రతన్ టాటా పెట్టుబడుల స్నాప్‘డీల్’
న్యూఢిల్లీ: ఆన్‌లైన్ మార్కెటింగ్ దిగ్గజం స్నాప్‌డీల్‌లో టాటా సన్స్ చైర్మన్ ఎమిరిటస్ రతన్ టాటా వ్యక్తిగత హోదాలో పెట్టుబడి పెట్టారు. కంపెనీలో చిన్నపాటి వాటాను కొనుగోలు చేశారని స్నాప్‌డీల్ సహవ్యవస్థాపకుడు, సీఈవో కునాల్ బాల్ చెప్పారు. అయితే ఎంత మొత్తం ఇన్వెస్ట్ చేసిందీ వెల్లడించలేదు. కేవలం నాలుగేళ్ల కాలంలోనే తాము సాధించిన వృద్ధి, విజయాలకు ఇది నిదర్శనమని ఈ సందర్భంగా కునాల్ వ్యాఖ్యానించారు.
స్నాప్‌డీల్ మొదలయ్యాక ఇప్పటివరకూ 40 కోట్ల డాలర్ల పెట్టుబడులను సమీకరించడంతోపాటు, వీటిలో 10 కోట్ల డాలర్లను లాజిస్టిక్స్ ఏర్పాటు, కార్యకలాపాల విస్తరణకు వినియోగించింది. పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా పెట్టుబడి ద్వారా దీర్ఘకాలిక వ్యూహాలతో సాగుతున్న తమ కంపెనీకి అత్యుత్తమ విలువ చేకూరుతుందని పేర్కొన్నారు.
దీంతో కంపెనీకి సంబంధించి అత్యంత కీలక దశ ప్రయాణం మొదలైందని చెప్పారు. టాటా నుంచి తాను, తన సిబ్బంది ఎంతో నేర్చుకోవచ్చునని చెప్పారు. స్నాప్‌డీల్‌లో ఇప్పటికే ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌తోపాటు, టెమాసెక్, బ్లాక్‌రాక్, మైరియాడ్, టైబోర్న్‌వంటి కంపెనీలు ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గత రెండేళ్లలో స్నాప్‌డీల్ 600% చొప్పున వృద్ధి సాధించిన విషయాన్ని కునాల్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ బాటలో మార్చి 2016కల్లా 2 బిలియన్ డాలర్ల(రూ. 12,000 కోట్లు) బిజినెస్ మైలురాయిని అందుకుంటామంటూ ఆయఆశాభావం వ్యక్తం చేశారు.