భారత్ లో అమెజాన్ పెట్టుబడుల వర్షం
న్యూఢిల్లీ : భారత్ లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకోవడానికి ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ పెట్టుబడుల వర్షం కురిపిస్తోంది. ఫ్లిప్ కార్ట్ తో పోటీకి సై అంటూ.. టాప్ లో నిలిచేందుకు భారత్ కార్యకలాలపాల్లో అదనంగా 300 కోట్ల డాలర్లను(దాదాపు రూ.20,169.75 కోట్లు) పెట్టుబడులను పెడుతున్నట్టు అమెజాన్ ప్రకటించింది. భారత మార్కెట్లోకి ప్రవేశించిన ఏడాది అనంతరం 2014లో 200 కోట్ల డాలర్లను పెట్టుబడులుగా పెడతామని అమెజాన్ వెల్లడించింది.
అనంతరం భారత మార్కెట్లో వస్తున్న స్థానిక ప్రత్యర్థుల పోటీని తట్టుకునేందుకు తన పెట్టుబడులను మరింత పెంచుతోంది. భారత్ లో కార్యకలాపాలకు అదనంగా 300 కోట్ల డాలర్ల పెట్టుబడులను పెంచే యోచనలో ఉన్నట్టు అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈవో జెఫ్ బెజోస్ ప్రకటించారు. దీంతో మొత్తం 500 కోట్ల డాలర్లను(రూ.30,750కోట్లు) భారత్ లో పెట్టుబడులుగా అమెజాన్ పెట్టనుంది.
ఇప్పటికే భారత మార్కెట్లో 45 వేల ఉద్యోగాలను సృష్టించామని, భారత ఆర్థికవ్యవస్థలో మరింత వృద్ధిని సాధిస్తామని బెజోస్ ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో ఉన్న నేపథ్యంలో బెజోస్ ఈ పెట్టుబడుల ప్రకటన చేయడం విశేషం. యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్(యూఎస్ఐబీసీ) గ్లోబల్ లీడర్ షిప్ అవార్డును, సన్ ఫార్మాస్యూటికల్ వ్యవస్థాపకుడు దిలీప్ సంఘ్వీతో కలిసి బెజోస్ ప్రధాని మోదీ చేతుల మీదుగా అందుకున్నారు.
అతిపెద్ద మార్కెట్ చైనాను సొంతం చేసుకోవాలన్న అమెజాన్ కు అక్కడి స్థానిక ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబాతో గట్టి పోటీనే ఎదురైంది. అలీబాబాతో పోటీని తట్టుకోలేక చైనా మార్కెట్ ను కోల్పోయింది. ప్రస్తుతం భారత మార్కెట్ ను గెలవడం కూడా అమెజాన్ కు క్లిష్టమేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2013 జూన్ లో భారత మార్కెట్లోకి ప్రవేశించిన అమెజాన్ గతవారమే మూడేళ్ల వార్షికోత్సవాన్ని జరుపుకుంది. అమెజాన్ ఇప్పటికే సరుకు రవాణాలో స్నాప్ డీల్ ను దాటేసింది. ఫ్లిప్ కార్ట్ మార్కెట్ షేరుకు చేరువలో ఉంది.