ఫుడ్‌ పార్కుల్లో పెట్టుబడుల వేట | Food Processing Industry Seek For Investments | Sakshi
Sakshi News home page

ఫుడ్‌ పార్కుల్లో పెట్టుబడుల వేట

Published Sat, Feb 22 2020 2:23 AM | Last Updated on Sat, Feb 22 2020 2:33 AM

Food Processing Industry Seek For Investments - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు భవిష్యత్తులో టెక్స్‌టైల్, ఎలక్ట్రానిక్స్‌ తయారీ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాల ద్వారానే పెద్ద ఎత్తున ఉపాధి కల్పించడం సాధ్యమవుతుందని రాష్ట్రప్రభుత్వం అంచనా వేస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా సాగు విస్తీర్ణం పెరగడం, వ్యవసాయ రంగానికి ప్రభుత్వ ప్రాధాన్యత తదితరాల నేపథ్యంలో వ్యవసాయ, అనుబంధ రంగాల్లో ఉత్పత్తి పెరిగే అవకాశముందని ప్రభుత్వం లెక్కలు వేస్తోంది. ఈ నేపథ్యంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా రైతులకు భరోసాతో పాటు, గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాల్లో పెట్టుబడులతో దేశంలోకి కొత్తగా వచ్చే అంతర్జాతీయ కంపెనీలు, కార్యకలాపాల విస్తరణకు సిద్ధంగా ఉన్న దేశీయ కంపెనీలను లక్ష్యంగా చేసుకుని పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేక వ్యూహం అమలుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగం అభివృద్ధికి అవసరమైన ల్యాండ్‌ బ్యాంక్, ఇండస్ట్రియల్‌ పార్కుల సమగ్ర సమాచారాన్ని పెట్టుబడులతో వచ్చే వారి కోసం పరిశ్రమల శాఖ సిద్ధం చేస్తోంది.   


ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీపై కసరత్తు 
ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా ‘ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఇండస్ట్రీ పాలసీ’విధి విధానాలపై పరిశ్రమల శాఖ కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని గ్రామీణ నియోజకవర్గాలను 21 క్లస్టర్లుగా విభజించి ఆయా ప్రాంతాల్లో సాగయ్యే ప్రధాన, ఇతర పంటల వివరాలను సేకరించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా సాగయ్యే పంటల వివరాలతో ‘స్టేట్‌ ఫుడ్‌ మ్యాప్‌’కూడా సిద్ధం చేశారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలతో పాటు పెట్టుబడుల ఆకర్షణలో ఇతర రాష్ట్రాల నుంచి ఎదురయ్యే పోటీకి సంబంధించిన నివేదికలు కూడా పరిశ్రమల శాఖ గతంలో రూపొందించింది. రాష్ట్రంలో నాలుగు మెగా ఫుడ్‌ పార్కుల ఏర్పాటుకు గతంలో కేంద్రం ఆమోదం తెలిపింది. నిజామాబాద్‌లో రూ.250 కోట్లతో ఏర్పాటయ్యే ప్రైవేటు మెగా ఫుడ్‌పార్కుకు 2018లో శంకుస్థాపన జరగ్గా, పనులు కొనసాగుతున్నాయి. ఇది పూర్తయితే రూ.14 వేల కోట్ల టర్నోవర్‌ సాధించడంతో పాటు 50 వేల మంది యువతకు ఉపాధి దక్కడమే కాకుండా సుమారు లక్ష మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని అంచనా వేస్తున్నారు. 

టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలో ఫుడ్‌ పార్కులు
ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బుగ్గపాడు, బండమైలారం, బండ తిమ్మాపూర్‌లో ఫుడ్‌ పార్కులను అభివృద్ధి చేస్తోంది. బుగ్గపాడులో 60 ఎకరాల విస్తీర్ణంలో రూ.110 కోట్ల అంచనా వ్యయంతో మౌలిక వసతులు కల్పిస్తున్నారు. బుగ్గపాడు సెంట్రల్‌ ప్రాసెసింగ్‌ సెంటర్‌ (సీపీసీ)లో డ్రైవేర్‌ హౌజ్, డీప్‌ ఫ్రీజ్, సబ్‌ జీరో కోల్డ్‌ స్టోరేజీ ఛాంబర్‌ తదితరాల నిర్మాణం పూర్తయింది. బుగ్గపాడు సీపీసీకి అనుబంధంగా వరంగల్, నిజామాబాద్, నల్లగొండ, ఖమ్మంలో టీఎస్‌ఐఐసీ ద్వారా ప్రైమరీ ప్రాసెసింగ్‌ సెంటర్ల (సీపీసీ) నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఇదిలా ఉంటే హైదరాబాద్‌ శివారులోని దండు మల్కాపూర్‌ పారిశ్రామిక పార్కుకు అనుబంధంగా సుమారు వెయ్యి ఎకరాల్లో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఫుడ్‌ పార్కు ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణపై పారిశ్రామిక మౌలిక సౌకర్యాల కల్పన సంస్థ టీఎస్‌ఐఐసీ దృష్టి సారించింది.

రాష్ట్రం వైపు భారీ పరిశ్రమల చూపు 
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో పెట్టుబడులతో ప్రముఖ కంపెనీలు రాష్ట్రానికి తరలివచ్చాయి. మనోహరాబాద్‌లో ఐటీసీ రూ.800 కోట్లు, బండ తిమ్మాపూర్‌లో ఆర్పీఎస్‌జీ సంస్థ రూ.200 కోట్లతో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలను స్థాపించాయి. సంగారెడ్డి జిల్లా గోవింద్‌పూర్‌లో రూ.207 కోట్ల పెట్టుబడితో హట్సన్‌ ఆగ్రో ప్రొడక్ట్‌ లిమిటెడ్‌ దేశంలోని అతిపెద్ద ఐస్‌క్రీమ్‌ తయారీ ప్లాంటు అక్టోబర్‌ నాటికి ఉత్పత్తి ప్రారంభించనుంది. దీంతో పాటు డీఎక్స్‌ఎన్, కోకాకోలా, లులు గ్రూప్‌ తదితర సంస్థలు కూడా రాష్ట్రంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో పెట్టుబడులకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలోని బుగ్గపాడు, బండ మైలారం, బండ తిమ్మాపూర్‌ తదితర ఫుడ్‌ పార్కుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్న కంపెనీలతో త్వరలో సమావేశం అయ్యేందుకు పరిశ్రమల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement