స్నాప్‌డీల్‌కి ఫ్లిప్‌కార్ట్ మరో ఆఫర్!!
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ ఈ–కామర్స్ సంస్థ ‘ఫ్లిప్‌కార్ట్’.. స్నాప్‌డీల్‌కు అతిత్వరలోనే మరొక ఆఫర్‌ను ప్రకటించే అవకాశముంది. కాగా ఫ్లిప్‌కార్ట్ 800–850 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.5,500 కోట్లు) కొనుగోలు ప్రతిపాదనను స్నాప్‌డీల్ బోర్డు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. ఫ్లిప్‌కార్ట్ ఆఫర్... కంపెనీ వాస్తవ విలువ కన్నా తక్కువగా ఉందని స్నాప్‌డీల్ పేర్కొంది. కాగా కొత్త ఆఫర్ 1 బిలియన్ డాలర్లకు దగ్గరగా ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.
తొలి ఆఫర్ తిరస్కరణ నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ మధ్య మళ్లీ చర్చలు జరుగుతున్నాయి. ఇవి ఇంకా కొలిక్కి రాలేదు. ఒకవేళ అన్ని కుదిరితే డీల్ ఒక నెలలోనే పూర్తయ్యే అవకాశముంది. కాగా ఈ అంశాలపై అటు స్నాప్‌డీల్, సాఫ్ట్‌బ్యాంక్ కానీ, ఇటు ఫ్లిప్‌కార్ట్ కానీ స్పందించలేదు. కాగా స్నాప్‌డీల్.. ఫ్రీచార్జ్ (మొబైల్ వాలెట్ విభాగం), వుల్కాన్ ఎక్స్‌ప్రెస్ (లాజిస్టిక్ విభాగం) విక్రయానికి సంబంధించి ప్రత్యేకమైన మంతనాలు జరుపుతోంది. ఈ డీల్స్ కూడా వచ్చే కొన్ని వారాల్లో పూర్తయ్యే అవకాశముంది. ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ డీల్ ఓకే అయితే ఇది దేశీ ఈ–కామర్స్ రంగంలో అతిపెద్ద విలీనంగా అవతరించనుంది.