స్నాప్‌డీల్ చేతికి రెడ్యూస్ డేటా స్టార్టప్
న్యూఢిల్లీ : అమెరికాకు చెందిన రెడ్యూస్ డేటా స్టార్టప్‌ను ఈ- కామర్స్ దిగ్గజం స్నాప్‌డీల్ కొనుగోలు చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రియల్-టైమ్ డేటా, ఇతర టూల్స్‌తో ప్రోగ్రామాటిక్ డిస్‌ప్లే అడ్వర్టైజింగ్ ప్లాట్‌ఫామ్‌ను నిర్వహించే ఈ స్టార్టప్‌ను ఎంతకు కొనుగోలు చేసిన వివరాలను స్నాప్‌డీల్ వెల్లడించలేదు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సంస్థలతో పోటీపడేందుకు గాను చేసే ప్రయత్నాల్లో భాగంగా ఈ స్టార్టప్‌ను స్నాప్‌డీల్ కొనుగోలు చేసింది. 2012లో ఆసిఫ్ ఆలీ ఈ స్టార్టప్‌ను ప్రారంభించారు. అమెరికా, భారత్, ఇంగ్లాండ్‌ల్లో ఈ స్టార్టప్‌కు క్లయింట్లున్నారు.
వెబ్ స్కేల్ టెక్నాలజీస్, ప్రోడక్ట్ మేనేజ్‌మెంట్ తదితర అంశాల్లో ఆసిఫ్ ఆలీకి 17 ఏళ్ల అపార అనుభవం ఉందని, ఈ స్టార్టప్ కొనుగోలుతో తమ సాంకేతిక సామర్థ్యం మరింత మెరుగుపడుతుందని స్నాప్‌డీల్ సహ వ్యవస్థాపకుడు రోహిత్ బన్సాల్ చెప్పారు. ఈ-కామర్స్ మార్కెట్లో వాటాను మరింత పటిష్టం చేసుకునే వ్యూహంలో భాగంగా స్నాప్‌డీల్ పలు స్టార్టప్‌లను కొనుగోలు చేస్తోంది. చెల్లింపుల, మొబైల్ రీచార్జ్ స్టార్టప్ ఫ్రీచార్జ్‌ను, మార్టిమోబి, లెట్స్‌గోమో ల్యాబ్స్‌ను కొనుగోలు చేసింది. డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్లాట్‌ఫామ్ రూపీపవర్, లాజిస్టిక్స్ వెంచర్ గోజావాస్‌లో వాటాలను కొనుగోలు చేసింది.