ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: ఆన్‌లైన్‌లో ఐదు తులాల బంగారు నాణేన్ని ఆర్డర్ చేశాడో వ్యక్తి. సీల్డ్‌బాక్స్‌లో బిల్ ఇన్‌వాయిస్ మాత్రమే పంపించిందా దుకాణం. నష్టపరిహారంగా 18 శాతం వడ్డీతో నగదు ఇవ్వాలని రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార సంస్థ తీర్పు చెప్పింది. వివరాల్లోకి వెళితే... వరంగల్ జిల్లా పరకాలకు చెందిన రవిచంద్ర (24) 2016 డిసెంబర్ 17న ఆన్‌లైన్‌లో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్‌కు చెందిన 50 గ్రాముల బంగారాన్ని హైదరాబాద్‌లోని షాపర్స్‌స్టాప్‌లో ఆర్డర్ చేశాడు. అందుకోసం రూ.1,53,091 చెల్లించాడు. ఆరమెక్స్ కొరియర్ ద్వారా బంగారం పంపుతున్నట్లు 2016 డిసెంబర్ 22న మలబార్ గోల్డ్ నుంచి సమాచారం వచ్చింది. కానీ డిసెంబర్ 26న ఇ–కామ్ ఎక్స్‌ప్రెస్ కొరియర్ ద్వారా సీల్డ్‌బాక్స్ వచ్చింది.
అనుమానాస్పదంగా ఉన్న ఆ కవర్‌ను వీడియోగ్రఫీ సాయంతో తెరిచి చూడగా, అందులో గోల్డ్ కాయిన్ లేదు. కేవలం రూ.1,53,091కి సంబంధించిన బిల్లు మాత్రమే ఉంది. దీంతో అతను వీడియోను జత చేస్తూ షాపర్స్‌స్టాప్ హైదరాబాద్, ముంబై ఆఫీసుల్లో ఫిర్యాదు చేశాడు. అయినా ఎలాంటి స్పందనా రాలేదు. దీంతో 2017లో హైదరాబాద్‌లోని వినియోగదారుల ఫోరం–1 కోర్టును ఆశ్రయించాడు. 2019 ఫిబ్రవరి 5న ఫిర్యాదుదారునికి అనుకూలంగా తీర్పు వచ్చింది. దీనిపై షాపర్స్‌స్టాప్, రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్(ఎస్సీడీఆర్సీ)ని ఆశ్రయించింది.
కేసు పూర్వాపరాలను, సాక్ష్యాధారాలను పరిశీలించిన కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ ఎంఎస్‌కె జైస్వాల్, సభ్యురాలు మీనా రామనాథన్ శుక్రవారం తీర్పు వెలువరించారు. హైదరాబాద్ వినియోగదారుల ఫోరం ఇచ్చిన తీర్పును సమర్ధించారు. వినియోగదారుడు చెల్లించిన మొత్తాన్ని, అప్పటి నుంచి డబ్బు తిరిగి ఇచ్చేంతవరకు 18 శాతం వడ్డీతో ఇవ్వాలని ఆదేశించారు. అంతేకాక రూ.50 వేల నష్టపరిహారం, రూ.10వేలు ఖర్చుల కింద చెల్లించాలని, ఈ ప్రక్రియను 30 రోజుల్లో పూర్తి చేయాలని తీర్పులో పేర్కొన్నారు. (క్లిక్: హైదరాబాద్‌లో ఇక ఇంటి వద్దకే ఇంధనం!)
Comments
Please login to add a commentAdd a comment