ఏ సర్వీసు కావాలన్నా..!
• 85 రకాల సేవలందిస్తున్న అర్బన్‌క్లాప్
• ఇప్పటికే రూ.250 కోట్ల నిధుల సమీకరణ
• ఇన్వెస్టర్లలో స్నాప్‌డీల్ ఫౌండర్లతో పాటూ రతన్‌టాటా కూడా..
• త్వరలోనే మధ్యప్రాచ్య దేశాలకూ విస్తరణ
• ‘సాక్షి స్టార్టప్ డైరీ’తో అర్బన్‌క్లాప్ ఫౌండర్ అభిరాజ్ భాల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : బిజినెస్ టైకూన్ రతన్ టాటా నుంచి పెట్టుబడులు పొందింది. ఈ-కామర్స్ దిగ్గజం స్నాప్‌డీల్ ఫౌండర్ల నుంచీ నిధులు సమీకరించింది. యాపిల్ సీఈఓ టిమ్ కుక్ స్వయంగా కలసి సేవల గురించి తెలుసుకునే స్థాయికీ ఎదిగింది.
.. అయితే ఇదేదో పెద్ద కంపెనీ అనుకుంటే పొరపాటే. పోనీ టెక్నాలజీ స్టార్టప్ అనుకుంటే కూడా అంతే. ఇది కేవలం ప్లంబింగ్, ఎలక్ట్రిషన్, ట్యూటర్, ఫిట్‌నెస్ ట్రెయినర్ వంటి సర్వీసులు కావాల్సినవారికి రోజూవారీ అవసరాలను తీర్చే ఓ స్టార్టప్! అసలేంటా స్టార్టప్.. దాని కథేంటో ఈవారం ‘స్టార్టప్‌డైరీ’లో..
‘‘కార్పెంటర్, క్లీనింగ్, యోగా ట్రెయినర్, ప్యాకర్ అండ్ మూవర్స్ వంటివి చాలా వరకు సేవలు అసంఘటితంగా ఉన్నాయి. వేటికీ నిర్దిష్టమైన ధరలుండవు. కస్టమర్ల అవసరాన్ని అవకాశంగా మార్చుకొని నోటికి ఎంతొస్తే అంత ధర చెప్పేస్తుంటారు. మనకూ అత్యవసరం కాబట్టి జేబు గుల్ల చేసుకొని మరీ పని చేయించుకుంటుంటాం’’ సరిగ్గా ఇదే అనుభవం అభిరాజ్ భాల్‌కూ ఎదురైంది. అందరిలా అక్కడికే ఆగిపోకుండా.. ఆయా సేవలకు టెక్నాలజీని జోడించి ఒకే గొడుకు కిందకి తీసుకొచ్చి వ్యాపార అవకాశంగా మార్చుకుంటేపోలే అనుకున్నాడు. ఇంకేముంది.. మరో ఇద్దరు కో-ఫౌండర్స్ వరుణ్ కేతన్, రాఘవ చంద్రలతో కలిసి 2014 జూన్‌లో రూ.10 లక్షల పెట్టుబడితో గుర్గావ్ కేంద్రంగా ‘అర్బన్‌క్లాప్’ స్టార్టప్‌ను ప్రారంభించారు.
ఇంటి వద్దే 85 రకాల సేవలు..
ప్రస్తుతం బ్యూటీషియన్స్, యోగాటీచర్స్, ఫిట్‌నెస్ ట్రెయినర్స్, ప్లంబర్స్, ఎలక్ట్రిషీయన్స్, కార్ క్లీనింగ్, అకాడమీ ట్యూటర్స్, వెడ్డింగ్, ఈవెంట్ ప్లానర్స్, ప్యాకర్స్ అండ్ మూవర్స్.. ఇలా 85 రకాల సర్వీస్ ప్రొవైడర్ల సేవలను అందిస్తున్నాం. కస్టమర్లకు సర్వీస్ ప్రొవైడర్లకు మధ్య అర్బన్‌క్లాప్ సంధానకర్తగా పనిచేస్తుంది. సేవల్లో నాణ్యత, నమ్మకం రెండూ కల్పించడం మా ప్రత్యేకత. ప్రస్తుతం 50 వేల మంది సర్వీస్ ప్రొవైడర్లు నమోదై ఉన్నారు. వారంతా కస్టమర్ల ఇంటివద్దకే వచ్చి సేవలు అందిస్తారు. ప్రొఫెషనల్స్ డేటాను పూర్తి స్థాయిలో వెరిఫై చేశాకే ఉద్యోగులుగా నియమించుకుంటాం. వారితో అగ్రిమెంటూ చేసుకుంటాం కాబట్టి సెక్యూరిటీ, నమ్మకమైన సర్వీసుపరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు.
దక్షిణాది వాటా 60 శాతం..
ఇప్పటివరకు 12 లక్షల మంది కస్టమర్లున్నారు. రోజుకు 5-6 వేల మంది మా సేవలను వినియోగించుకుంటున్నారు. మొత్తం వ్యాపారంలో దక్షిణాది రాష్ట్రాల వాటా 60 శాతం వరకుంటుంది. హైదరాబాద్ నుంచి 10-15 శాతం వాటా ఉంటుంది. ఏటా పది రెట్లు వృద్ధిని సాధిస్తున్నాం. సేవలను బట్టి 5-20 శాతం వరకు కమీషన్ రూపంలో తీసుకుంటాం. మా మొత్తం వ్యాపారంలో 20-25 శాతం వాటా అందం, ఆరోగ్యం విభాగాలదే. వచ్చే మూడు నెలల్లో దీన్ని 40 శాతానికి చేర్చాలన్నది లక్ష్యం. అందుకే సేవల సంఖ్యను వందకు చేర్చాలని నిర్ణయించాం. ఈ ఏడాది ముగింపు నాటికి పెద్ద మొత్తంలో పెట్టుబడులతో విస్తరణ చేయనున్నాం. డైటీషియన్, ఫిజియోథెరపిస్ట్, సేంద్రీయ తిండి వంటకాలు వంటివి తీసుకొస్తాం.
మధ్యప్రాచ్య దేశాలకూ విస్తరణ..
ప్రస్తుతం మా సంస్థలో 320 మంది ఉద్యోగులున్నారు. ఈ ఏడాది ముంబై కేంద్రంగా పనిచేసే హ్యాండీహోమ్‌ను కొన్నాం. ప్రస్తుతం ఢిల్లీ-ఎన్‌సీఆర్, బెంగళూరు, ముంబై, హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్, కోల్‌కత్తా నగరాల్లో సేవలందిస్తున్నాం. త్వరలోనే దేశవ్యాప్తంగా విస్తరణతో పాటూ మధ్య ప్రాచ్య దేశాలకూ విస్తరించాలని నిర్ణయించాం. ఇందుకోసమే ఇటీవలే రూ.165 కోట్లు పెట్టుబడులను సమీకరించాం. దీంతో మొత్తం రూ.250 కోట్ల పెట్టుబడులకు చేరింది. బెస్సీమెర్ వెంచర్, యాక్సెల్, సైఫ్ పార్టనర్స్, స్నాప్‌డీల్ ఫౌండర్లైన కునాల్‌బాల్, రోహిత్ బన్సల్, రతన్‌టాటాలు ఈ పెట్టుబడులు పెట్టారు.
అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...