CBRE property show
-
CBRE India: ఆఫీసు లీజింగ్‌లో భారత కంపెనీల పైచేయి
న్యూఢిల్లీ: భారత కంపెనీలు మొదటిసారి ఆఫీసు స్పేస్ లీజింగ్ పరిమాణంలో అమెరికా సంస్థలను అధిగమించాయి. దేశ ఆఫీసు లీజు మొత్తం డిమాండ్‌లో 50 శాతం వాటాను ఆక్రమించాయి. ఈ మేరకు సీబీఆర్ఈ ఇండియా ఓ నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం.. 2022లో భారత్‌లోని తొమ్మిది ప్రధాన పట్టణాల్లో స్థూల ఆఫీసు స్పేస్ లీజు పరిమాణం 40 శాతం పెరిగి 56.6 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ఇది అంతకుముందు సంవత్సరంలో 40.5 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. 2022లో మొత్తం ఆఫీసు లీజులో 27.73 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని భారత కంపెనీలే తీసుకున్నాయి. 20.37 మిలియన్ చదరపు అడుగులను అమెరికా కంపెనీలు లీజుకు తీసుకున్నాయి. టెక్నాలజీ కంపెనీలు, బీఎఫ్ఎస్ఐలు, ఫ్లెక్సిబుల్ స్పేస్ ఆపరేట్లు గతేడాది లీజులో ఎక్కువ భాగాన్ని ఆక్రమించాయి. ఇందులో టెక్నాలజీ సంస్థలు 29 శాతం, ఫ్లెక్సిబుల్ ఆపరేటర్లు 14 శాతం, ఇంజనీరింగ్, తయారీ కంపెనీలు 13 శాతం, బీఎఫ్ఎస్ఐ సంస్థలు 13 శాతం, పరిశోధన, కన్సల్టింగ్, అనలైటిక్స్ కంపెనీలు 7 శాతం చొప్పున లీజింగ్ తీసుకున్నాయి. బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై పట్టణాల్లో దేశీ కంపెనీలు ఎక్కువగా ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకున్నాయి. కరోనా నిబంధనలను సడలించడం, అప్పటి వరకు నిలిచిన డిమాండ్ తోడవడం, తిరిగి ఆఫీసుకు వచ్చి పనిచేసే విధానాలు ఆఫీసు స్పేస్ లీజును నడిపించిన అంశాలుగా ఉన్నాయి. ‘‘అభివృద్ధి చెందిన దేశాల్లో కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ రిస్క్‌లకు సంబంధించి పూర్తి ప్రభావం కార్పొరేట్ల లీజింగ్ నిర్ణయాలపై ఇంకా ప్రతిఫలించాల్సి ఉంది’’అని సీబీఆర్ఈ ఇండియా చైర్మన్, సీఈవో అన్షుమన్ మేగజిన్ తెలిపారు. నిపుణుల లభ్యత, తక్కువ వ్యయాలతో భారత్ ఇక ముందూ ఆకర్షణీయంగా ఉంటుందన్నారు. అంతర్జాతీయ సంస్థలు తమ కార్యకలాపాలను ఆప్టిమైజ్ చేసుకునేందుకు భారత్ వైపు చూడొచ్చని చెప్పారు. -
CBRE India: ఆకర్షించేలా ఉంటేనే మాల్స్‌కి మనుగడ
న్యూఢిల్లీ: షాపింగ్ మాల్స్, ఇతరత్రా రిటైల్ స్టోర్స్.. కస్టమర్లను ఆకట్టుకునేలా విశిష్టమైన అనుభూతిని అందించగలిగితేనే మనుగడ సాగించగలవని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సేవల సంస్థ సీబీఆర్ఈ ఇండియా ఒక నివేదికలో పేర్కొంది. ‘భౌతిక రిటైల్ స్టోర్స్‌కి వెడితే బాగుంటుందని కోరుకునేలా ఉండాలే తప్ప .. ఏదో అవసరార్ధం వెళ్లక తప్పదనే విధంగా ఉండకూడదు. కస్టమర్లను ఆకర్షించేలా ఉంటేనే రిటైల్ స్టోర్స్ విజయవంతం కాగలవు‘ అని సంస్థ చైర్మన్ అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు. నివేదిక ప్రకారం కోవిడ్ మహమ్మారి తగ్గుముఖం పట్టే కొద్దీ రిటైల్ స్టోర్స్, వినోద కేంద్రాలను సందర్శించే వారి సంఖ్య పెరుగుతోంది. 2022 రెండో త్రైమాసికంలో (ఏప్రిల్ – జూన్) రిటైల్ రంగం గణనీయంగా కోలుకుంది. మొత్తం మీద 2022 ప్రథమార్ధంలో (జనవరి–జూన్) 160 శాతం పైగా వృద్ధి (గతేడాదితో పోలిస్తే) నమోదు చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో రిటైల్ రంగంలో సంస్థలు కస్టమర్లకు భౌతికంగా అనుభూతిని ఎంత మేర మెరుగుపర్చగలమనే అంశంపై మరింత దృష్టి పెట్టాల్సి ఉంటోందని సీబీఆర్ఈ ఇండియా ఎండీ రామ్ చంద్నానీ తెలిపారు. స్టోర్ ఫార్మాట్లు, పనితీరులో వైవిధ్యం పాటించడం, ప్రాంతాన్ని బట్టి వ్యూహాలు రూపొందించేందుకు డేటా సైన్స్‌ను ఉపయోగించుకోవడం, వ్యక్తిగతంగా మెరుగైన అనుభూతిని సృష్టించేందుకు ప్రయత్నించడం తదితర అంశాలను పరిశీలించవచ్చని పేర్కొన్నారు. వివిధ నగరాల్లో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు బ్రాండ్లు తమ భౌతిక స్టోర్ల వ్యూహాలను సవరించుకుంటున్నాయని, ప్రత్యేక ’అనుభూతి’ని కల్పించడానికి ప్రాధాన్యమిస్తున్నాయని చంద్నానీ తెలిపారు. -
50 వేల గృహాలు.. 1.35 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్!
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి నుంచి దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ క్రమంగా కోలుకుంటోంది. ఈ ఏడాది రెండో త్రైమాసికం (క్యూ2)తో పోలిస్తే మూడో త్రైమాసికం (క్యూ3)లో రియల్టీ లావాదేవీలు పెరిగాయి. గృహ, ఆఫీస్, రిటైల్, వేర్‌హౌస్ అన్ని విభాగాలలో వృద్ధి రేటు నమోదయింది. తక్కువ వడ్డీ రేట్ల కారణంగా గృహ విక్రయాలు పెరగగా.. ప్రయాణ పరిమితులు తొలగడం, ఆఫీసులు పునఃప్రారంభాలతో కార్యాలయాల స్థలాలకు, వ్యాక్సినేషన్ డ్రైవ్‌తో రిటైల్ స్పేస్, ఓమ్నీ చానల్ విధానంతో వేర్‌హౌస్ స్పేస్ వృద్ధికి కారణాలని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సీబీఆర్ఈ సౌత్ ఏషియా వెల్లడించింది. మిడ్, అఫర్డబుల్ యూనిట్లదే హవా.. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో దేశంలో 50 వేల గృహాలు విక్రయమయ్యాయి. క్యూ2తో పోలిస్తే 46 శాతం వృద్ధి. అదే ఏడాది క్రితం క్యూ3తో పోలిస్తే 86 శాతం పెరుగుదల. నగరాల వారీగా చూస్తే.. 33 శాతం అమ్మకాల వాటాతో పుణే ప్రథమ స్థానంలో నిలవగా.. ముంబైలో 23 శాతం, బెంగళూరులో 17 శాతం, హైదరాబాద్‌లో 13 శాతం వాటాలున్నాయి. మొత్తం విక్రయాలలో 47 శాతం మధ్యస్థాయి గృహాలు కాగా 31 శాతం అఫర్డబుల్ హౌసింగ్ యూనిట్లు అమ్ముడుపోయాయి. ► ఈ ఏడాది క్యూ3లో కొత్తగా 48,950 యూనిట్లు ప్రారంభమయ్యాయి, గత త్రైమాసికంతో పోలిస్తే ఇది 37 శాతం వృద్ధి. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు, మార్ట్గేజ్ వంటి కారణంగా మధ్యస్థాయి, అందుబాటు గృహాల విక్రయాలు, లాంచింగ్స్కు ప్రధాన కారణాలు. అద్దె గృహాల చట్టం అమలుతో డెవలపర్లు ప్రత్యామ్నాయ మార్గాల కోసం కో–లివింగ్, స్టూడెంట్ హౌసింగ్ ప్రాజెక్ట్‌లపై ఆసక్తి చూపిస్తున్నారు. మిలీనియల్స్, తొలిసారి గృహ కొనుగోలుదారులు పెరగడంతో పెద్ద విస్తీర్ణ గృహాలు, ఓపెన్ ప్లాట్ల ప్రాజెక్ట్‌లకు డిమాండ్ పెరిగింది. నగదు నిర్వహణ, ప్రాజెక్ట్ అమలు సామర్థ్యాలు పెరగడం వంటివి కూడా రెసిడెన్షియల్ రియల్టీ మార్కెట్‌కు సానుకూలంగా మారాయి. చిన్న సైజు ఆఫీస్ స్పేస్లకే డిమాండ్.. ఈ ఏడాది క్యూ3లో దేశంలో అదనంగా 1.35 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి వచ్చింది. క్యూ2తో పోలిస్తే ఇది 30 శాతం వృద్ధి. చిన్న సైజు ఆఫీస్ స్పేస్ లావాదేవీలదే హవా కొనసాగింది. 50 వేల చ.అ.ల కంటే తక్కువ స్థలం లావాదేవీల వాటా 84 శాతం వాటా ఉంది. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్ నగరాలలోనే 80 శాతం లావాదేవీలు కేంద్రీకృతమయ్యాయి. ఆఫీస్ నుంచి పని చేయడం సంస్కృతి పునఃప్రారంభం కావటంతో రానున్న రోజుల్లో ఆఫీస్ స్పేస్‌కు మరింత డిమాండ్ ఏర్పడుతుంది. 90 లక్షల చ.అ. వేర్‌హౌస్ స్పేస్.. పారిశ్రామిక గిడ్డంగుల విభాగం కూడా స్థిరమైన వృద్ధిని నమోదు చేసింది. ఈ ఏడాది క్యూ2తో పోలిస్తే క్యూ3లో 6 శాతం వృద్ధి నమోదయింది. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో 90 లక్షల చ.అ. పారిశ్రామిక గిడ్డంగి స్థలాల లావాదేవీలు జరిగాయి. ఈ ఏడాది తొలి 9 నెలల కాలంలో 2.3 కోట్ల చ.అ. ట్రాన్సాక్షన్స్ జరిగాయి. థర్డ్ పార్టీ లాజిస్టిక్స్ (3పీఎల్) ఈ–కామర్స్ మంచి డిమాండ్ ఉంది. క్యూ3లోని లీజులలో 55 శాతం లావాదేవీలు మధ్యస్థాయి, పెద్ద పరిమాణ ఒప్పందాలు ఉన్నాయి. 32 శాతం లావాదేవీల వాటాతో బెంగళూరు ప్రథమ స్థానంలో నిలవగా.. ఢిల్లీలో 22 శాతం, ముంబైలో 12 శాతం వాటాలున్నాయి. ► ఈ ఏడాది ముగింపు నాటికి ఇండస్ట్రియల్ వేర్‌హౌస్ స్పేస్ సపయ్ 2.5 కోట్ల చ.అ. చేరుతుందని, అలాగే 3.2 కోట్ల చ.అ. లావాదేవీలు జరుగుతాయని అంచనా. వినియోగ కేంద్రాలకు సమీపంలో ఉన్న అధిక నాణ్యత గిడ్డంగులపై దేశ, విదేశీ పెట్టుబడిదారులు ఆసక్తి చూపిస్తున్నారు. ఆటోమేషన్ లాజిస్టిక్స్, త్వరితగతిన పూర్తి చేసే ప్రాజెక్ట్‌లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. హైదరాబాద్‌లో రిటైల్ హవా.. ప్రయాణ పరిమితులు తొలగిపోవటం, లాక్డౌన్ లేకపోవటం, విద్యా సంస్థలు, పని ప్రదేశాలు పునఃప్రారంభం కావటంతో రిటైల్ కార్యకలాపాలు కూడా జోరుగానే సాగుతున్నాయి. ఈ ఏడాది క్యూ3లో గ్రేడ్–ఏ, హైస్ట్రీట్ మాల్స్‌లలో 6 లక్షల చ.అ. రిటైల్ స్పేస్ లావాదేవీల్లో జరిగాయి. క్యూ2తో పోలిస్తే ఇది 165 శాతం వృద్ధి రేటు. క్యూ3లోని రిటైల్ స్పేస్ లావాదేవీలో హైదరాబాద్ టాప్ స్థానంలో నిలిచింది. మొత్తం రిటైల్ స్పేస్ ట్రాన్సాక్షన్స్లో నగరం వాటా 38 శాతం కాగా.. ఢిల్లీ–ఎన్సీఆర్లో 26 శాతం, బెంగళూరులో 12 శాతం లావాదేవీలు జరిగాయి. విభాగాల వారీగా చూస్తే ఫ్యాషన్ అండ్ అపెరల్స్ రిటైల్ స్పేస్ లావాదేవీలు 26 శాతం జరగగా.. 16 శాతం సూపర్ మార్కెట్ల స్థల లావాదేవీలు జరిగాయి. రానున్న రోజుల్లోనూ ఇదే తీరు దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ గత ఏడాదితో పోలిస్తే స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తుంది. వేగవంతమైన వ్యాక్సినేషన్, విధానపరమైన సంస్కరణలు, పెరుగుతున్న పట్టణీకరణ వంటి కారణాలతో దేశీయ రియల్టీ మార్కెట్ సానుకూలంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో నివాస, వాణిజ్య, రిటైల్, పారిశ్రామిక గిడ్డంగుల విభాగాలలో కూడా ఇదే విధమైన డిమాండ్ కొనసాగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. – అన్షుమన్ మేగజైన్, సీఈఓ అండ్ చైర్మన్, సీబీఆర్ఈ ఇండియా -
పారిశ్రామిక స్థలాలకు డిమాండ్.. సీబీఆర్ఈ నివేదిక
న్యూఢిల్లీ: పారిశ్రామిక, లాజిస్టిక్స్ రంగాల ఆఫీస్ స్థలాల లీజింగ్ కార్యకలాపాలు ఈ ఏడాది ప్రథమార్ధం (జనవరి–జూన్) మధ్య కాలంలో గణనీయంగా పెరిగాయి. హైదరాబాద్ సహా ఎనిమిది ప్రధాన నగరాల్లో ఈ ధోరణి కనిపించింది. ప్రాపర్టీ కన్సల్టెంట్ సీబీఆర్ఈ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. గతేడాది ద్వితీయార్థంతో పోలిస్తే ఈ ఏడాది ప్రథమార్ధంలో లీజింగ్ కార్యకలాపాలు 13 శాతం పెరిగి 14 మిలియన్ చ.అ.లకు చేరినట్లు నివేదిక పేర్కొంది. 2020 ద్వితీయార్థంలో ఇది 11 మిలియన్ చ.అ.లుగా నమోదైంది. సరఫరాలో అంతరాయాలను అధిగమించే దిశగా తమ వినియోగదారులకు చేరువలో ఉండే ప్రాంతాలను ఎంచుకునేందుకే లాజిస్టిక్స్ సంస్థలు మొగ్గు చూపుతున్నాయని నివేదిక వివరించింది. కొన్ని సంస్థలు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలను కూడా ఎంచుకుంటున్నాయని పేర్కొంది. ఢిల్లీ–దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్), బెంగళూరులో అత్యధికంగా (50 శాతం) లీజింగ్ కార్యకలాపాలు నమోదయ్యాయి. అహ్మదాబాద్, హైదరాబాద్, చెన్నై తదితర నగరాల్లో అర్ధ సంవత్సర ప్రాతిపదికన అద్దెలు 2 శాతం నుంచి 14 శాతం దాకా పెరిగాయి. -
టెక్నాలజీతోనే నిర్మాణ వ్యయం తగ్గుతుంది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐటీ, డేటా అనలిటిక్ట్స్ వినియోగంతో నిర్మాణ, మార్కెటింగ్ వ్యయం తగ్గుతుందని నిర్మాణ రంగ ప్రముఖులు వ్యాఖ్యానించారు. సీఐఐ–సీబీఆర్ఈ ఆధ్వర్యంలో న్యూ ఢిల్లీలో జరిగిన ‘ఛేంజింగ్ డైనమిక్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ’ సదస్సులో వారు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఏటీఎస్ గ్రూప్ సీఎండీ గీతాంబర్ ఆనంద్ మాట్లాడుతూ.. నివాస, వాణిజ్య సముదాయాల నిర్మాణంలో డెవలపర్లు తమ ఆలోచన తీరును మార్చుకోవాలన్నారు. డేటా అనలిటిక్స్ వినియోగంతో మార్కెటింగ్ వ్యయం చాలా వరకు తగ్గుతుందన్నారు. ‘‘గతంలో మా కంపెనీలో ప్రాజెక్ట్ వ్యయంలో మార్కెటింగ్ వ్యయం 4–5 శాతంగా ఉండేది. కానీ, ఇప్పుడు డేటా అనలిటిక్స్ వినియోగంతో ఇది కేవలం 1 శాతానికి పరిమితమైందని’’ అని చెప్పారాయన. నిర్మాణ రంగంలో టెక్నాలజీని వాడితే స్టీల్, సిమెంట్ వృథా కాకుండా ఉంటుందన్నారు. అనంతరం సీబీఆర్ఈ ఇండియా చైర్మన్ అండ్ సీఈఓ అన్షుమన్ మేగజైన్ మాట్లాడుతూ.. డెవలపర్లు ప్రాజెక్ట్‌లు ప్రారంభించే ముందు స్థానిక మార్కెట్ పరిస్థితులు, కొనుగోలుదారులు ఆర్థిక స్థితిని అవగాహన చేయాలని సూచించారు. కొనుగోలుదారుల అవసరాలు, అభిరుచులకు తగ్గట్టుగా ఫ్లాట్ల విస్తీర్ణాలను, ధరలను నిర్ణయించాల్సిన డెవలపర్లు.. అలా చేయడం లేదని పేర్కొన్నారు. -
సీబీఆర్ఈ ప్రాపర్టీ షో షురూ!
నేడు, రేపు కూడా అందుబాటులో.. సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో తొలిసారిగా సీబీఆర్ఈ ప్రాపర్టీ షోను నిర్వహించింది. 3 రోజుల ఈ షో శుక్రవారమిక్కడ ప్రారంభమైంది. 2016లో నగరంలో కార్యాలయాల స్థలానికి 109 శాతం గిరాకీ పెరిగిందని సీబీఆర్ఈ ఇండియా, సౌత్ఈస్ట్ ఏసియా చైర్మన్ అన్షుమన్ చెప్పారు. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి నెలల్లో నగరంలో 13 లక్షల చ.అ. కార్యాలయాల స్థలం లీజుకు తీసుకున్నారని తెలిపారు. ఇతర దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే హైదరాబాద్‌లో నేటికీ ధరలు అందుబాటులో ఉన్నాయని.. ఇదే నివాస సముదాయాల డిమాండ్‌కు కారణమని సీబీఆర్ ఇండియా రెసిడెన్షియల్ సర్వీసెస్ హెడ్ ఏఎస్ శివరామకృష్ణన్ చెప్పారు. నగరంలోని 60 నిర్మాణ సంస్థలు, 200 ప్రాజెక్ట్‌లను షోలో ప్రదర్శించారు. తొలిరోజు 5 వేల మంది సందర్శకులొచ్చారని.. మూడు రోజుల ఈ షోలో మొత్తం 15 వేల మంది హాజరవుతారని అంచనా వేశారు.