సాక్షి, సిటీబ్యూరో: ఈ కామర్స్ యాప్ స్నాప్‌డీల్‌లో వాచీ కొన్నాడు...కొన్నాళ్ళకే లక్కీ డ్రాలో కారు గెల్చుకున్నారంటూ సందేశం రావడంతో పొంగిపోయాడు... సైబర్ నేరగాళ్ళ మాటల వల్లోపడి రూ.50 వేలు పోగొట్టుకున్నాడు... చివరకు మోసపోయానని గుర్తించి బుధవారం సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. బేగంబజార్ ప్రాంతానికి చెందిన ఓ కార్పెంటర్ ఇటీవల స్నాప్‌డీల్ నుంచి వాచీ ఖరీదు చేశారు. ఇది కొరియర్‌లో అతడికి చేరిన కొన్ని రోజుల తర్వాత స్నాప్‌డీల్ నుంచి అంటూ ఓ సంక్షిప్త సందేశం వచ్చింది. అందులో తమ సంస్థ నిర్వహించిన లక్కీడ్రాలో కారు గెల్చుకున్నారని, ఇతర వివరాలు తమ ప్రతినిధి అందిస్తారని ఉంది. ఇది జరిగిన మరుసటి రోజు స్నాప్‌డీల్ సంస్థ నుంచి అంటూ ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. లక్కీడ్రాలో రూ.12.6 లక్షల విలువైన హైఎండ్ కారు గెల్చుకున్నందుకు శుభాకాంక్షలు తెలిపాడు. ఈ కారును సొంతం చేసుకోవడానికి సదరు కార్పెంటర్ సంసిద్ధత వ్యక్తం చేయడంతో సైబర్ నేరగాళ్ళు అసలు కథ ప్రారంభించారు. కారును డెలివరీ పొందడానికి కొన్ని చార్జీలు, పన్నులు చెల్లించాలని ఎర వేశారు. అలా రకరాలైన పేర్లతో రూ.8,500 నుంచి ప్రారంభించి విడదల వారీగా రూ.50,700 తమ ఖాతాల్లోకి డిపాజిట్ చేయించుకున్నారు. సైబర్ నేరగాళ్ళు మరికొంత మొత్తం చెల్లించాలని అడుగుతుండటంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు బుధవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్ జి.వెంకటరామిరెడ్డి దర్యాప్తు ప్రారంభించారు.
మూడు చోట్ల నుంచి లీక్‌కు అవకాశం
ఈ తరహా మోసాల్లో ఓ వ్యక్తిని సైబర్ నేరగాళ్ళు టార్గెట్ చేయడానికి ఆయా ఈ–కామర్స్ సంస్థల డేటానే ఆధారం. ఈ కేసును తీసుకుంటే బేగంబజార్‌కు చెందిన బాధితుడు స్నాప్‌డీల్ నుంచి వాచీ ఖరీదు చేశాడనే విషయం ఆ సంస్థతో పాటు మరో రెండు సంస్థలకు తెలిసే అవకాశం ఉంది. ఈ తరహాకు చెందిన ఈ–కామర్స్ సైట్స్/యాప్స్ తమకు వచ్చిన ఆర్డర్స్‌ను థర్డ్ పార్టీ సంస్థలకు పంపిస్తాయి. ఆయా వస్తువుల్ని తయారు చేసే, సరఫరా చేసే సంస్థలే థర్డ్‌పార్టీలుగా ఉంటాయి. వీళ్ళు వినియోగదారుడు ఆర్డర్ చేసిన వస్తువుల్ని అతడి చిరునామాకు కొరియర్ ద్వారా పంపిస్తారు. కస్టమర్ చెల్లించిన సొమ్ముకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు స్నాప్‌డీల్‌కు ఈ థర్డ్ పార్టీ సంస్థకు మధ్య జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి ఫలానా సైట్/యాప్ నుంచి ఫలానా వస్తువు ఖరీదు చేశాడనే సమాచారం ఆ సంస్థతో పాటు, థర్డ్ పార్టీ సంస్థకు, కోరియర్ సంస్థకు తెలిసే ఆస్కారం ఉంది. ఈ మూడు చోట్ల పని చేసే ఉద్యోగుల్లో ఎవరైనా ఈ డేటా లీక్ చేస్తున్నారని అనుమానిస్తున్నాం. దీనికి సంబంధించి లోతైన దర్యాప్తు చేయాల్సి ఉంది. లక్కీ డ్రాల పేరుతో వచ్చే సందేశాలు, ఫోన్‌కాల్స్‌ను నమ్మవద్దు.– జి.వెంకట రామిరెడ్డి, సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్
Comments
Please login to add a commentAdd a comment