స్నాప్‌డీల్‌లో ఉద్యోగాల కోత?
బెంగళూరు : ఆన్‌లైన్ మార్కెట్ సంస్థ స్నాప్‌డీల్ బెంగళూరు, ముంబై, కోల్‌కతా, హైదరాబాద్ లాంటి ప్రాంతీయ కార్యాలయాల్లో తన కార్యకలాపాలను తగ్గించుకోనుంది. కంపెనీ కొత్తగా ఫండ్స్‌ను పెంచుకోలేని పరిస్థితుల్లో వచ్చే ఆరునెలల్లో కొన్ని ఆఫీసులను మూసేస్తుందని స్నాప్ డీల్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇప్పటికే బెంగళూరులోని అకౌంట్స్ అండ్ వెండర్ మేనేజ్ మెంట్ కు చెందిన టీమ్ ను 85 నుంచి 45 మందికి తగ్గించింది. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన పనితీరు మెరుగుదల ప్రణాళిక కింద 200 మంది ఉద్యోగులకు నోటీసులు జారీచేసింది. అయితే కంపెనీ డిమాండ్‌లను చేరుకోవడం చాలా కష్టమని చాలామంది ఉద్యోగులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. తమతో రాజీనామా చేయించొద్దని కొంతమంది ఉద్యోగులు ఢిల్లీకి వెళ్లి మరీ కంపెనీ అధినేతలతో చర్చించారు.
ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లాంటి పెద్ద ఈ-కామర్స్ దిగ్గజాలతో స్నాప్‌డీల్‌కు తీవ్ర పోటీ నెలకొంటోంది. ఈ పోటీని తట్టుకోలేక కంపెనీ కొన్ని ప్రాంతీయ ఆఫీసులను మూసివేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం స్నాప్ డీల్ యాడ్ బిజినెస్ ల వైపు దృష్టిసారిస్తుందని అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు.
రీజనల్ ఆఫీసుల తగ్గింపుపై స్నాప్ డీల్ ఇంకా అధికారిక ప్రకటన ఏమీ చేయలేదు. రాజధాని ప్రాంత టీమ్ సభ్యులను తమ గుర్గావ్ క్యాంపస్‌కు తరలిస్తున్నట్టు పేర్కొంది. దీంతో లీజుకు తీసుకున్న చిన్న చిన్న కార్యాలయాలు తగ్గించుకోవచ్చని తెలిపింది. ఎవరైనా ఉద్యోగులు కంపెనీ నుంచి వెళ్లదలుచుకుంటే, ఎంప్లాయిమెంట్ కాంట్రాక్టు ప్రకారం అన్ని చెల్లింపులను అందుకోవాలని ఓ ప్రకటన విడుదల చేసింది.