సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి నుంచి దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ క్రమంగా కోలుకుంటోంది. ఈ ఏడాది రెండో త్రైమాసికం (క్యూ2)తో పోలిస్తే మూడో త్రైమాసికం (క్యూ3)లో రియల్టీ లావాదేవీలు పెరిగాయి. గృహ, ఆఫీస్, రిటైల్, వేర్‌హౌస్ అన్ని విభాగాలలో వృద్ధి రేటు నమోదయింది. తక్కువ వడ్డీ రేట్ల కారణంగా గృహ విక్రయాలు పెరగగా.. ప్రయాణ పరిమితులు తొలగడం, ఆఫీసులు పునఃప్రారంభాలతో కార్యాలయాల స్థలాలకు, వ్యాక్సినేషన్ డ్రైవ్‌తో రిటైల్ స్పేస్, ఓమ్నీ చానల్ విధానంతో వేర్‌హౌస్ స్పేస్ వృద్ధికి కారణాలని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సీబీఆర్‌ఈ సౌత్ ఏషియా వెల్లడించింది.
మిడ్, అఫర్డబుల్ యూనిట్లదే హవా..
ఈ ఏడాది మూడో త్రైమాసికంలో దేశంలో 50 వేల గృహాలు విక్రయమయ్యాయి. క్యూ2తో పోలిస్తే 46 శాతం వృద్ధి. అదే ఏడాది క్రితం క్యూ3తో పోలిస్తే 86 శాతం పెరుగుదల. నగరాల వారీగా చూస్తే.. 33 శాతం అమ్మకాల వాటాతో పుణే ప్రథమ స్థానంలో నిలవగా.. ముంబైలో 23 శాతం, బెంగళూరులో 17 శాతం, హైదరాబాద్‌లో 13 శాతం వాటాలున్నాయి. మొత్తం విక్రయాలలో 47 శాతం మధ్యస్థాయి గృహాలు కాగా 31 శాతం అఫర్డబుల్ హౌసింగ్ యూనిట్లు అమ్ముడుపోయాయి.
► ఈ ఏడాది క్యూ3లో కొత్తగా 48,950 యూనిట్లు ప్రారంభమయ్యాయి, గత త్రైమాసికంతో పోలిస్తే ఇది 37 శాతం వృద్ధి. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు, మార్ట్‌గేజ్ వంటి కారణంగా మధ్యస్థాయి, అందుబాటు గృహాల విక్రయాలు, లాంచింగ్స్‌కు ప్రధాన కారణాలు. అద్దె గృహాల చట్టం అమలుతో డెవలపర్లు ప్రత్యామ్నాయ మార్గాల కోసం కో–లివింగ్, స్టూడెంట్ హౌసింగ్ ప్రాజెక్ట్‌లపై ఆసక్తి చూపిస్తున్నారు. మిలీనియల్స్, తొలిసారి గృహ కొనుగోలుదారులు పెరగడంతో పెద్ద విస్తీర్ణ గృహాలు, ఓపెన్ ప్లాట్ల ప్రాజెక్ట్‌లకు డిమాండ్ పెరిగింది. నగదు నిర్వహణ, ప్రాజెక్ట్ అమలు సామర్థ్యాలు పెరగడం వంటివి కూడా రెసిడెన్షియల్ రియల్టీ మార్కెట్‌కు సానుకూలంగా మారాయి.
చిన్న సైజు ఆఫీస్ స్పేస్‌లకే డిమాండ్..
ఈ ఏడాది క్యూ3లో దేశంలో అదనంగా 1.35 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి వచ్చింది. క్యూ2తో పోలిస్తే ఇది 30 శాతం వృద్ధి. చిన్న సైజు ఆఫీస్ స్పేస్ లావాదేవీలదే హవా కొనసాగింది. 50 వేల చ.అ.ల కంటే తక్కువ స్థలం లావాదేవీల వాటా 84 శాతం వాటా ఉంది. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ–ఎన్‌సీఆర్ నగరాలలోనే 80 శాతం లావాదేవీలు కేంద్రీకృతమయ్యాయి. ఆఫీస్ నుంచి పని చేయడం సంస్కృతి పునఃప్రారంభం కావటంతో రానున్న రోజుల్లో ఆఫీస్ స్పేస్‌కు మరింత డిమాండ్ ఏర్పడుతుంది.
90 లక్షల చ.అ. వేర్‌హౌస్ స్పేస్..
పారిశ్రామిక గిడ్డంగుల విభాగం కూడా స్థిరమైన వృద్ధిని నమోదు చేసింది. ఈ ఏడాది క్యూ2తో పోలిస్తే క్యూ3లో 6 శాతం వృద్ధి నమోదయింది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో 90 లక్షల చ.అ. పారిశ్రామిక గిడ్డంగి స్థలాల లావాదేవీలు జరిగాయి. ఈ ఏడాది తొలి 9 నెలల కాలంలో 2.3 కోట్ల చ.అ. ట్రాన్సాక్షన్స్ జరిగాయి. థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ (3పీఎల్) ఈ–కామర్స్ మంచి డిమాండ్ ఉంది. క్యూ3లోని లీజులలో 55 శాతం లావాదేవీలు మధ్యస్థాయి, పెద్ద పరిమాణ ఒప్పందాలు ఉన్నాయి. 32 శాతం లావాదేవీల వాటాతో బెంగళూరు ప్రథమ స్థానంలో నిలవగా.. ఢిల్లీలో 22 శాతం, ముంబైలో 12 శాతం వాటాలున్నాయి.
► ఈ ఏడాది ముగింపు నాటికి ఇండస్ట్రియల్ వేర్‌హౌస్ స్పేస్ సపయ్ 2.5 కోట్ల చ.అ. చేరుతుందని, అలాగే 3.2 కోట్ల చ.అ. లావాదేవీలు జరుగుతాయని అంచనా. వినియోగ కేంద్రాలకు సమీపంలో ఉన్న అధిక నాణ్యత గిడ్డంగులపై దేశ, విదేశీ పెట్టుబడిదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఆటోమేషన్ లాజిస్టిక్స్, త్వరితగతిన పూర్తి చేసే ప్రాజెక్ట్‌లకు డిమాండ్ ఎక్కువగా ఉంది.
హైదరాబాద్‌లో రిటైల్ హవా..
ప్రయాణ పరిమితులు తొలగిపోవటం, లాక్‌డౌన్ లేకపోవటం, విద్యా సంస్థలు, పని ప్రదేశాలు పునఃప్రారంభం కావటంతో రిటైల్ కార్యకలాపాలు కూడా జోరుగానే సాగుతున్నాయి. ఈ ఏడాది క్యూ3లో గ్రేడ్–ఏ, హైస్ట్రీట్ మాల్స్‌లలో 6 లక్షల చ.అ. రిటైల్ స్పేస్ లావాదేవీల్లో జరిగాయి. క్యూ2తో పోలిస్తే ఇది 165 శాతం వృద్ధి రేటు. క్యూ3లోని రిటైల్ స్పేస్ లావాదేవీలో హైదరాబాద్ టాప్ స్థానంలో నిలిచింది. మొత్తం రిటైల్ స్పేస్ ట్రాన్సాక్షన్స్‌లో నగరం వాటా 38 శాతం కాగా.. ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో 26 శాతం, బెంగళూరులో 12 శాతం లావాదేవీలు జరిగాయి. విభాగాల వారీగా చూస్తే ఫ్యాషన్ అండ్ అపెరల్స్ రిటైల్ స్పేస్ లావాదేవీలు 26 శాతం జరగగా.. 16 శాతం సూపర్ మార్కెట్ల స్థల లావాదేవీలు జరిగాయి.
రానున్న రోజుల్లోనూ ఇదే తీరు
దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ గత ఏడాదితో పోలిస్తే స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తుంది. వేగవంతమైన వ్యాక్సినేషన్, విధానపరమైన సంస్కరణలు, పెరుగుతున్న పట్టణీకరణ వంటి కారణాలతో దేశీయ రియల్టీ మార్కెట్ సానుకూలంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో నివాస, వాణిజ్య, రిటైల్, పారిశ్రామిక గిడ్డంగుల విభాగాలలో కూడా ఇదే విధమైన డిమాండ్ కొనసాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
– అన్షుమన్ మేగజైన్, సీఈఓ అండ్ చైర్మన్, సీబీఆర్‌ఈ ఇండియా
Comments
Please login to add a commentAdd a comment