స్నాప్‘డీల్ ’కు ఇన్వెస్టర్లు సై
ఇక ఫ్లిప్‌కార్ట్‌కు విక్రయించటం లాంఛనమే!
► ఎట్టకేలకు నెక్సస్ వెంచర్స్‌ను ఒప్పించిన సాఫ్ట్‌బ్యాంక్
► డీల్ ప్రకారం వ్యవస్థాపకులకు చెరో 30 మిలియన్ డాలర్లు
► నెక్సస్‌కు 80 మిలియన్ డాలర్లు; కలారికి 70–80 మిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ సంస్థ స్నాప్‌డీల్ విక్రయం దిశగా మరో అడుగు ముందుకు పడింది. పోటీ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌కు దీన్ని విక్రయించే ప్రతిపాదనకు కంపెనీలో కీలకమైన ఇన్వెస్టరు నెక్సస్ వెంచర్ పార్ట్‌నర్స్ (ఎన్‌వీపీ) ఎట్టకేలకు ఆమోదముద్ర వేసింది. ఎన్‌వీపీ నుంచి ఆమోదం కోసం సహ ఇన్వెస్టరు సాఫ్ట్‌బ్యాంక్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వ్యవస్థాపకులు, ఇంకో ఇన్వెస్టరు కలారి క్యాపిటల్ నుంచి సాఫ్ట్‌బ్యాంక్ ఆమోదముద్ర దక్కించుకుంది. అయితే, వేల్యుయేషన్ ఆమోదయోగ్యంగా లేకపోవడంతో ఎన్‌వీపీ మాత్రం అంగీకారం తెలపలేదు. దీంతో గత కొద్ది వారాలుగా ప్రతిష్టంభనను తొలగించే క్రమంలో ఎన్‌వీపీతో సాఫ్ట్‌బ్యాంక్ చర్చలు జరుపుతోంది.
ఇందులో భాగంగా రెండు సంస్థల మధ్య పలు దఫాలుగా సమావేశాలు జరిగిన నేపథ్యంలో స్నాప్‌డీల్ విక్రయ ప్రతిపాదనకు ఎన్‌వీపీ ఆమోదం తెలిపినట్లు సంబంధిత వర్గాలు వివరించాయి. ఈ వారంలోనే ఫ్లిప్‌కార్ట్‌తో లాంఛనంగా ఒప్పందంపై సంతకాలు జరగొచ్చని, సాధ్యాసాధ్యాలు.. లాభనష్టాల మదింపు ప్రారంభం కావొచ్చని తెలిసింది. డీల్ ప్రకారం స్నాప్‌డీల్ వ్యవస్థాపకులకు చెరో 30 మిలియన్ డాలర్లు చొప్పున... అంటే దాదాపు రూ.192 కోట్ల వంతున దక్కుతాయి. ఎన్‌వీపీకి 80 మిలియన్ డాలర్లతో పాటు విలీన సంస్థలో కొంత వాటాలు కూడా లభిస్తాయి. మరో ఇన్వెస్టరు కలారి క్యాపిటల్‌కు 70–80 మిలియన్ డాలర్లు దక్కవచ్చు. అయితే, దీనిపై స్నాప్‌డీల్, సాఫ్ట్‌బ్యాంక్, ఎన్‌వీపీ, కలారి స్పందించలేదు.
భారీగా పడిపోయిన స్నాప్‌డీల్ వేల్యుయేషన్ ..
గతేడాది ఫిబ్రవరిలో ఆఖరుసారిగా నిధులు సమీకరించినప్పుడు 6.5 బిలియన్ డాలర్లుగా ఉన్న స్నాప్‌డీల్ వేల్యుయేషన్ ఇప్పుడు గణనీయంగా పడిపోయింది. ఫ్లిప్‌కార్ట్ గానీ కొనుగోలు చేసిన పక్షంలో 1 బిలియన్ డాలర్లుగా లెక్క కట్టే అవకాశముందని పరిశీలకుల అంచనా. స్నాప్‌డీల్‌లో సాఫ్ట్‌బ్యాంక్‌కు 30 శాతం పైగా, నెక్సస్‌కు సుమారు 10 శాతం, కలారికి 8 శాతం వాటాలు ఉన్నాయి. స్నాప్‌డీల్ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కంపెనీలో పెట్టిన పెట్టుబడులపై 2016–17లో దాదాపు 1 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 6,500 కోట్లు) నష్టం వచ్చినట్లు సాఫ్ట్‌బ్యాంక్ ప్రకటించిన సంగతి తెలిసిందే.