సాక్షి, అమరావతి: గ్రామాల వారీగా గోదాములు, మండలాల వారీగా కోల్డ్ స్టోరేజీలు, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుపై మ్యాపింగ్ చేయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల వారీగా రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతి, వైఎస్సార్ జిల్లా పులివెందుల ప్రాంత అభివృద్ధి పనులపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లన్నీ ఒకే నమూనాలో ఉండాలని సూచించారు. పులివెందులలో మెడికల్ కాలేజీ పనుల పురోగతి గురించి ఆరా తీయగా, పనులకు సన్నద్ధమవుతున్నామని అధికారులు వెల్లడించారు. క్యాన్సర్ ఆసుపత్రి, ఇటీవల శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనుల పురోగతి గురించి తెలుసుకున్నారు. పనుల ప్రగతి, నిధుల ఖర్చు, ఇతరత్రా అంశాలను ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. ఈసారి వరద వచ్చినప్పుడు గండికోట, చిత్రావతి రిజర్వాయర్లు నింపేలా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు.
రోడ్డు విస్తరణపై దృష్టి పెట్టాలి
ముద్దనూరు–కొడికొండ చెక్‌పోస్టు మధ్య రోడ్డు విస్తరణ పనులపై దృష్టి పెట్టాలని, ఈ పనులను వీలైనంత త్వరగా చేపట్టాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఖర్జూరం పంటపై కొందరు రైతులు ఆసక్తి చూపుతున్నారని అధికారులు ముఖ్యమంత్రితో ప్రస్తావించారు. వాతావరణం, ఖర్చులు ఇతరత్రా అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. దీనిపై అధ్యయనం చేయించాలని సీఎం ఆదేశించారు. చిరుధాన్యాలను బాగా ప్రోత్సహించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ ఆన్ లైవ్ స్టాక్ (ఏపీ కార్ల్‌లో)లో ఉన్న మౌలిక వసతులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నారు. వెటర్నరీ, హార్టికల్చర్ రంగాల్లో గొప్ప సంస్థ ఏర్పాటుకు తగిన ఆలోచనలు చేయాలని, వారంలో దీనిపై ఒక ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పులివెందులలో ప్రపంచ స్థాయి నాణ్యతతో బోధన అందించే స్కూల్ ఏర్పాటుపై, టౌన్ హాలు నిర్మాణంపై దృష్టి పెట్టాలని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment