
స్నాప్‌డీల్‌కు ఫ్లిప్‌కార్ట్ కొత్త ఆఫర్
టేకోవర్‌కు 900–950 మిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: ఈకామర్స్ సంస్థ స్నాప్‌డీల్‌ను కొనుగోలు చేసేందుకు పోటీ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తాజాగా తమ ఆఫర్‌ను సవరించింది. స్నాప్‌డీల్ ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్‌తో పాటు యూనికామర్స్ సంస్థను కూడా కొనుగోలు చేసేందుకు 900–950 మిలియన్ డాలర్లు ఇస్తామంటూ ఆఫర్ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈకామర్స్ మేనేజ్‌మెంట్ సాఫ్ట్‌వేర్, ఫుల్‌ఫిల్‌మెంట్ సేవల సంస్థ యూనికామర్స్‌ను స్నాప్‌డీల్ 2015లో కొనుగోలు చేసింది. ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ ఒప్పందం ఇంకా ఖరారు కాలేదని, చర్చల దశలోనే ఉందని వివరించాయి. దీనిపై సమావేశం కానున్న స్నాప్‌డీల్ .. మొత్తం మీద డీల్‌కు సుముఖంగానే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి. నగదు, తత్సమాన అసెట్స్ రూపంలో ఒప్పందం తుది మొత్తం చెల్లింపులకు సంబంధించి చివర్లో స్వల్ప మార్పులు, చేర్పులేమైనా ఉండొచ్చని ఆయా వర్గాలు తెలిపాయి.
నిధుల కొరతతో కటకటలాడుతున్న స్నాప్‌డీల్‌ను కొనేందుకు ఫ్లిప్‌కార్ట్ ముందు 1 బిలియన్ డాలర్ల దాకా ఇవ్వజూపినప్పటికీ.. మదింపు ప్రక్రియ అనంతరం 800–850 మిలియన్ డాలర్ల దాకా (సుమారు రూ. 5,500 కోట్లు) ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. అయితే, స్నాప్‌డీల్ దీన్ని తిరస్కరించడంతో తాజాగా సవరించిన ఆఫర్ మరొకటి ఇచ్చింది. ఒకవేళ స్నాప్‌డీల్ బోర్డు గానీ దీనికి అంగీకరిస్తే తుది విక్రయ, కొనుగోలు ఒప్పందంపై ఇరు పక్షాలు చర్చలు జరుపుతాయి. అటు స్నాప్‌డీల్ మొబైల్ చెల్లింపుల విభాగం ఫ్రీచార్జ్, సరకు రవాణా వ్యాపార విభాగం వల్కన్ ఎక్స్‌ప్రెస్‌ల విక్రయానికి కూడా వేర్వేరుగా డీల్స్ కుదుర్చుకోవడంపై కసరత్తు చేస్తోంది.