logistics hub
-
భారత్‌లో బోయింగ్ గ్లోబల్ సపోర్ట్ సెంటర్
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన విమానాల తయారీ దిగ్గజం బోయింగ్ భారత్‌లో తమ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తోంది. కొత్తగా గ్లోబల్ సపోర్ట్ సెంటర్ (జీఎస్సీ) ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. అలాగే లాజిస్టిక్స్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. తమ ఎయిర్‌లైన్ కస్టమర్లు, పౌర విమానయాన నియంత్రణ సంస్థలు, ఇతరత్రా పరిశ్రమ వర్గాలకు నిర్వహణపరమైన సామర్థ్యాలు.. భద్రతా ప్రమాణాలను మెరుగుపర్చుకోవడానికి అవసరమైన సేవలను జీఎస్సీ అందిస్తుంది. జీఎస్సీ, లాజిస్టిక్స్ కేంద్రంపై ఎంత వెచ్చిస్తున్నదీ మాత్రం సంస్థ వెల్లడించలేదు. దేశీ విమానయాన సంస్థలు 150 పైచిలుకు బోయింగ్ విమానాలను నడుపుతున్నాయి. తమ రిపేర్ డెవలప్మెంట్ అండ్ సస్టెయిన్‌మెంట్ హబ్ ప్రోగ్రాం ద్వారా బోయింగ్ ప్రస్తుతం స్థానిక కస్టమర్లకు వివిధ సర్వీసులను అందిస్తోంది. దేశీయంగా విమాన ప్రయాణాలు అసాధారణంగా పెరుగుతున్న నేపథ్యంలో భారత మార్కెట్లో వినూత్న అవిష్కరణలను ప్రవేశపెట్టేందుకు, ఏవియేషన్ వ్యవస్థను ఆధునీకరించేందుకు తాము కట్టుబడి ఉన్నామని బోయింగ్ ఇండియా ప్రెసిడెంట్ సలిల్ గుప్తే తెలిపారు. -
సీపోర్టు టు ఎయిర్‌పోర్టు 'సువిశాల రహదారి'
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో సుందర సాగర తీరాన్ని ఆనుకుని ఆరులేన్ల సువిశాల రహదారి రానుంది. విశాఖపట్నం నుంచి భీమిలి మీదుగా భోగాపురం వరకు బీచ్ కారిడార్ నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైంది. అలాగే విశాఖపట్నం పోర్ట్ టెర్మినల్ నుంచి నాలుగు లేన్ల జాతీయ రహదారిని నిర్మించి దానిని బీచ్ కారిడార్‌కు అనుసంధానించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. దాదాపు రూ. 3 వేల కోట్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టనున్న ఈ ప్రాజెక్టుతో పర్యాటక, పారిశ్రామిక అభివృద్ధికి రాచబాట పరచుకోనుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన కేంద్ర జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ విశాఖపట్నం బీచ్ కారిడార్ నిర్మాణానికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రూపొందించే ప్రక్రియ చేపట్టింది. రెండు దశలుగా బీచ్ కారిడార్.. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ఉన్న అవకాశాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణకు సన్నద్ధమైంది. దానిలో భాగంగా విశాఖపట్నం బీచ్‌కారిడార్‌ను నిర్మించనుంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల అభివృద్ధి శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ఇప్పటికే పలు దఫాలుగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. రెండు దశలుగా బీచ్‌కారిడార్‌ను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అందులో మొదటిగా విశాఖపట్నం నుంచి భీమిలి మీదుగా భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టును అనుసంధానిస్తూ బీచ్‌కారిడార్‌ను 20.20 కి.మీ. మేర ఆరు లేన్లుగా నిర్మిస్తారు. విశాఖపట్నంలో రుషికొండ, ఎండాడ, భీమిలి ప్రాంతాలు పర్యాటక, ఐటీ రంగాలకు కేంద్రస్థానంగా మలచాలన్నది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. అందుకోసం ఈ బీచ్‌కారిడార్ నిర్మాణం ఎంతగానో ఉపకరించనుంది. ఈ బీచ్ కారిడార్ వెంబడి పర్యాటక ప్రాజెక్టులు, దిగ్గజ ఐటీ, కార్పొరేట్ సంస్థలు కొలువు దీరేందుకు సౌకర్యంగా ఉంటుంది. రాష్ట్ర అభివృద్ధికి ఈ బీచ్ కారిడార్ చోదక శక్తిగా పనిచేస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఆరులేన్ల బీచ్ కారిడార్ నిర్మాణానికి సుముఖత తెలిపిన కేంద్ర ప్రభుత్వం.. డీపీఆర్ రూపొందించే ప్రక్రియ చేపట్టింది. ఇక ఈ బీచ్ కారిడార్ కోసం దాదాపు 346 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించనుంది. అందుకు దాదాపు రూ. 1,000 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. పోర్ట్‌ను అనుసంధానిస్తూ నాలుగు లేన్ల రహదారి... ఇక ఈ ప్రాజెక్టులో రెండో దశ కింద బీచ్ కారిడార్‌ను విశాఖపట్నం పోర్టుతో అనుసంధానించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. విశాఖపట్నం పోర్టు టెర్మినల్‌ను జాతీయ రహదారితో అనుసంధానిస్తూ నాలుగు లేన్ల రహదారి నిర్మిస్తారు. ఆ రహదారిని విశాఖపట్నం–భోగాపురం బీచ్‌కారిడార్‌కు అనుసంధానిస్తారు. అంటే పోర్ట్ టెర్మినల్ నుంచి బీచ్ కారిడార్ ప్రారంభం వరకు నాలుగు లేన్ల రహదారి.. అక్కడ నుంచి తీరాన్ని ఆనుకుని విశాఖపట్నం నుంచి భోగాపురం వరకు ఆరు లేన్ల రహదారి నిర్మించాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఆరు లేన్ల బీచ్ కారిడార్, నాలుగు లేన్ల విశాఖపట్నం పోర్ట్ టెర్మినల్ రహదారికి కలిపి దాదాపు రూ. 2 వేల కోట్లు ఖర్చు చేసేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. ఈ ప్రాజెక్టుతో ప్రధానంగా విశాఖపట్నం పోర్ట్‌ను భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అనుసంధానించడం సాధ్యమవుతుంది. దాంతో సరుకు రవాణాకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుందని, విశాఖపట్నం లాజిస్టిక్ హబ్‌గా అభివృద్ధి చెందేందుకు దోహదపడుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. విశాఖపట్నం పోర్ట్ టెర్మినల్ నుంచి బీచ్ కారిడార్ వరకు నాలుగు లేన్ల రహదారి నిర్మాణంపై కూడా జాతీయ రహదారుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ త్వరలో డీపీఆర్ ప్రక్రియ చేపడుతుందని ఎన్హెచ్ఏఐ వర్గాలు చెప్పాయి. -
చౌకగా అందుబాటులోకి.. సరుకు రవాణా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సరుకు రవాణాను చౌకగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఇప్పటికే రెండు మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కు (ఎంఎంఎల్పీ)ల నిర్మాణం చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా మరో రెండు పార్కుల నిర్మాణంపై దృష్టిసారించింది. తొలుత విశాఖపట్నం, అనంతపురం వద్ద రెండు భారీ ఎంఎంఎల్‌పీలను నిర్మించే విధంగా కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖతో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు తాజాగా.. విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో వైఎస్సార్ జిల్లా కొప్పర్తి వద్ద అభివృద్ధి చేస్తున్న వైఎస్సార్ జగనన్న ఎంఐహెచ్, హైదరాబాద్–బెంగళూర్ పారిశ్రామిక కారిడార్‌లో కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద అభివృద్ధి చేస్తున్న భారీ పారిశ్రామిక పార్కుల వద్ద రెండు భారీ ఎంఎంఎల్‌పీలను నిర్మించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. పీఎం గతిశక్తి నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాస్టర్ ప్లాన్‌లో భాగంగా.. నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద వీటి అభివృద్ధికి ప్రతిపాదనలు పంపినట్లు పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక వస్తువు ధరలో 13 శాతంగా ఉన్న సరుకు రవాణా వ్యయం ఎంఎంఎల్‌పీలతో దానిని 8 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 300–350 మి.ట.లకు పెరుగుదల ఇక రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటవుతున్న నాలుగు పోర్టులు.. రామాయపట్నం, మచిలీపట్నం.. కాకినాడ గేట్‌వే, భావనపాడులతో పాటు విజయవాడ–ఖరగ్‌పూర్ మధ్య సరుకు రవాణా కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కారిడార్ నిర్మిస్తుండటంతో వీటికి అనుగుణంగా రాష్ట్రంలో మొత్తం నాలుగు ఎంఎంఎల్‌పీలను అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇవన్నీ అందుబాటులోకి వస్తే ప్రస్తుతం సుమారు 150 మిలియన్ టన్నులుగా ఉన్న రాష్ట్ర సరుకు రవాణా 2024–25 నాటికి 300–350 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. రైల్వేలైన్‌తోనూ అనుసంధానం ఇదే సమయంలో ఓర్వకల్లు పారిశ్రామికవాడను రైల్వేలైన్‌తో అనుసంధానం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రతిపాదనలు పంపింది. ఓర్వకల్లు నుంచి పోర్టులు, ఎయిర్‌పోర్టులు, జాతీయ రహదారులకు తోడు రైల్వే కనెక్టివిటీ కూడా ఉండేలా కర్నూలు రైల్వేస్టేషన్ నుంచి బనగానపల్లికి ఓర్వకల్లు మీదుగా రైలు మార్గాన్ని అనుసంధానం చేయడంతో పాటు దూపాడు రైల్వేస్టేషన్ వద్ద గూడ్స్ యార్డ్‌నూ నిర్మించాల్సిందిగా ప్రతిపాదన వచ్చింది. -
కొత్త పాలసీ: ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లకు ఓకే..
10,000 ఎకరాలు.. 25,000 కోట్ల పెట్టుబడులు 3.70 లక్షల మందికి ఉపాధి రాష్ట్రంలో తొలిదశ కింద ఒక్కొక్కటీ 500 నుంచి వెయ్యి ఎకరాల విస్తీర్ణం ఉండే 10 ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను ఏర్పాటు చేస్తారు. 2024-25 నాటికి మొత్తంగా 10 వేల ఎకరాలకు ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను విస్తరిస్తారు. రైస్‌మిల్లులు, బియ్యం ఉత్పత్తుల అనుబంధ పరిశ్రమలు, పప్పుధాన్యాలు, నూనె గింజలు, పండ్లు, పూలు, కూరగాయలు, మాంసం, చేపలు, కోళ్లు, పాలు, డెయిరీ ఉత్పత్తుల ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తారు. ఈ రంగంలో పెట్టుబడులు పెట్టే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు ఇస్తారు. విదేశాలకు నాణ్యమైన ఎగుమతులు చేసే స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తారు. జోన్లకు అవసరమైన భూమిని ప్రభుత్వమే సేకరించి, మౌలిక వసతులను అభివృద్ధి చేసి కేటాయిస్తుంది. ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు ప్రత్యేకంగా ‘ప్లగ్ అండ్ ప్లే’ పద్ధతిలో షెడ్లను ప్రభుత్వమే నిర్మించి ఇస్తుంది. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ధాన్యం, ఇతర పంట ఉత్పత్తులు పెరుగుతున్న నేపథ్యంలో ‘తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ’ని మంత్రివర్గం ఆమోదించింది. రాష్ట్రవ్యాప్తంగా 10 వేల ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు చేయాలని, వాటిలో యూనిట్లు ఏర్పాటు చేసేవారికి రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు అవసరమైన మార్గదర్శకాలను ఆమోదించింది. దీనితోపాటు రాష్ట్రంలో భారీగా ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని, రైతులకు పెట్టుబడి ప్రోత్సాహకాలు ఇవ్వాలని తీర్మానించింది. పారిశ్రామిక, ఈ-కామర్స్, సేవా రంగాలకు తోడుగా ఉండేలా ‘తెలంగాణ లాజిస్టిక్స్ పాలసీ’కి కూడా ఓకే చెప్పింది. బుధవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ప్రగతిభవన్‌లో సమావేశమైన రాష్ట్ర కేబినెట్.. వ్యవసాయ రంగానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ‘‘వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్ సరఫరా, అనేక కష్టాల కోర్చి నిర్మించిన ప్రాజెక్టులతో నదీ జలాలను చెరువులు, కుంటలు, బీడు భూములకు తరలించడంతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగింది. రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుబాటులోకి తేవడం వంటి రైతు సంక్షేమ కార్యక్రమాలతో గత ఏడాది తెలంగాణలో రికార్డు స్థాయిలో 3 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగింది. కరోనా కష్టకాలంలోనూ రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వమే గ్రామాలకు వెళ్లి ధాన్యం కొనుగోలు చేసింది. వచ్చే ఏడాది ధాన్యం ఉత్పత్తి మరింత పెరిగే అవకాశాలు ఉన్నందున.. ధాన్యం నిల్వ, మార్కెటింగ్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సి ఉంది..’’ అని మంత్రివర్గం తీర్మానించింది. ప్రస్తుత వానాకాలంలో 1.40 కోట్ల ఎకరాల్లో సేద్యం జరిగే అవకాశం ఉందని.. వరి, పత్తి పంటలు రికార్డు స్థాయిలో సాగవుతాయని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ధాన్యం నిల్వ, మిల్లింగ్ సామర్థ్యం పెంచుకోవాలని.. కొత్తగా రైస్ మిల్లులు, పారాబాయిల్డ్ మిల్లులు స్థాపించేందుకు పరిశ్రమల శాఖ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రైతులకు సమగ్ర శిక్షణ కోసం అవసరమయ్యే సౌకర్యాలను కల్పించి, నిరంతర శిక్షణ కొనసాగేలా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకోవాలని సూచించింది. ఉద్యానవన శాఖను క్రియాశీలకంగా మార్చేందుకు అధికారులు, నిపుణుల సహకారం తీసుకుని రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానించింది. పౌర సరఫరాల శాఖతో పాటు వ్యవసాయ శాఖలోనూ ఉద్యోగాల ఖాళీ లేకుండా అన్ని పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో సబ్ కమిటీ ఫుడ్ ప్రాసెసింగ్‌లో భాగంగా రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లింగ్ చేసి డిమాండ్ ఉన్న చోటికి సరఫరా చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం సంబంధిత రంగంలో నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలని.. కొత్తగా ముందుకొచ్చే అన్ని వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ పరిశ్రమలను ప్రోత్సహించాలని తీర్మానించింది. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి మరింతగా పెరిగే అవకాశం ఉన్నందున.. నిల్వ, మిల్లింగ్, మార్కెటింగ్ సహా నూతన పరిశ్రమల ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ సబ్ కమిటీలో మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, గంగుల కమలాకర్, ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి సభ్యులుగా ఉంటారని తెలిపింది. ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలని కేబినెట్ నిర్ణయించింది. 2022-23 సంవత్సరంలో 20లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేపట్టేలా చర్యలు చేపట్టాలని తీర్మానించింది. ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ఎకరాకు తొలి ఏడాది రూ.26 వేలు, రెండో ఏడాది రూ.5 వేలు, మూడో ఏడాది రూ.5 వేల చొప్పున పెట్టుబడి ప్రోత్సాహకం కింద సబ్సిడీగా అందజేయాలని నిర్ణయించింది. అటవీశాఖ, అటవీ అభివృద్ధి కార్పొరేషన్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల సాయంతో ఆయిల్ పామ్ నర్సరీలు పెంచాలని ఆదేశించింది. ఆయిల్ పామ్ సాగు విధానం గురించి లోతుగా తెలుసుకునేందుకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కూడిన బృందం కోస్టారికా, మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా దేశాల్లో పర్యటిస్తుందని తెలిపింది. ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ‘రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి, ఔత్సాహికులకు ప్రోత్సాహం, స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్’ల నిబంధనల ప్రకారం ప్రోత్సాహకాలు అందజేస్తామని వెల్లడించింది. ‘ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ’ మార్గదర్శకాలివీ.. రాష్ట్ర మంత్రివర్గం బుధవారం భేటీలో ‘తెలంగాణ స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ’కి ఆమోద ముద్ర వేసింది. ఉత్పత్తిదారులు, రైతు సంఘాలు, స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా గ్రామీణ పారిశ్రామిక వ్యవస్థను సృష్టించడం సాధ్యమవుతుందని.. తద్వారా గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల సమగ్రాభివృద్ధి జరుగుతుందని పేర్కొంది. ఈ మేరకు మార్గదర్శకాలను ఓకే చేసింది. రూ.25 వేలకోట్ల పెట్టుబడులు వస్తాయని, 70 వేల మందికి ప్రత్యక్షంగా, 3 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా వేసింది. వ్యవసాయ రంగంలో సాంకేతికత, నైపుణ్యం పెంచే దిశగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల విధానాన్ని అమలు చేయాలి. గ్రామీణ ఎస్సీ, ఎస్టీ మహిళలు ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. ఈ జోన్లలో స్థాపించే యూనిట్లకు వివిధ రూపాల్లో రాయితీలు ఇస్తారు. కరెంటు ప్రతి యూనిట్‌కు రూ. రెండు సబ్సిడీని ఐదేళ్లపాటు అందజేస్తారు. పెట్టుబడి కోసం తీసుకున్న లోన్‌పై చెల్లించాల్సిన వడ్డీలో 75 శాతం (గరిష్టంగా రూ.2 కోట్లు) రీయింబర్స్ చేస్తారు. ఏడేళ్ల పాటు మార్కెట్ కమిటీ ఫీజును వంద శాతం రీయింబర్స్ చేస్తారు. ఆహార ఉత్పత్తులను కోల్డ్ స్టోరేజీకి తరలించడం లాంటి లాజిస్టిక్స్‌కు తోడ్పాటు అందిస్తారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 15 శాతం మూలధనం (రూ.20 లక్షలకు మించకుండా) సాయం చేస్తారు. జోన్లలో భూమి కొనుగోలు ధర మీద రూ.20లక్షలకు మించకుండా 33శాతం వరకు సబ్సిడీ అందజేస్తారు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల చుట్టూ 500 మీటర్లను బఫర్ జోన్‌గా గుర్తించి జనావాసాలు, నిర్మాణాలకు అనుమతి ఇవ్వరు. ఫుడ్ ప్రాసెసింగ్‌పై ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 31 వరకు గడువు ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 10 లాజిస్టిక్స్ పార్కులు పరిశ్రమలు, వాణిజ్య శాఖ రూపొందించిన ‘తెలంగాణ లాజిస్టిక్స్ పాలసీ’ని కూడా కేబినెట్ బుధవారం ఆమోదించింది. రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులను దేశ విదేశ వినియోగదారులకు చేర్చేదిశగా లాజిస్టిక్స్ రంగాన్ని ప్రోత్సహించడం తక్షణావసరమని అభిప్రాయపడింది. ఈ దిశగా దాదాపు రూ.10 వేల కోట్ల మేర పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు చేపట్టాలని పరిశ్రమల శాఖను ఆదేశించింది. ఈ రంగం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్ష మందికి ప్రత్యక్షంగా, రెండు లక్షల మందికి పరోక్షంగా ఉపాధి దొరుకుతుందని అంచనా వేసింది. ఈ విధానం కింద కేబినెట్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో సుమారు 1400 ఎకరాల్లో భారీ డ్రైపోర్టును (మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కును) పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేస్తారు. ఎగుమతులను మరింతగా ప్రోత్సహించడానికి కస్టమ్స్ శాఖ అనుసంధానంతో సనత్ నగర్లో ప్రస్తుతమున్న కాంకర్ ఐసీడీ తరహాలో కొత్తగా మరో రెండు ఇంటిగ్రేటెడ్ కంటైనర్ డిపో (ఐసీడీ)లను స్థాపిస్తారు. బాటసింగారంలో ఉన్నట్టుగా రాష్ట్రవ్యాప్తంగా మరో 10 ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్కులను నెలకొల్పుతారు. ఈ రంగంలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడం కోసం అంతర్జాతీయ స్థాయిలో టాస్క్ సహాయంతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను స్థాపిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో లాజిస్టిక్ పార్కులను ఏర్పాటు చేస్తారు. మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్కులు, వేర్ హౌజ్‌లను ఏర్పాటు చేసే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పలు రకాల ప్రోత్సహకాలు అందిస్తారు. -
శరవేగంగా లాజిస్టిక్ పార్కు
ఇబ్రహీంపట్నంరూరల్: సుదూర ప్రాంతాల నుంచి సరుకులతో నగరానికి వచ్చే లారీలు, ట్రక్కులతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతున్నందున ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. నగర శివారులో రెండు లాజిస్టిక్ పార్కుల నిర్మాణం చేపట్టింది. సరుకులను అక్కడ దింపి చిన్న వాహనాల ద్వారా నగరంలోని రవాణా చేస్తారు. గత సంవత్సరం అక్టోబర్ 6న ఇబ్రహీంపట్నం నియోజవర్గంలో మంగళ్‌పల్లి, బాటసింగారం గ్రామాల్లో లాజిస్టిక్ పార్కులఏర్పాటుకు మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డిలు పునాది రాయి వేశారు. హైదరాబాద్ నగరంలోకి భారీ వాహనాల రాకపోకలపై నిషేధం ఉండటంతో సరుకుల రవాణాకు ఇబ్బందులు కలగకుండా ఈ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. భారీ వాహనాలు లాజిస్టిక్ పార్కుల వద్దకు వచ్చి అక్కడ సరుకులు దింపుతాయి. అక్కడి నుంచి నగరంలోకి చిన్న వాహనాల ద్వారా సరుకులు రవాణా అవుతాయి. అంతేకాకుండా సుదీర్ఘ ప్రయాణం చేసిన వాహనాల డ్రైవర్లు సేదతీరడానికి లాజిస్టిక్ పార్కుల్లో అన్ని సౌకర్యాలు కల్పించారు. రూ.20 కోట్లతో 22 ఎకరాల్లో నిర్మాణం ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని మంగళ్‌పల్లి సర్వే నెంబరు 127లో 22 ఎకరాల భూమిలో రూ.20 కోట్లతో లాజిస్టిక్ పార్కు నిర్మాణం చేస్తున్నారు. ప్రస్తుతం పాలనా పరమైన భవనం, పెద్ద గోదాం నిర్మాణం చేపడుతున్నారు. బొంగ్లూర్ ఔటర్‌రింగ్ రోడ్డుకు అనుసంధానం చేస్తూ రోడ్డును వేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్ట మొదటి లాజిస్టిక్ పార్కుగా మంగళ్పల్లిలో ఏర్పాటు కాబోతున్న లాజిస్టక్ పార్కు పేరుపొందనుంది. అన్‌కాన్ సంస్థ పనులు శరవేగంగా చేస్తోంది. ఇక్కడ 250 ట్రాక్కులు ఒకే సారి వచ్చి నిలపడానికి వీలుంటుంది. డ్రైవర్లు సేదతీరడానికి గెస్ట్‌హౌజ్‌లు నిర్మిస్తారు. వచ్చే ఏడాది లోపు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడానికి అన్‌కాన్ సంస్థ ప్రతినిధులు కసరత్తు చేస్తున్నారు. -
ఇక చకచకా... స్నాప్‌డీల్ డెలివరీ
♦ కొత్తగా ఆరు లాజిస్టిక్స్ హబ్‌ల ఏర్పాటు ♦ హైదరాబాద్‌లో ఒకటి న్యూఢిల్లీ: ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి సంస్థల కన్నా వేగంగా వస్తువులను డెలివరీ చేయడానికి ‘స్నాప్‌డీల్’ సిద్ధమయ్యింది. ఇది తన వేర్‌హౌస్, డెలివరీ కార్యకలాపాలను మరింత పటిష్టం చేసుకోవడమే లక్ష్యంగా దేశవ్యాప్తంగా ఆరు మెగా హబ్‌లను ఏర్పాటు చేసింది. సంస్థ ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాం తంలో మూడు, లక్నో, హైదరాబాద్, కోల్‌కతాలలో ఒకటి చొప్పున హబ్‌లను ఏర్పాటు చేసింది. ఈ హబ్‌ల ఏర్పాటు కోసం ఎంత మొత్తాన్ని వెచ్చించిం దనేది మాత్రం వెల్లడించలేదు. ఈ ఆరు హబ్‌లను స్నాప్‌డీల్‌కు చెందిన పూర్తి అనుబంధ కంపెనీ ‘వెల్కన్ ఎక్స్‌ప్రెస్’ ఏర్పాటు చేసింది. ఉత్పత్తుల స్వీకరణ, వాటి నాణ్యతా పరీక్ష, డెలివరీకి సిద్ధం చేయడం, రిటర్న్ వస్తువుల పరిశీలన వంటి పనులన్నీ వీటిల్లో జరుగుతాయని కంపెనీ తెలియజేసింది. దీంతో విక్రయదారుడు అన్ని సేవలను ఒకే చోట పొందొచ్చని పేర్కొంది. డిమాండ్ వేగంగా పెరుగుతున్న ప్రాంతాల్లోనే తాజా హబ్‌లను ఏర్పాటు చేసినట్లు స్నాప్‌డీల్ చీఫ్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ ఆఫీసర్ జయంత్ సూద్ తెలిపారు.