సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో ఇంటి దొంగలు పెరిగిపోతున్నారు. శతవిధాలుగా ప్రయత్నిస్తూ ఆర్టీసీ ఖజానాకే వారు కన్నం పెడుతున్నారు. తాత్కాలిక సిబ్బందిని నియమించామంటూ వారి పేర జీతాలు డ్రా చేసిన బాగోతం ఇటీవల బయటపడిన విషయం తెలిసిందే. వరంగల్‌లో ఓ ఇన్‌చార్జి డిపో మేనేజర్ ఇదే తరహాలో నిధులు స్వాహా చేసినట్టు ఫిర్యాదులు రావటంతో విజిలెన్స్ విభాగం రంగంలోకి దిగి విచారణ జరిపింది. ఇటు అధికారులు కూడా అంతర్గత విచారణ జరుపుతున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆ అక్రమాలు నిజమేనని తేలితే తమ బండారం కూడా బయటపడుతుందన్న కారణంతో పాటు, ఆ ఇన్‌చార్జి డిపో మేనేజర్‌తో ఉన్న సన్నిహిత పరిచయం వల్ల కేసును నీరుగార్చేందుకు తెరవెనక ఓ అధికారి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు సిబ్బంది బాహాటంగానే వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో బస్‌భవన్‌లోని కొందరు అధికారుల ద్వారా ఆ ఇన్‌చార్జి డిపో మేనేజర్‌ను సమస్య నుంచి తప్పించేందుకు రకరకాల ఏర్పాట్లు చేస్తున్నారని చెబుతున్నారు. ఇప్పుడీ వ్యవహారం ఆర్టీసీలో చర్చనీయాంశంగా మారింది. ఇదే తరుణంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరో అవినీతి బాగోతంపై ఫిర్యాదులు అందినట్టు తెలిసింది.
కనీస వేతనాల పెంపు మొత్తం పక్కదారి..
ఆర్టీసీలో కొన్ని రకాల పనులకు ముందు నుంచి తాత్కాలిక ఉద్యోగులను నియమించుకోవటం పరిపాటి.. గతంలో వీరి సం ఖ్య ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం ఆర్టీసీ దివాలా దశకు చేరుకోవటంతో వీరి సంఖ్య తక్కువగా ఉంటోంది. తాత్కాలిక ఉద్యోగులు పనిచేసిన సమయంలో.. ప్రభుత్వం కనీస వేతనాలను సవరించినప్పుడు ఆ పెరిగిన మొత్తం కూడా తాత్కాలిక ఉద్యోగుల పేర విడుదలవుతాయి. ఉమ్మడి వరంగల్‌లోని మరో డిపోలో ఓ పర్యాయం అలా అందిన అదనపు మొత్తాలను తాత్కాలిక ఉద్యోగులకు ఇవ్వకుండా పెండింగ్‌లో ఉంచి తర్వాత స్వాహా చేశారనేది ఆరోపణ. దీనిపై అధికారులు రహస్యంగా విచారణ జరుపుతున్నట్టు సమాచారం. స్వాహా చేసిన మొత్తం చిన్నదే అయినప్పటికీ, ఆ వ్యవహారం జరిగిన తీరు తీవ్రమైనదిగా పరిగణించాల్సిందే. ఇదే క్రమంలో గత మేడారం జాతర సమయంలో దొంగ బిల్లులతో పెద్ద మొత్తంలో నిధులు స్వాహా చేసినట్టు కొందరు ఉద్యోగులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
అప్పీలుకు ధర ఖరారు చేసి వసూలు
టికెట్ల రూపంలో వచ్చిన మొత్తంలో కొంతమేర తగ్గితే కండక్టర్లను సస్పెండ్ చేయటం సహజం. అలాగే దురుసు డ్రైవింగ్, ప్రమాదాలకు కారణమైన డ్రైవర్లను కూడా సస్పెండ్ చేస్తారు. ఆ తర్వాత వారు తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాల్సిందిగా అప్పీల్ చేసుకుంటారు. ఇలా వచ్చిన అప్పీళ్లకు వరంగల్ రీజియన్ పొరుగున ఉన్న రీజియన్ అధికారి ధర ఖరారు చేసి వసూలు చేశాడన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. ఒక్కో అప్పీలుపై రూ.30 వేల నుంచి రూ.50 వరకు వసూలు చేశారని, ఓ ప్రైవేటు వ్యక్తిని ఏర్పాటు చేసి మరీ వసూళ్లు జరిపారని ఆర్టీసీలో పెద్ద చర్చ జరుగుతోంది.
ఇటీవల ఈ విషయం రవాణాశాఖ మంత్రి దృష్టికి కూడా రావటంతో బస్‌భవన్‌లో చర్యలపై అంతర్మథనం జరిగింది. ఈ కేసుల్లో బాధ్యులు, తెరవెనక సహకరించిన వారిపై చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారని డ్రైవర్, కండక్టర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 10 రూపాయలు తేడా వచ్చినా కండక్టర్లను సస్పెండ్ చేయటం, బస్సు లైట్ పగిలితే డ్రైవర్‌పై చర్యలు తీసుకునే అధికారులు.. ఈ వ్యవహారాల్లో చూసీచూడనట్టు పోవటంపై గుర్రుగా ఉన్నారు. సమ్మె తదనంతర పరిణామాలతో కొంతకాలంగా అధికారులు–కండక్టర్, డ్రైవర్, శ్రామిక్‌లకు మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. ఇప్పుడు అధికారులపై ఆరోపణలు రావటంతో ఈ వ్యవహారాన్ని రచ్చ చేస్తుండటం విశేషం..
Comments
Please login to add a commentAdd a comment