CBRE India: ఆఫీసు లీజింగ్‌లో భారత కంపెనీల పైచేయి | CBRE India: India Inc beats US firms in office leasing for first time in 2022 | Sakshi
Sakshi News home page

CBRE India: ఆఫీసు లీజింగ్‌లో భారత కంపెనీల పైచేయి

Published Tue, Jan 17 2023 6:01 AM | Last Updated on Tue, Jan 17 2023 6:01 AM

CBRE India: India Inc beats US firms in office leasing for first time in 2022 - Sakshi

న్యూఢిల్లీ: భారత కంపెనీలు మొదటిసారి ఆఫీసు స్పేస్‌ లీజింగ్‌ పరిమాణంలో అమెరికా సంస్థలను అధిగమించాయి. దేశ ఆఫీసు లీజు మొత్తం డిమాండ్‌లో 50 శాతం వాటాను ఆక్రమించాయి. ఈ మేరకు సీబీఆర్‌ఈ ఇండియా ఓ నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం.. 2022లో భారత్‌లోని తొమ్మిది ప్రధాన పట్టణాల్లో స్థూల ఆఫీసు స్పేస్‌ లీజు పరిమాణం 40 శాతం పెరిగి 56.6 మిలియన్‌ చదరపు అడుగులుగా ఉంది. ఇది అంతకుముందు సంవత్సరంలో 40.5 మిలియన్‌ చదరపు అడుగులుగా ఉంది.

2022లో మొత్తం ఆఫీసు లీజులో 27.73 మిలియన్‌ చదరపు అడుగుల స్థలాన్ని భారత కంపెనీలే తీసుకున్నాయి. 20.37 మిలియన్‌ చదరపు అడుగులను అమెరికా కంపెనీలు లీజుకు తీసుకున్నాయి. టెక్నాలజీ కంపెనీలు, బీఎఫ్‌ఎస్‌ఐలు, ఫ్లెక్సిబుల్‌ స్పేస్‌ ఆపరేట్లు గతేడాది లీజులో ఎక్కువ భాగాన్ని ఆక్రమించాయి. ఇందులో టెక్నాలజీ సంస్థలు 29 శాతం, ఫ్లెక్సిబుల్‌ ఆపరేటర్లు 14 శాతం, ఇంజనీరింగ్, తయారీ కంపెనీలు 13 శాతం, బీఎఫ్‌ఎస్‌ఐ సంస్థలు 13 శాతం, పరిశోధన, కన్సల్టింగ్, అనలైటిక్స్‌ కంపెనీలు 7 శాతం చొప్పున లీజింగ్‌ తీసుకున్నాయి.

బెంగళూరు, ఢిల్లీ ఎన్‌సీఆర్, ముంబై పట్టణాల్లో దేశీ కంపెనీలు ఎక్కువగా ఆఫీస్‌ స్థలాన్ని లీజుకు తీసుకున్నాయి. కరోనా నిబంధనలను సడలించడం, అప్పటి వరకు నిలిచిన డిమాండ్‌ తోడవడం, తిరిగి ఆఫీసుకు వచ్చి పనిచేసే విధానాలు ఆఫీసు స్పేస్‌ లీజును నడిపించిన అంశాలుగా ఉన్నాయి. ‘‘అభివృద్ధి చెందిన దేశాల్లో కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ రిస్క్‌లకు సంబంధించి పూర్తి ప్రభావం కార్పొరేట్ల లీజింగ్‌ నిర్ణయాలపై ఇంకా ప్రతిఫలించాల్సి ఉంది’’అని సీబీఆర్‌ఈ ఇండియా చైర్మన్, సీఈవో అన్షుమన్‌ మేగజిన్‌ తెలిపారు. నిపుణుల లభ్యత, తక్కువ వ్యయాలతో భారత్‌ ఇక ముందూ ఆకర్షణీయంగా ఉంటుందన్నారు. అంతర్జాతీయ సంస్థలు తమ కార్యకలాపాలను ఆప్టిమైజ్‌ చేసుకునేందుకు భారత్‌ వైపు చూడొచ్చని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement