ఈ-కామర్స్‌లో ఇన్వెస్ట్ చేస్తా..
కోల్‌కతా: దేశ ఈకామర్స్ రంగంలో వ్యక్తిగతంగా ఇన్వెస్ట్‌చేయనున్నట్లు టాటా సన్స్ ఎమిరిటస్ చైర్మన్ రతన్ టాటా పేర్కొన్నారు. వైవిధ్యభరిత రంగాలలో వ్యక్తిగతంగా పెట్టుబడిపెట్టాలనుకుంటున్నట్లు చెప్పారు. వీటిలో ఈకామర్స్ ఒకటని తెలిపారు. దేశీయ వినియోగదారుల్లో అత్యధిక శాతంమందికి అవసరమైన వస్తువులు పూర్తి స్థాయిలో అందుబాటులోలేవని, దీంతో ఈకామర్స్ మార్కెట్‌కు భారీ అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు.
అయితే ఈరిటైలింగ్ సంస్థ స్నాప్‌డీల్‌లో ఇన్వెస్ట్‌చేస్తారా అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు టాటా నిరాకరించారు. ప్రస్తుతం ఈకామర్స్ పెట్టుబడులపై నిర్ధిష్టంగా స్పందించడం సరికాదని వ్యాఖ్యానించారు. 50-60 కోట్ల మంది దేశీ ప్రజలు వినియోగదారులేనని పేర్కొన్నారు. వ్యాఖ్యానించారు. ఇటీవల దేశీ ఈకామర్స్ రిటైలింగ్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ వంటి సంస్థలు అమెజాన్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలకు పోటీగా ఎదుగుతున్న సంగతి తెలిసిందే.
దేశీ ఈ-కామర్స్ మార్కెట్లో తొలిసారి అత్యధిక స్థాయిలో ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడులను గత నెలలో ఫ్లిప్‌కార్ట్ ఆకర్షించింది. ఈ బాటలో అమెజాన్ సైతం దేశీయంగా 2 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్‌చేయనున్నట్లు ప్రకటించి మరింత పోటీకి తెరలేపింది. ఈ నేపథ్యంలో రతన్ టాటా ఈకామర్స్ పెట్టుబడి ప్రణాళికలకు ప్రాధాన్యత ఏర్పడింది.
సింగూర్ వీడటం తెలివైన పని...: నానో కార్ల ప్లాంట్‌ను పశ్చిమ బెంగాల్‌లోని సింగూరు నుంచి తరలించడం తెలివైన నిర్ణయమని టాటా సమర్థించుకున్నారు. 2008 సంవత్సరంలో వ్యతిరేక పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్లాంట్‌ను సింగూరు నుంచి గుజరాత్‌లోని సణంద్‌కు తరలించిన విషయం విదితమే. వెనక్కి తిరిగి చూసుకుంటే సింగూరును వీడటం తెలివైన నిర్ణయమే అయినప్పటికీ, ఇందుకు గ్రూప్ భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చిందని టాటా వ్యాఖ్యానించారు. ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో టాటా పలు అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
నానోపై దుష్ర్పచారం...
నానో కారును తయారు చేసే సమయానికి అంతర్జాతీయ స్థాయిలో దీనిపై ఆసక్తి నెలకొందని టాటా తెలిపారు. 2,500 డాలర్ల(సుమారు రూ. లక్ష) ఆఫర్ ధరలో నానో కోసం మూడు లక్షల ఆర్డర్లు వెల్లువెత్తాయని, రెండేళ్ల వెయిటింగ్ పిరియడ్ పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. అయితే అదే సమయంలో ప్లాంట్‌ను తరలించడంతో ఏడాది కాలం ఆలస్యం అయ్యిందని, దీంతో ప్రత్యర్థి సంస్థలకు నానోపై దుష్ర్పచారాన్ని చేపట్టేందుకు వీలుచిక్కిందని వ్యాఖ్యానించారు. ఫలితంగా కారుపై ఆసక్తి క్షీణించిందని వివరించారు.
మోడీకి మరింత సమయం ఇవ్వాలి...
ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ క్రియాశీలక వ్యక్తని టాటా ప్రశంసించారు. సింగూర్ నుంచి నానో ప్లాంట్‌ను తరలించాల్సి వచ్చిన సందర్భంలో గుజరాత్‌లోని సణంద్‌లో అవకాశమిచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ప్రధానిగా మోడీ దేశ ఆర్థిక వ్యవస్థను టర్న్‌ఎరౌండ్ చేసేందుకు మరింత సమయం ఇవ్వాల్సి ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే మోడీ క్రియాశీలక వ్యక్తిగా తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారని చెప్పారు. ఇందుకు గుజరాత్‌లో జరిగిన అభివృద్ధి నిదర్శనమని చెప్పారు. ప్రజాస్వామ్యంలో వచ్చిన మార్పుల కారణంగా 1984 తరువాత తొలిసారి ఒకే పార్టీ అధికారాన్ని సాధించగలిగిందని, దీంతో ప్రభుత్వ ఆధారిత పాలనకాకుండా వృద్ధి ఆధారిత పాలనకు తెరలేచిందని వ్యాఖ్యానించారు.
రాజకీయాలపై ఆసక్తి లేదు...
తనకు మార్గదర్శి అయిన జేఆర్‌డీ టాటా తరహాలోనే రాజకీయాల్లోకి రావాలనే ఆసక్తి ఏమాత్రం లేదని రతన్ టాటా స్పష్టం చేశారు. తన జీవితంలో ఏనాడూ రాజకీయాలపై దృష్టిపెట్టలేదని చెప్పారు. ఇతరులను ఎన్నడూ బాధించని వ్యక్తిగా తాను గుర్తుండిపోవాలని కోరుకుంటానని రతన్ చెప్పారు. బిజినెస్ అభివృద్ధి కోసమే కృషి చేసిన వ్యక్తిగా ఇతరుల మనసుల్లో నిలవాలని ఆశిస్తానని ఈ సందర్భంగా తెలిపారు.