కొత్త పాలసీ: ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్లకు ఓకే.. | Telangana Govt Made New Policy For Food Processing Zones | Sakshi
Sakshi News home page

కొత్త పాలసీ: ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్లకు ఓకే..

Published Thu, Jul 15 2021 2:11 AM | Last Updated on Thu, Jul 15 2021 8:42 AM

Telangana Govt Made New Policy For Food Processing Zones - Sakshi

10,000 ఎకరాలు..
25,000 కోట్ల పెట్టుబడులు
3.70 లక్షల మందికి ఉపాధి

  • రాష్ట్రంలో తొలిదశ కింద ఒక్కొక్కటీ 500 నుంచి వెయ్యి ఎకరాల విస్తీర్ణం ఉండే 10 ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్లను ఏర్పాటు చేస్తారు. 2024-25 నాటికి మొత్తంగా 10 వేల ఎకరాలకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్లను విస్తరిస్తారు. 
  • రైస్‌మిల్లులు, బియ్యం ఉత్పత్తుల అనుబంధ పరిశ్రమలు, పప్పుధాన్యాలు, నూనె గింజలు, పండ్లు, పూలు, కూరగాయలు, మాంసం, చేపలు, కోళ్లు, పాలు, డెయిరీ ఉత్పత్తుల ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తారు.
  • ఈ రంగంలో పెట్టుబడులు పెట్టే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు ఇస్తారు. విదేశాలకు నాణ్యమైన ఎగుమతులు చేసే స్పెషల్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తారు.
  • జోన్లకు అవసరమైన భూమిని ప్రభుత్వమే సేకరించి, మౌలిక వసతులను అభివృద్ధి చేసి కేటాయిస్తుంది. ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలకు ప్రత్యేకంగా ‘ప్లగ్‌ అండ్‌ ప్లే’ పద్ధతిలో షెడ్లను ప్రభుత్వమే నిర్మించి ఇస్తుంది. 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ధాన్యం, ఇతర పంట ఉత్పత్తులు పెరుగుతున్న నేపథ్యంలో ‘తెలంగాణ స్టేట్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీ’ని మంత్రివర్గం ఆమోదించింది. రాష్ట్రవ్యాప్తంగా 10 వేల ఎకరాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్లు ఏర్పాటు చేయాలని, వాటిలో యూనిట్లు ఏర్పాటు చేసేవారికి రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు అవసరమైన మార్గదర్శకాలను ఆమోదించింది. దీనితోపాటు రాష్ట్రంలో భారీగా ఆయిల్‌ పామ్‌ సాగును ప్రోత్సహించాలని, రైతులకు పెట్టుబడి ప్రోత్సాహకాలు ఇవ్వాలని తీర్మానించింది. పారిశ్రామిక, ఈ-కామర్స్, సేవా రంగాలకు తోడుగా ఉండేలా ‘తెలంగాణ లాజిస్టిక్స్‌ పాలసీ’కి కూడా ఓకే చెప్పింది. బుధవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ప్రగతిభవన్‌లో సమావేశమైన రాష్ట్ర కేబినెట్‌.. వ్యవసాయ రంగానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.



‘‘వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్‌ సరఫరా, అనేక కష్టాల కోర్చి నిర్మించిన ప్రాజెక్టులతో నదీ జలాలను చెరువులు, కుంటలు, బీడు భూములకు తరలించడంతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగింది. రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందుబాటులోకి తేవడం వంటి రైతు సంక్షేమ కార్యక్రమాలతో గత ఏడాది తెలంగాణలో రికార్డు స్థాయిలో 3 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగింది. కరోనా కష్టకాలంలోనూ రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వమే గ్రామాలకు వెళ్లి ధాన్యం కొనుగోలు చేసింది. వచ్చే ఏడాది ధాన్యం ఉత్పత్తి మరింత పెరిగే అవకాశాలు ఉన్నందున.. ధాన్యం నిల్వ, మార్కెటింగ్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సి ఉంది..’’ అని మంత్రివర్గం తీర్మానించింది. ప్రస్తుత వానాకాలంలో 1.40 కోట్ల ఎకరాల్లో సేద్యం జరిగే అవకాశం ఉందని.. వరి, పత్తి పంటలు రికార్డు స్థాయిలో సాగవుతాయని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ధాన్యం నిల్వ, మిల్లింగ్‌ సామర్థ్యం పెంచుకోవాలని.. కొత్తగా రైస్‌ మిల్లులు, పారాబాయిల్డ్‌ మిల్లులు స్థాపించేందుకు పరిశ్రమల శాఖ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. రైతులకు సమగ్ర శిక్షణ కోసం అవసరమయ్యే సౌకర్యాలను కల్పించి, నిరంతర శిక్షణ కొనసాగేలా వ్యవసాయ శాఖ చర్యలు తీసుకోవాలని సూచించింది. ఉద్యానవన శాఖను క్రియాశీలకంగా మార్చేందుకు అధికారులు, నిపుణుల సహకారం తీసుకుని రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానించింది. పౌర సరఫరాల శాఖతో పాటు వ్యవసాయ శాఖలోనూ ఉద్యోగాల ఖాళీ లేకుండా అన్ని పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. 
 
నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో సబ్‌ కమిటీ
ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో భాగంగా రాష్ట్రంలో పండిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లింగ్‌ చేసి డిమాండ్‌ ఉన్న చోటికి సరఫరా చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఇందుకోసం సంబంధిత రంగంలో నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలని.. కొత్తగా ముందుకొచ్చే అన్ని వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్‌ పరిశ్రమలను ప్రోత్సహించాలని తీర్మానించింది. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి మరింతగా పెరిగే అవకాశం ఉన్నందున.. నిల్వ, మిల్లింగ్, మార్కెటింగ్‌ సహా నూతన పరిశ్రమల ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ సబ్‌ కమిటీలో మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, గంగుల కమలాకర్, ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌ కుమార్, సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి సభ్యులుగా ఉంటారని తెలిపింది. 
 
ఆయిల్‌ పామ్‌ సాగుకు ప్రోత్సాహం 
రాష్ట్రంలో ఆయిల్‌ పామ్‌ సాగును ప్రోత్సహించాలని కేబినెట్‌ నిర్ణయించింది. 2022-23 సంవత్సరంలో 20లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగు చేపట్టేలా చర్యలు చేపట్టాలని తీర్మానించింది. ఆయిల్‌ పామ్‌ సాగు చేసే రైతులకు ఎకరాకు తొలి ఏడాది రూ.26 వేలు, రెండో ఏడాది రూ.5 వేలు, మూడో ఏడాది రూ.5 వేల చొప్పున పెట్టుబడి ప్రోత్సాహకం కింద సబ్సిడీగా అందజేయాలని నిర్ణయించింది. అటవీశాఖ, అటవీ అభివృద్ధి కార్పొరేషన్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల సాయంతో ఆయిల్‌ పామ్‌ నర్సరీలు పెంచాలని ఆదేశించింది. ఆయిల్‌ పామ్‌ సాగు విధానం గురించి లోతుగా తెలుసుకునేందుకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో కూడిన బృందం కోస్టారికా, మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా దేశాల్లో పర్యటిస్తుందని తెలిపింది. ఆయిల్‌ పామ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లకు ‘రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి, ఔత్సాహికులకు ప్రోత్సాహం, స్పెషల్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్‌’ల నిబంధనల ప్రకారం ప్రోత్సాహకాలు అందజేస్తామని వెల్లడించింది. 

‘ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీ’ మార్గదర్శకాలివీ.. 
రాష్ట్ర మంత్రివర్గం బుధవారం భేటీలో ‘తెలంగాణ స్టేట్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీ’కి ఆమోద ముద్ర వేసింది. ఉత్పత్తిదారులు, రైతు సంఘాలు, స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా గ్రామీణ పారిశ్రామిక వ్యవస్థను సృష్టించడం సాధ్యమవుతుందని.. తద్వారా గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల సమగ్రాభివృద్ధి జరుగుతుందని పేర్కొంది. ఈ మేరకు మార్గదర్శకాలను ఓకే చేసింది. రూ.25 వేలకోట్ల పెట్టుబడులు వస్తాయని, 70 వేల మందికి ప్రత్యక్షంగా, 3 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా వేసింది.

  • వ్యవసాయ రంగంలో సాంకేతికత, నైపుణ్యం పెంచే దిశగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్ల విధానాన్ని అమలు చేయాలి.
  • గ్రామీణ ఎస్సీ, ఎస్టీ మహిళలు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు ఏర్పాటు చేసేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది.
  • ఈ జోన్లలో స్థాపించే యూనిట్లకు వివిధ రూపాల్లో రాయితీలు ఇస్తారు.
  • కరెంటు ప్రతి యూనిట్‌కు రూ. రెండు సబ్సిడీని ఐదేళ్లపాటు అందజేస్తారు.
  • పెట్టుబడి కోసం తీసుకున్న లోన్‌పై చెల్లించాల్సిన వడ్డీలో 75 శాతం (గరిష్టంగా రూ.2 కోట్లు) రీయింబర్స్‌ చేస్తారు.
  • ఏడేళ్ల పాటు మార్కెట్‌ కమిటీ ఫీజును వంద శాతం రీయింబర్స్‌ చేస్తారు.
  • ఆహార ఉత్పత్తులను కోల్డ్‌ స్టోరేజీకి తరలించడం లాంటి లాజిస్టిక్స్‌కు తోడ్పాటు అందిస్తారు.
  • ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 15 శాతం మూలధనం (రూ.20 లక్షలకు మించకుండా) సాయం చేస్తారు. జోన్లలో భూమి కొనుగోలు ధర మీద రూ.20లక్షలకు మించకుండా 33శాతం వరకు సబ్సిడీ అందజేస్తారు.
  • ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్ల చుట్టూ 500 మీటర్లను బఫర్‌ జోన్‌గా గుర్తించి జనావాసాలు, నిర్మాణాలకు అనుమతి ఇవ్వరు.
  • ఫుడ్‌ ప్రాసెసింగ్‌పై ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 31 వరకు గడువు ఉంటుంది.

 
రాష్ట్రవ్యాప్తంగా 10 లాజిస్టిక్స్‌ పార్కులు 
పరిశ్రమలు, వాణిజ్య శాఖ రూపొందించిన ‘తెలంగాణ లాజిస్టిక్స్‌ పాలసీ’ని కూడా కేబినెట్‌ బుధవారం ఆమోదించింది. రాష్ట్రంలో జరుగుతున్న పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులను దేశ విదేశ వినియోగదారులకు చేర్చేదిశగా లాజిస్టిక్స్‌ రంగాన్ని ప్రోత్సహించడం తక్షణావసరమని అభిప్రాయపడింది. ఈ దిశగా దాదాపు రూ.10 వేల కోట్ల మేర పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు చేపట్టాలని పరిశ్రమల శాఖను ఆదేశించింది. ఈ రంగం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా లక్ష మందికి ప్రత్యక్షంగా, రెండు లక్షల మందికి పరోక్షంగా ఉపాధి దొరుకుతుందని అంచనా వేసింది. ఈ విధానం కింద కేబినెట్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

  • రాష్ట్రంలో సుమారు 1400 ఎకరాల్లో భారీ డ్రైపోర్టును (మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్కును) పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేస్తారు. 
  • ఎగుమతులను మరింతగా ప్రోత్సహించడానికి కస్టమ్స్‌ శాఖ అనుసంధానంతో సనత్‌ నగర్‌లో ప్రస్తుతమున్న కాంకర్‌ ఐసీడీ తరహాలో కొత్తగా మరో రెండు ఇంటిగ్రేటెడ్‌ కంటైనర్‌ డిపో (ఐసీడీ)లను స్థాపిస్తారు.
  • బాటసింగారంలో ఉన్నట్టుగా రాష్ట్రవ్యాప్తంగా మరో 10 ఇంటిగ్రేటెడ్‌ లాజిస్టిక్‌ పార్కులను నెలకొల్పుతారు.
  • ఈ రంగంలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందించడం కోసం అంతర్జాతీయ స్థాయిలో టాస్క్‌ సహాయంతో సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను స్థాపిస్తారు.
  • రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో లాజిస్టిక్‌ పార్కులను ఏర్పాటు చేస్తారు.
  • మల్టీమోడల్‌ లాజిస్టిక్స్‌ పార్కులు, వేర్‌ హౌజ్‌లను ఏర్పాటు చేసే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పలు రకాల ప్రోత్సహకాలు అందిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement