ట్యాబ్ కొంటే సబ్బు బిళ్ల పంపారు
యడ్లపాడు (గుంటూరు): ఆన్‌లైన్ షాపింగ్‌లో ట్యాబ్ బుక్ చేసుకుంటే సబ్బు బిళ్ల చేతికి వచ్చిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా యడ్లపాడు రాజీవ్‌గాంధీ సెంటర్‌కు చెందిన టైలర్ భాస్కర్ ఫిబ్రవరి 16న సోలో కంపెనీ ట్యాబ్‌ను స్నాప్‌డీల్ ద్వారా బుక్ చేశాడు. అది సరిగ్గా నాలుగు రోజులకు చిలకలూరిపేట బ్లూడార్ట్ కొరియర్ సెంటర్‌కు వచ్చింది. అదే నెల 21న బ్లూడాట్ సెంటర్‌లో రూ.4వేలు డబ్బులు చెల్లించిన భాస్కర్ అక్కడే బాక్స్ తెరిచి చేసి చూశాడు.
అంతే... అందులో డిటర్జెంట్ సబ్బు ఉండటాన్ని చూసి ఒక్కసారిగా కంగుతిన్నాడు. సబ్బుతో పాటు ఇయర్ ఫోన్, బ్యాటరీ ఉన్నాయి కానీ ట్యాబ్ లేదు. ఇదేమని ప్రశ్నిస్తే కొరియర్ వారు తమకు సంబంధం లేదని చెప్పడంతో యడ్లపాడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా... ఎస్సై ఉమామహేశ్వరరావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.