మీకు ఎంతో ఇష్టమైన వారిని కోల్పోయామని బాధపడుతున్నారా? మీ ఆప్తులను తిరిగి మీ ఇంటికి తెస్తామంటోంది అమెజాన్ కంపెనీ. అదెలా సాధ్యమని అనుకుంటున్నారా?
అయితే ఓ లుక్కేయండి..
అలెక్సా అసిస్టెంట్ కృత్రిమ మేథ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్–ఏఐ) సాంకేతికత సాయంతో చనిపోయిన మీ బంధువులను/ఆప్తులను మీ వద్దకు చేరుస్తామంటోంది! వారిని భౌతికంగా తీసుకురాలేనప్పటికీ వారి గొంతుకను మనకు వినిపిస్తామంటోంది. అమెజాన్‌లో బాగా ప్రాచుర్యం పొందిన అలెక్సా వాయిస్ అసిస్టెంట్‌కు సంబంధించిన కొత్త ఫీచర్‌ను కంపెనీ ఇటీవల ఆవిష్కరించింది.
అది చనిపోయిన వారి గొంతుకతో మాట్లాడుతుంది. రికార్డు చేసిన వారి వాయిస్ ఆధారంగా అలెక్సా అచ్చం వారిలాగే మాట్లాడి మనల్ని మురిపిస్తుంది. అమెరికాలోని లాస్‌వెగాస్‌లో ఇటీవల నిర్వహించిన వార్షిక సదస్సులో అమెజాన్ దీన్ని ప్రదర్శించింది. ఒక నిమిషం కన్నా తక్కువ నిడివి ఉన్న రికార్డెడ్ వాయిస్‌ను విని ఇది ఎవరి గొంతుతోనైనా ఇట్టే మాట్లాడేయగలదని కంపెనీ వెల్లడించింది.
నానమ్మా.. కథ చెప్పవా?
వాయిస్ అసిస్టెంట్‌కు సంబంధించిన వీడియోను అలెక్సా ఏఐ సీనియర్ వైస్‌ప్రెసిడెంట్, హెడ్ సైంటిస్ట్ రోహిత్ ప్రసాద్ ఆ సదస్సులో ప్రదర్శించారు. ఆ వీడియోలో ఏముందంటే ఒక పదేళ్ల బాలుడు ‘అమెజాన్ ఎకో డాట్’తో ‘అలెక్సా.. మా నానమ్మ ద్వారా ‘ది విజార్డ్ ఆఫ్ ఓజ్’ కథను నాకు వినిపించవా’ అని అడుగుతాడు. అప్పుడు అలెక్సా.. ఓకే అని చెప్పి ఆ బాలుడు అడిగినట్లు చనిపోయిన వాళ్ల నానమ్మ గొంతుకతో ఆ కథను చదివి వినిపిస్తుంది. ఈ వీడియో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.
జ్ఞాపకాలు పదిలంగా..
‘ప్రస్తుత ప్యాండెమిక్ సమయంలో మనకెంతో ఇష్టమైన వారిని కోల్పోయాం. ఈ కృత్రిమ మేథ వారిని కోల్పోయామన్న బాధను తప్పించలేనప్పటికీ.. వారి జ్ఞాపకాలను మాత్రం మనకు అందిస్తుంది. అలెక్సా ద్వారా వారి జ్ఞాపకాలను మనం పదిలపరుచుకోవచ్చు’ అని రోహిత్ ప్రసాద్ ఉద్వేగంగా చెప్పారు. అయితే ఈ టెక్నాలజీని ఎప్పుడు అందుబాటులోకి తెస్తారో ఆయన వెల్లడించలేదు.
– సాక్షి సెంట్రల్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment