
గృహాలు, కార్యాలయ స్థలాలకే కాదు.. గిడ్డంగులకూ హైదరాబాద్ నగరంలో ఆదరణ పెరుగుతోంది. నగరంలో గతేడాది 35 లక్షల చ.అ. వేర్‌హౌస్ స్పేస్‌ల లావాదేవీలు జరిగాయి. మరో 1.64 కోట్ల చ.అ. స్థలాలకు డిమాండ్ ఉందని, ఇది 2024లో వార్షిక లావాదేవీలతో పోలిస్తే దాదాపు ఐదు రెట్లు అదనమని నైట్‌ఫ్రాంక్ ఇండియా నివేదిక వెల్లడించింది. గ్రేటర్‌లో శంషాబాద్, మేడ్చల్, పటాన్‌చెరు క్లస్టర్లు వేర్‌హౌస్‌లకు కేంద్ర బిందువులుగా ఉన్నాయి. గ్రేటర్‌లో గిడ్డంగుల అద్దె నెలకు చ.అ.కు రూ.20.7గా ఉంది. ఏడాది కాలంలో అద్దెలు ఒక శాతం మేర పెరిగాయి. అత్యధికంగా గ్రేడ్–ఏ వేర్‌హౌస్ అద్దెలు పటాన్‌చెరు పారిశ్రామిక క్లస్టర్‌లో రూ.24–28గా ఉంది. – సాక్షి, సిటీబ్యూరో
గతేడాది లావాదేవీల్లో అత్యధికంగా 34 శాతం తయారీ రంగంలోనే జరిగాయి. పునరుత్పాదక, సస్టెయినబుల్ ఎనర్జీ, ఆటోమోటివ్, ఆటో అనుబంధ పరిశ్రమలు డిమాండ్‌కు చోదకశక్తిగా నిలిచాయి. మేకిన్ ఇండియా, ప్రొడెక్షన్ లింక్డ్ ఇన్వెంటివ్ (పీఎల్‌ఐ) వంటి ప్రభుత్వ పథకాలు, ప్రోత్సాహకాలతో తయారీ, లాజిస్టిక్ హబ్‌గా హైదరాబాద్ ఆకర్షణగా నిలిచాయి. ఆ తర్వాత 33 శాతం రిటైల్ విభాగంలో లావాదేవీలు జరిగాయి. ఈ–కామర్స్, ఎఫ్‌ఎంసీజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ విభాగాలు రిటైల్ డిమాండ్‌కు ప్రధాన కారణాలు.
శంషాబాద్ హాట్ ఫేవరేట్..
గతేడాది గిడ్డంగుల లావాదేవీలు అత్యధికంగా శంషాబాద్ క్లస్టర్‌లో జరిగాయి. బెంగళూరు–హైదరాబాద్ హైవేకు అనుసంధానమై ఉండటం ఈ క్లస్టర్ అడ్వాంటేజ్. ఈ క్లస్టర్‌లో శంషాబాద్, శ్రీశైలం హైవే, బొంగ్లూరు, కొత్తూరు, షాద్‌నగర్ గిడ్డంగులకు ప్రధాన ప్రాంతాలు. విత్తన ప్రాసెసింగ్ యూనిట్, థర్డ్ పార్టీ లాజిస్టిక్ కంపెనీలు(3పీఎల్), ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ వంటి పారిశ్రామిక రంగం ఈ క్టస్లర్ డిమాండ్‌ను ప్రధాన కారణాలు. గతేడాది గ్రేటర్‌లో జరిగిన గిడ్డంగుల లావాదేవీల్లో ఈ క్లస్టర్ వాటా 47 శాతం. ఈ క్లస్టర్‌లో వేర్‌హౌస్ స్థలాలు ఎకరానికి రూ.4–6 కోట్ల మధ్య ఉండగా.. అద్దె చ.అ.కు రూ.18–25 ఉంది.

మేడ్చల్, పటాన్‌చెరుల్లో..
మేడ్చల్, పటాన్‌చెరు క్లస్టర్లలోనూ వేర్‌హౌస్‌లకు డిమాండ్ ఉంది. మేడ్చల్ క్లస్టర్‌లో మేడ్చల్, దేవరయాంజాల్, గుండ్లపోచంపల్లి, కండ్లకోయ, శామీర్‌పేట ప్రాంతాలు హాట్ ఫేవరేట్‌గా ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో భూముల ధరలు ఎకరం రూ.3–5 కోట్లు ఉండగా.. అద్దెలు చ.అ.కు రూ.18–24 మధ్య ఉన్నాయి. పటాన్‌చెరు క్లస్టర్‌లో పటాన్‌చెరు పారిశ్రామిక ప్రాంతం, రుద్రారం, పాశమైలారం, ఏదులనాగులపల్లి, సుల్తాన్‌పూర్ ప్రాంతాలు హాట్ ఫేవరేట్. ఇక్కడ స్థలాల ధరలు రూ.4–7 కోట్ల మధ్య పలుకుతుండగా అద్దె చ.అ.కు రూ.18–28 మధ్య ఉన్నాయి.
డిమాండ్ ఎందుకంటే?
వ్యూహాత్మక స్థానం, అద్భుతమైన కనెక్టివిటీ, పెరుగుతున్న పారిశ్రామిక కార్యకలాపాలు, లాజిస్టిక్స్‌కు హైదరాబాద్ కేంద్ర బిందువుగా అభివృద్ధి చెందింది. వీటికి తోడు మెరుగైన రోడ్లు, రైలు, విమాన నెట్‌వర్క్‌లతో సమర్థవంతమైన రవాణా వ్యవస్థ కలిగి ఉంది. దీంతో ఫార్మాసూటికల్స్, ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్స్, పునరుత్పాదక ఇంధనం వంటి పరిశ్రమల ద్వారా నగరంలో గిడ్డంగులకు ఆదరణ పెరుగుతుంది. వీటికి తోడు స్థానిక ప్రభుత్వ విధానాలు, ప్రోత్సాహకాలు, మెరుగైన మౌలిక సదుపాయాలతో గిడ్డంగుల విభాగంలో డిమాండ్‌కు మరో కారణం.
Comments
Please login to add a commentAdd a comment