
న్యూఢిల్లీ: షాపింగ్ మాల్స్, ఇతరత్రా రిటైల్ స్టోర్స్.. కస్టమర్లను ఆకట్టుకునేలా విశిష్టమైన అనుభూతిని అందించగలిగితేనే మనుగడ సాగించగలవని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సేవల సంస్థ సీబీఆర్‌ఈ ఇండియా ఒక నివేదికలో పేర్కొంది. ‘భౌతిక రిటైల్ స్టోర్స్‌కి వెడితే బాగుంటుందని కోరుకునేలా ఉండాలే తప్ప .. ఏదో అవసరార్ధం వెళ్లక తప్పదనే విధంగా ఉండకూడదు. కస్టమర్లను ఆకర్షించేలా ఉంటేనే రిటైల్ స్టోర్స్ విజయవంతం కాగలవు‘ అని సంస్థ చైర్మన్ అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు.
నివేదిక ప్రకారం కోవిడ్ మహమ్మారి తగ్గుముఖం పట్టే కొద్దీ రిటైల్ స్టోర్స్, వినోద కేంద్రాలను సందర్శించే వారి సంఖ్య పెరుగుతోంది. 2022 రెండో త్రైమాసికంలో (ఏప్రిల్ – జూన్) రిటైల్ రంగం గణనీయంగా కోలుకుంది. మొత్తం మీద 2022 ప్రథమార్ధంలో (జనవరి–జూన్) 160 శాతం పైగా వృద్ధి (గతేడాదితో పోలిస్తే) నమోదు చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో రిటైల్ రంగంలో సంస్థలు కస్టమర్లకు భౌతికంగా అనుభూతిని ఎంత మేర మెరుగుపర్చగలమనే అంశంపై మరింత దృష్టి పెట్టాల్సి ఉంటోందని సీబీఆర్‌ఈ ఇండియా ఎండీ రామ్ చంద్‌నానీ తెలిపారు.
స్టోర్ ఫార్మాట్లు, పనితీరులో వైవిధ్యం పాటించడం, ప్రాంతాన్ని బట్టి వ్యూహాలు రూపొందించేందుకు డేటా సైన్స్‌ను ఉపయోగించుకోవడం, వ్యక్తిగతంగా మెరుగైన అనుభూతిని సృష్టించేందుకు ప్రయత్నించడం తదితర అంశాలను పరిశీలించవచ్చని పేర్కొన్నారు. వివిధ నగరాల్లో తమ కార్యకలాపాలను విస్తరించేందుకు బ్రాండ్లు తమ భౌతిక స్టోర్‌ల వ్యూహాలను సవరించుకుంటున్నాయని, ప్రత్యేక ’అనుభూతి’ని కల్పించడానికి ప్రాధాన్యమిస్తున్నాయని చంద్‌నానీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment