ్గులు సహజం. అనారోగ్యకరమైన పోటీలో ప్రసార మాధ్య మాలు బాధ్యత మరచి వ్యవహరిస్తే మరింత ప్రమాదమన్నది సామాజిక వేత్తల భావన. అమీర్‌ఖాన్ వివాదం ఇందుకొక ఉదాహరణ అంటున్నారు. కులం, మతం, వర్గం అన్న భేదాల్ని కాసేపు పక్కన పెడితే, దేశంలో నెలకొన్న ఓ పరిస్థితిపై అభిప్రాయం వ్యక్తం చేస్తే తప్పెలా అవుతుందన్నదే ప్రశ్న. ‘కాలుష్యం పెరిగిపోయి ఈ నగరం నివాసయోగ్యంగా లేదు’ అంటే, ‘పిచ్చోడివా...? ఇదే నగరంలో పుట్టి, ఇక్కడే చదివి, మంచి ఉద్యోగం-ఆస్తి సంపాదించిన నీవు.... నగరం గురించి ఇదేనా మాట్లాడే తీరు? తప్పు!’ అంటే, ఇక భావ ప్రకటనా స్వేచ్ఛకు దిక్కేది?
దిలీప్ రెడ్డి ఈమెయిల్: dileepreddy@sakshi.com