గోదాం వసతుల్లో 13–15 శాతం వృద్ధి | Industrial and warehousing park supply to touch 435 million sq ft | Sakshi
Sakshi News home page

గోదాం వసతుల్లో 13–15 శాతం వృద్ధి

Published Tue, Jul 18 2023 5:35 AM | Last Updated on Tue, Jul 18 2023 5:35 AM

Industrial and warehousing park supply to touch 435 million sq ft - Sakshi

ముంబై: పారిశ్రామిక, వేర్‌ హౌస్‌ లాజిస్టిక్స్‌ పార్క్‌ సరఫరా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 13–15 శాతం మేర పెరుగుతుందని ఇక్రా రేటింగ్స్‌ అంచనా వేసింది. ఎనిమిది ప్రధాన మార్కెట్లలో గోదాముల వసతి విస్తీర్ణం 435 మిలియన్‌ చదరపు అడుగులుగా ఉంటుందని పేర్కొంది. ముఖ్యంగా 50 శాతం గోదాం వసతి గ్రేడ్‌ ఏ రూపంలోనే వస్తుందని తెలిపింది. అయితే, కొత్తగా వచ్చే వసతిలో వినియోగం 39 మిలియన్‌ చదరపు అడుగులుగానే ఉంటుందని పేర్కొంది. థర్డ్‌ పార్టీ లాజిస్టిక్స్‌ (రవాణా), ఆటోమొబైల్‌ రంగాల నుంచి గోదాముల పరిశ్రమ స్థిరమైన డిమాండ్‌ను చూస్తోందని, 2023 మార్చి నాటికి మొత్తం వేర్‌హౌసింగ్‌ లీజు విస్తీర్ణంలో ఈ రంగాల వాటా 53 శాతంగా ఉందని వివరించింది.

దీనికి అదనంగా ఈ కామర్స్, అనుబంధ సేవల రంగాలు వేగంగా విస్తరిస్తుండడం కూడా గోదాములకు డిమాండ్‌ను పెంచుతోందని తెలిపింది. ప్రభుత్వం తయారీకి ప్రోత్సాహకాలు ఇస్తుండడం కూడా డిమాండ్‌ వృద్ధికి ఊతంగా నిలుస్తున్నట్టు వివరించింది. దేశవ్యాప్తంగా టాప్‌–8 పట్టణాల్లో గ్రేడ్‌ ఏ వేర్‌హౌస్‌ వసతి 17 శాతం వృద్ధి చెంది 195 మిలియన్‌ చదరపు అడుగులకు చేరుకుంటుందని అంచనా వేసింది. 2023 మార్చి నాటికి ఇది 167 మిలియన్‌ చదరపు అడుగులుగా ఉంది. కొత్తగా గ్రేడ్‌ ఏ విభాగంలో వచ్చే మార్చి నాటికి 28 మిలియన్‌ చదరపు అడుగుల వసతి అందుబాటులోకి వస్తుందని తన నివేదికలో ఇక్రా రేటింగ్స్‌ వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న గ్రేడ్‌ ఏ గోదాముల వసతిలో 30 శాతాన్ని అంతర్జాతీయ ఆపరేటర్లు, ఇన్వెస్టర్లు అయిన సీపీపీఐబీ, జీఎల్‌పీ, బ్లాక్‌స్టోన్, ఈఎస్‌ఆర్, అలియాంజ్, జీఐసీ, సీడీపీ గ్రూప్‌ ఆక్రమించినట్టు తెలిపింది.

దీర్ఘకాలంలో మెరుగైన వృద్ధి అవకాశాలు
దీర్ఘకాలంలో గ్రేడ్‌–ఏ గోదాముల వసతి వృద్ధికి మెరుగైన అవకాశాలున్నట్టు ఇక్రా రేటింగ్స్‌ నివేదిక తెలిపింది. థర్డ్‌ పార్టీ లాజిస్టిక్స్, ఆటోమొబైల్‌ రంగాలే అందుబాటులోని గోదాముల విస్తీర్ణంలో సగం వాటా ఆక్రమిస్తున్నాయి. థర్డ్‌ పార్టీ లాజిస్టిక్స్‌ నుంచి 8–9 శాతం, ఆటోమొబైల్‌ రంగం 6–9 శాతం వృద్ధి ఉంటుందని తెలిపింది. ముంబై, ఢిల్లీ ఎన్‌సీఆర్, పుణె, చెన్నై, కోల్‌కతా మార్కెట్లు వేర్‌హౌసింగ్‌కు టాప్‌ మార్కెట్లుగా ఉన్నాయని, ఈ పట్టణాలే మొత్తం వసతుల్లో 75–78 శాతం వాటా కలిగి ఉన్నాయని వివరించింది. ముంబై, ఢీల్లీ ఎన్‌సీఆర్‌ మార్కెట్లే 50% వాటా ఆక్రమిస్తున్నట్టు తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement