regional offices
-
పోస్ట్ ద్వారా 2,000 నోట్ల మార్పిడి
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రాంతీయ కార్యాలయాలకు దూరంగా ఉండే ప్రజలు తమ వద్ద ఉన్న రూ.2,000 నోట్లు మార్చుకోవడానికి సులభతరమైన విధానం అమలవుతోంది. పోస్ట్ ద్వారా ఈ మేరకు ప్రజలు సేవలు పొందవచ్చని ఇప్పటికే ప్రకటించిన ఆర్బీఐ ఉన్నతాధికారులు ఇందుకు వీలైన ప్రక్రియపై ప్రచారాన్ని చేపట్టారు. ఇన్సూర్డ్ పోస్ట్ లేదా టీఎల్ఆర్ (3 అంచెల రక్షణ) కవర్‌ను వినియోగించుకుని సురక్షితమైన మార్గంలో రూ.2,000 నోట్లు మార్చుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఈ విధానంలో పెద్ద నోట్ల మార్పిడికి సంబంధించిన డబ్బు సంబంధిత వినియోగదారు బ్యాంక్ ఖాతాల్లో జమవుతుంది. ‘‘కస్టమర్లు రూ. 2,000 నోట్ల మార్పునకు సంబంధించిన డబ్బు తమ ఖాతాలో అత్యంత సురక్షితమైన పద్ధతిలో ప్రత్యక్షంగా క్రెడిట్ కావడానికి వీలుగా ఇన్సూర్డ్ పోస్ట్‌ను వినియోగించుకోవాలని ప్రోత్సహిస్తున్నాము. ఈ విధానం నిర్దేశిత ప్రాంతీయ కార్యాలయాలకు ప్రయాణించడం, వరుసలో నిలబడ్డం వంటి ఇబ్బందుల నుంచి వినియోగదారుని నివారిస్తుంది’’ అని ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ రోహిత్ పి. దాస్ అన్నారు. చెలామణిలో ఉన్న రూ.2,000 నోట్లలో 97 శాతానికి పైగా తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థకు చేరాయని ఆర్బీఐ తెలిపింది. అక్టోబర్ 30వ తేదీ నాటికి రూ.10,000 కోట్ల విలువైన నోట్లు మాత్రమే ప్రజల వద్ద ఉన్నాయని పేర్కొంది. ఈ ఏడాది మే 19న ఆర్బీఐ రూ.2,000 డినామినేషన్ నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. దేశంలోని 19 ఆర్బీఐ కార్యాలయాల్లో ప్రజలు రూ. 2,000 నోట్లను డిపాజిట్ చేయవచ్చు లేదా మార్చుకోవచ్చు. రూ.2 వేల నోట్ల డిపాజిట్ లేదా మారి్పడి సేవలను బ్యాంకు శాఖలు అక్టోబర్ 7 వరకు అందించాయి. అక్టోబర్ 8 నుంచి ఈ సేవలు 19 ఆర్బీఐ కార్యాలయాలకు మారాయి. -
ఆర్టీసీలో ఇంటి దొంగలు!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో ఇంటి దొంగలు పెరిగిపోతున్నారు. శతవిధాలుగా ప్రయత్నిస్తూ ఆర్టీసీ ఖజానాకే వారు కన్నం పెడుతున్నారు. తాత్కాలిక సిబ్బందిని నియమించామంటూ వారి పేర జీతాలు డ్రా చేసిన బాగోతం ఇటీవల బయటపడిన విషయం తెలిసిందే. వరంగల్‌లో ఓ ఇన్చార్జి డిపో మేనేజర్ ఇదే తరహాలో నిధులు స్వాహా చేసినట్టు ఫిర్యాదులు రావటంతో విజిలెన్స్ విభాగం రంగంలోకి దిగి విచారణ జరిపింది. ఇటు అధికారులు కూడా అంతర్గత విచారణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ అక్రమాలు నిజమేనని తేలితే తమ బండారం కూడా బయటపడుతుందన్న కారణంతో పాటు, ఆ ఇన్చార్జి డిపో మేనేజర్‌తో ఉన్న సన్నిహిత పరిచయం వల్ల కేసును నీరుగార్చేందుకు తెరవెనక ఓ అధికారి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు సిబ్బంది బాహాటంగానే వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో బస్‌భవన్‌లోని కొందరు అధికారుల ద్వారా ఆ ఇన్చార్జి డిపో మేనేజర్‌ను సమస్య నుంచి తప్పించేందుకు రకరకాల ఏర్పాట్లు చేస్తున్నారని చెబుతున్నారు. ఇప్పుడీ వ్యవహారం ఆర్టీసీలో చర్చనీయాంశంగా మారింది. ఇదే తరుణంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరో అవినీతి బాగోతంపై ఫిర్యాదులు అందినట్టు తెలిసింది. కనీస వేతనాల పెంపు మొత్తం పక్కదారి.. ఆర్టీసీలో కొన్ని రకాల పనులకు ముందు నుంచి తాత్కాలిక ఉద్యోగులను నియమించుకోవటం పరిపాటి.. గతంలో వీరి సం ఖ్య ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం ఆర్టీసీ దివాలా దశకు చేరుకోవటంతో వీరి సంఖ్య తక్కువగా ఉంటోంది. తాత్కాలిక ఉద్యోగులు పనిచేసిన సమయంలో.. ప్రభుత్వం కనీస వేతనాలను సవరించినప్పుడు ఆ పెరిగిన మొత్తం కూడా తాత్కాలిక ఉద్యోగుల పేర విడుదలవుతాయి. ఉమ్మడి వరంగల్‌లోని మరో డిపోలో ఓ పర్యాయం అలా అందిన అదనపు మొత్తాలను తాత్కాలిక ఉద్యోగులకు ఇవ్వకుండా పెండింగ్‌లో ఉంచి తర్వాత స్వాహా చేశారనేది ఆరోపణ. దీనిపై అధికారులు రహస్యంగా విచారణ జరుపుతున్నట్టు సమాచారం. స్వాహా చేసిన మొత్తం చిన్నదే అయినప్పటికీ, ఆ వ్యవహారం జరిగిన తీరు తీవ్రమైనదిగా పరిగణించాల్సిందే. ఇదే క్రమంలో గత మేడారం జాతర సమయంలో దొంగ బిల్లులతో పెద్ద మొత్తంలో నిధులు స్వాహా చేసినట్టు కొందరు ఉద్యోగులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అప్పీలుకు ధర ఖరారు చేసి వసూలు టికెట్ల రూపంలో వచ్చిన మొత్తంలో కొంతమేర తగ్గితే కండక్టర్లను సస్పెండ్ చేయటం సహజం. అలాగే దురుసు డ్రైవింగ్, ప్రమాదాలకు కారణమైన డ్రైవర్లను కూడా సస్పెండ్ చేస్తారు. ఆ తర్వాత వారు తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాల్సిందిగా అప్పీల్ చేసుకుంటారు. ఇలా వచ్చిన అప్పీళ్లకు వరంగల్ రీజియన్ పొరుగున ఉన్న రీజియన్ అధికారి ధర ఖరారు చేసి వసూలు చేశాడన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. ఒక్కో అప్పీలుపై రూ.30 వేల నుంచి రూ.50 వరకు వసూలు చేశారని, ఓ ప్రైవేటు వ్యక్తిని ఏర్పాటు చేసి మరీ వసూళ్లు జరిపారని ఆర్టీసీలో పెద్ద చర్చ జరుగుతోంది. ఇటీవల ఈ విషయం రవాణాశాఖ మంత్రి దృష్టికి కూడా రావటంతో బస్‌భవన్‌లో చర్యలపై అంతర్మథనం జరిగింది. ఈ కేసుల్లో బాధ్యులు, తెరవెనక సహకరించిన వారిపై చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారని డ్రైవర్, కండక్టర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 10 రూపాయలు తేడా వచ్చినా కండక్టర్లను సస్పెండ్ చేయటం, బస్సు లైట్ పగిలితే డ్రైవర్‌పై చర్యలు తీసుకునే అధికారులు.. ఈ వ్యవహారాల్లో చూసీచూడనట్టు పోవటంపై గుర్రుగా ఉన్నారు. సమ్మె తదనంతర పరిణామాలతో కొంతకాలంగా అధికారులు–కండక్టర్, డ్రైవర్, శ్రామిక్‌లకు మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. ఇప్పుడు అధికారులపై ఆరోపణలు రావటంతో ఈ వ్యవహారాన్ని రచ్చ చేస్తుండటం విశేషం.. -
కీలక నిర్ణయం దిశగా రాయల్ ఎన్ఫీల్డ్
ముంబై: దిగ్గజ ఐకానిక్ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ కీలక నిర్ణయం తీసుకోనుంది. వ్యాపారాన్ని పుంజుకునేందుకు అనేక చర్యలు చేపట్టబోతుంది. దేశంలోని డజన్‌కుపైగా ప్రాంతీయ కార్యాలయాలను మూసివేస్తున్నట్లు సంస్థ ఉద్యోగులు తెలిపారు. నష్టాలను పూడ్చుకునేందుకు గుర్గావ్, చెన్నై, బెంగుళూరు, ముంబై, జార్ఖండ్, హైదరాబాద్, భువనేశ్వర్ తదితర రాష్ట్రాలలో ప్రాంతీయ కార్యాలయాలను వేంటనే మూసివేయనున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. ఉద్యోగుల తొలగింపు ఉండకపోవచ్చని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కార్యాలయాల మూసివేతపై పరిపాలన విభాగం కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. కార్యాలయ మూసివేత నిర్ణయంపై సీసీఓ(చీఫ్ కమర్షియల్ ఆఫీసర్) లలిత్ మాలిక్ దృవీకరించారు. ఆయన విలేకర్ల సమావేశంలో స్పందిస్తు.. కొన్ని ప్రాంతీయ కార్యాలయాలను మూసివేత నిర్ణయం తీసుకున్నామని అన్నారు. దీని ద్వారా తమ ఉద్యోగులకు ప్రయాణ సమయం ఆదా అవుతుందని తెలిపారు. కేంద్ర ప్రభుతం లాక్‌డౌన్‌ను సడలించడం ద్వారా తమ అమ్మకాలు పుంజుకున్నాయని రాయల్ ఎన్ఫీల్డ్ ప్రకటించింది. దేశంలో సంస్థ డీలర్‌షిప్‌లను పెంచబోతున్నట్లు ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 100కుపైగా నూతన రిటైల్ స్టోర్స్‌ను తెరవబోతున్నట్లు ప్రకటించింది. అత్యాధునిక బైక్‌ల రూపకల్పనలో రాయల్ ఎన్ఫీల్డ్ ప్రత్యేక స్థానం సాధించిన విషయం తెలిసిందే. (చదవండి: రాయల్ ఎన్ఫీల్డ్ కొత్త బైక్ : తక్కువ ధరలో) -
స్నాప్‌డీల్‌లో ఉద్యోగాల కోత?
బెంగళూరు : ఆన్లైన్ మార్కెట్ సంస్థ స్నాప్‌డీల్ బెంగళూరు, ముంబై, కోల్‌కతా, హైదరాబాద్ లాంటి ప్రాంతీయ కార్యాలయాల్లో తన కార్యకలాపాలను తగ్గించుకోనుంది. కంపెనీ కొత్తగా ఫండ్స్‌ను పెంచుకోలేని పరిస్థితుల్లో వచ్చే ఆరునెలల్లో కొన్ని ఆఫీసులను మూసేస్తుందని స్నాప్ డీల్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇప్పటికే బెంగళూరులోని అకౌంట్స్ అండ్ వెండర్ మేనేజ్ మెంట్ కు చెందిన టీమ్ ను 85 నుంచి 45 మందికి తగ్గించింది. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన పనితీరు మెరుగుదల ప్రణాళిక కింద 200 మంది ఉద్యోగులకు నోటీసులు జారీచేసింది. అయితే కంపెనీ డిమాండ్లను చేరుకోవడం చాలా కష్టమని చాలామంది ఉద్యోగులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. తమతో రాజీనామా చేయించొద్దని కొంతమంది ఉద్యోగులు ఢిల్లీకి వెళ్లి మరీ కంపెనీ అధినేతలతో చర్చించారు. ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లాంటి పెద్ద ఈ-కామర్స్ దిగ్గజాలతో స్నాప్‌డీల్‌కు తీవ్ర పోటీ నెలకొంటోంది. ఈ పోటీని తట్టుకోలేక కంపెనీ కొన్ని ప్రాంతీయ ఆఫీసులను మూసివేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం స్నాప్ డీల్ యాడ్ బిజినెస్ ల వైపు దృష్టిసారిస్తుందని అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. రీజనల్ ఆఫీసుల తగ్గింపుపై స్నాప్ డీల్ ఇంకా అధికారిక ప్రకటన ఏమీ చేయలేదు. రాజధాని ప్రాంత టీమ్ సభ్యులను తమ గుర్గావ్ క్యాంపస్‌కు తరలిస్తున్నట్టు పేర్కొంది. దీంతో లీజుకు తీసుకున్న చిన్న చిన్న కార్యాలయాలు తగ్గించుకోవచ్చని తెలిపింది. ఎవరైనా ఉద్యోగులు కంపెనీ నుంచి వెళ్లదలుచుకుంటే, ఎంప్లాయిమెంట్ కాంట్రాక్టు ప్రకారం అన్ని చెల్లింపులను అందుకోవాలని ఓ ప్రకటన విడుదల చేసింది.