shares raised
-
CBRE India: ఆఫీసు లీజింగ్‌లో భారత కంపెనీల పైచేయి
న్యూఢిల్లీ: భారత కంపెనీలు మొదటిసారి ఆఫీసు స్పేస్ లీజింగ్ పరిమాణంలో అమెరికా సంస్థలను అధిగమించాయి. దేశ ఆఫీసు లీజు మొత్తం డిమాండ్‌లో 50 శాతం వాటాను ఆక్రమించాయి. ఈ మేరకు సీబీఆర్ఈ ఇండియా ఓ నివేదిక విడుదల చేసింది. దీని ప్రకారం.. 2022లో భారత్‌లోని తొమ్మిది ప్రధాన పట్టణాల్లో స్థూల ఆఫీసు స్పేస్ లీజు పరిమాణం 40 శాతం పెరిగి 56.6 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ఇది అంతకుముందు సంవత్సరంలో 40.5 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. 2022లో మొత్తం ఆఫీసు లీజులో 27.73 మిలియన్ చదరపు అడుగుల స్థలాన్ని భారత కంపెనీలే తీసుకున్నాయి. 20.37 మిలియన్ చదరపు అడుగులను అమెరికా కంపెనీలు లీజుకు తీసుకున్నాయి. టెక్నాలజీ కంపెనీలు, బీఎఫ్ఎస్ఐలు, ఫ్లెక్సిబుల్ స్పేస్ ఆపరేట్లు గతేడాది లీజులో ఎక్కువ భాగాన్ని ఆక్రమించాయి. ఇందులో టెక్నాలజీ సంస్థలు 29 శాతం, ఫ్లెక్సిబుల్ ఆపరేటర్లు 14 శాతం, ఇంజనీరింగ్, తయారీ కంపెనీలు 13 శాతం, బీఎఫ్ఎస్ఐ సంస్థలు 13 శాతం, పరిశోధన, కన్సల్టింగ్, అనలైటిక్స్ కంపెనీలు 7 శాతం చొప్పున లీజింగ్ తీసుకున్నాయి. బెంగళూరు, ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై పట్టణాల్లో దేశీ కంపెనీలు ఎక్కువగా ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకున్నాయి. కరోనా నిబంధనలను సడలించడం, అప్పటి వరకు నిలిచిన డిమాండ్ తోడవడం, తిరిగి ఆఫీసుకు వచ్చి పనిచేసే విధానాలు ఆఫీసు స్పేస్ లీజును నడిపించిన అంశాలుగా ఉన్నాయి. ‘‘అభివృద్ధి చెందిన దేశాల్లో కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ రిస్క్‌లకు సంబంధించి పూర్తి ప్రభావం కార్పొరేట్ల లీజింగ్ నిర్ణయాలపై ఇంకా ప్రతిఫలించాల్సి ఉంది’’అని సీబీఆర్ఈ ఇండియా చైర్మన్, సీఈవో అన్షుమన్ మేగజిన్ తెలిపారు. నిపుణుల లభ్యత, తక్కువ వ్యయాలతో భారత్ ఇక ముందూ ఆకర్షణీయంగా ఉంటుందన్నారు. అంతర్జాతీయ సంస్థలు తమ కార్యకలాపాలను ఆప్టిమైజ్ చేసుకునేందుకు భారత్ వైపు చూడొచ్చని చెప్పారు. -
విప్రో 10,500 కోట్ల షాపింగ్!
న్యూఢిల్లీ: గ్లోబల్ మేనేజ్మెంట్ టెక్నాలజీ కన్సల్టెన్సీ క్యాప్కోను కొనుగోలు చేయనున్నట్లు ఐటీ సర్వీసుల దేశీ దిగ్గజం విప్రో తాజాగా పేర్కొంది. ఇందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. క్యాప్కోను సొంతం చేసుకునేందుకు 1.45 బిలియన్ డాలర్లను(రూ. 10,500 కోట్లు) వెచ్చించనున్నట్లు వెల్లడించింది. విప్రో చరిత్రలోనే ఇది అతిపెద్ద కొనుగోలుకావడం గమనార్హం! క్యాప్కో కొను గోలుతో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్(బీఎఫ్ఎస్ఐ) విభాగంలో కన్సల్టింగ్, ఐటీ సర్వీసులందించడంలో మరింత పటిష్టతను సంతరించుకోనున్నట్లు విప్రో వివరించింది. ఈ విభాగంలోని అంతర్జాతీయ క్లయింట్ల(సంస్థలు)కు పటిష్టమైన, సమర్ధవంత కన్సల్టింగ్, ఫైనాన్షియల్ సర్వీసులను అందించనున్నట్లు తెలియజేసింది. కంపెనీకిగల వ్యూహాత్మక డిజైన్, డొమైన్, డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్, క్లౌడ్ తదితర సేవలకు క్యాప్కోకున్న కన్సల్టింగ్ సమర్ధత జత కలవనున్నట్లు పేర్కొంది. వెరసి బ్యాంకింగ్ చెల్లింపులు, క్యాపిటల్ మార్కెట్లు, బీమా తదితర విభాగాలలో మరింత మెరుగైన సేవలకు వీలున్నట్లు తెలియజేసింది. క్యాప్కో తీరిదీ...: 1998లో ఏర్పాటైన క్యాప్కో ప్రపంచవ్యాప్తంగా 100 మందికిపైగా క్లయింట్లను కలిగి ఉంది. అంతర్జాతీయంగా సుప్రసిద్ధ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కు దీర్ఘకాలంగా సేవలందిస్తోంది. లండన్ కేంద్రంగా 16 దేశాలలో 30 ప్రాంతాలలో కార్యకలాపాలు విస్తరించింది. 5,000 మంది కన్సల్టెంట్స్ ద్వారా సర్వీసులు అందిస్తోంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన గత ఆర్థిక సంవత్సరం(2020)లో 72 కోట్ల డాలర్ల(సుమారు రూ. 5,200 కోట్లు) ఆదాయం సాధించింది. క్యాప్కోకున్న ప్రతిభావంత టీమ్, క్లయింట్లతోపాటు, సిబ్బందికి ఆహ్వానం పలికేందుకు ఆసక్తిగా ఉన్నట్లు విప్రో సీఈవో, ఎండీ థియరీ డెలాపోర్ట్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. రెండు సంస్థల కలయికతో క్లయింట్లకు అత్యున్నత కన్సల్టింగ్, ట్రాన్స్ఫార్మేషన్స్ సేవలందించనున్నట్లు తెలియజేశారు. రెండు సంస్థల మధ్య ఒకేవిధమైన బిజినెస్ మోడల్స్, కీలక మార్గదర్శక విలువలు ఉన్నట్లు ప్రస్తావించారు. ఇకపై విప్రో హోమ్ సిబ్బందిగా సేవలందించేందుకు క్యాప్కో ఉద్యోగులు గర్వపడతారని భావిస్తున్నట్లు చెప్పారు. రెండు సంస్థల కలయిక ద్వారా క్లయింట్లకు అవసరమయ్యే అత్యున్నత ట్రాన్స్ఫార్మేషనల్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ లభించగలవని క్యాప్కో సీఈవో లాన్స్ లెవీ వ్యాఖ్యానించారు. -
అక్షరాలా... రూ. 1.2 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీకి 2019 సంవత్సరం బాగా కలిసొచ్చింది. ఈ ఏడాది ఆయన సంపద విలువ ఏకంగా 16.5 బిలియన్ డాలర్ల మేర (సుమారు రూ. 1.2 లక్షల కోట్లు) పెరిగింది. 60.8 బిలియన్ డాలర్లకు చేరింది. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ద్వారా ఈ విషయాలు వెల్లడయ్యాయి. మంగళవారం నాటికి గణాంకాల ప్రకారం సుమారు 61 బిలియన్ డాలర్ల నికర విలువతో (దాదాపు రూ. 4.3 లక్షల కోట్లు) ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో ముకేశ్ అంబానీ 12వ స్థానంలో నిల్చారు. ఏడాది కాలంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు దూసుకెళ్లడం .. ముకేశ్ అంబానీ సంపద వృద్ధికి కారణమైంది. నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజీ (ఎన్ఎస్ఈ) గణాంకాల ప్రకారం.. గడిచిన సంవత్సర కాలంలో రిలయన్స్ షేరు ఏకంగా 41 శాతం ఎగిసింది. మంగళవారం ఎన్ఎస్ఈలో రూ. 1,544.50 వద్ద క్లోజయ్యింది. గత కొన్నాళ్లుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ వివిధ వ్యాపార విభాగాల్లోకి శరవేగంగా విస్తరిస్తోంది. జియో పేరిట టెలికం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్.. తాజాగా జియో గిగాఫైబర్ సేవలతో బ్రాడ్‌బ్యాండ్ సేవల్లోనూ దూసుకెడుతోంది. ఇక రిటైల్ రంగంలోనూ పట్టు సాధించడంతో పాటు త్వరలో ఈ–కామర్స్ విభాగంలోకి కూడా ప్రవేశించేందుకు జోరుగా కసరత్తు చేస్తోంది. ఈ–కామర్స్‌లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి దిగ్గజాలకూ గట్టి పోటీనివ్వనుంది. టాప్‌లో బిల్ గేట్స్.. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు, టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సంపద ఈ ఏడాది మరో 22.4 బిలియన్ డాలర్లు పెరిగి 113 బిలియన్ డాలర్లకు చేరింది. రెండో స్థానంలో ఉన్న అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ సంపద మాత్రం 13.2 బిలియన్ డాలర్లు తగ్గింది. మరోవైపు, చైనాకు చెందిన ఈ–కామర్స్ దిగ్గజం ఆలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా నికర విలువ 11.3 బిలియన్ డాలర్లు పెరిగింది. అత్యంత సంపన్నుల లిస్టులో ఆయన 19వ స్థానంలో ఉన్నారు. -
రెండ్రోజుల్లోనే 30 శాతం పెరిగిన ‘జస్ట్ డయల్’ షేర్లు
హైదరాబాద్: ఇంటర్నెట్ సర్చ్ సంస్థ ‘జస్ట్ డయల్’ షేర్లు గత రెండు రోజుల్లోనే 30 శాతం మేర పెరిగాయి. బుధవారం నాడు ఏకంగా 19 శాతం పెరగ్గా, గురువారం నాడు పదిశాతం పెరిగాయి. సంస్థ షేర్ల ధర క్రమంగా పడిపోతున్న నేపథ్యంలో హఠాత్తుగా ఎలా పెరిగాయని వినియోగదారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా, ఇది తాత్కాలికమేనని, వ్యవహారం మళ్లీ మొదటికే వస్తుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ‘బై బ్యాక్’ విధానాన్ని ప్రవేశ పెట్టడం వల్లనే జస్ట్ డయల్ సంస్థ షేర్ల ధరలు హఠాత్తుగా పెరిగాయనడంలో సందేహం లేదు. ఈ బై బ్యాక్ విధానం అమలుకు కంపెనీ 164.5 కోట్ల రూపాయలను కేటాయించింది. ఈ సొమ్ముతో ఈక్విటి షేర్‌ను 1,550 రూపాయలతో దాదాపు పదిన్నర లక్షల షేర్లను తిరిగి వినియోగదారుడి నుంచి కొనేందుకు బై బ్యాక్ కింద కంపెనీ గ్యారంటీ ఇచ్చింది. మరోసారి బై బ్యాక్ విండోను ఫిబ్రవరి 25 నుంచి మార్చి పదో తేదీ వరకు తెరచి ఉంచుతామని, దాని వల్ల తమ షేర్ల విలువ మరింత పెరుగుతుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. తమ వ్యాపారం అభివృద్ధిపై కంపెనీ యాజమాన్యానికి అపారమైన నమ్మకం ఉండడం వల్లనే బై బ్యాక్ విధానాన్ని ప్రవేశపెట్టిందని కొన్ని మార్కెట్ శక్తులు చెబుతుండగా, ఈ పెరుగుదల తాత్కాలికమేనని, బై బ్యాక్ విధానం ఉపసంహరించుకున్నాక షేర్ల ధర 400 రూపాయలకు పడిపోవడం ఖాయమని కొన్ని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.