రెండ్రోజుల్లోనే 30 శాతం పెరిగిన ‘జస్ట్ డయల్’ షేర్లు
హైదరాబాద్: ఇంటర్నెట్ సర్చ్ సంస్థ ‘జస్ట్ డయల్’ షేర్లు గత రెండు రోజుల్లోనే 30 శాతం మేర పెరిగాయి. బుధవారం నాడు ఏకంగా 19 శాతం పెరగ్గా, గురువారం నాడు పదిశాతం పెరిగాయి. సంస్థ షేర్ల ధర క్రమంగా పడిపోతున్న నేపథ్యంలో హఠాత్తుగా ఎలా పెరిగాయని వినియోగదారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా, ఇది తాత్కాలికమేనని, వ్యవహారం మళ్లీ మొదటికే వస్తుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
‘బై బ్యాక్’ విధానాన్ని ప్రవేశ పెట్టడం వల్లనే జస్ట్ డయల్ సంస్థ షేర్ల ధరలు హఠాత్తుగా పెరిగాయనడంలో సందేహం లేదు. ఈ బై బ్యాక్ విధానం అమలుకు కంపెనీ 164.5 కోట్ల రూపాయలను కేటాయించింది. ఈ సొమ్ముతో ఈక్విటి షేర్‌ను 1,550 రూపాయలతో దాదాపు పదిన్నర లక్షల షేర్లను తిరిగి వినియోగదారుడి నుంచి కొనేందుకు బై బ్యాక్ కింద కంపెనీ గ్యారంటీ ఇచ్చింది. మరోసారి బై బ్యాక్ విండోను ఫిబ్రవరి 25 నుంచి మార్చి పదో తేదీ వరకు తెరచి ఉంచుతామని, దాని వల్ల తమ షేర్ల విలువ మరింత పెరుగుతుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.
తమ వ్యాపారం అభివృద్ధిపై కంపెనీ యాజమాన్యానికి అపారమైన నమ్మకం ఉండడం వల్లనే బై బ్యాక్ విధానాన్ని ప్రవేశపెట్టిందని కొన్ని మార్కెట్ శక్తులు చెబుతుండగా, ఈ పెరుగుదల తాత్కాలికమేనని, బై బ్యాక్ విధానం ఉపసంహరించుకున్నాక షేర్ల ధర 400 రూపాయలకు పడిపోవడం ఖాయమని కొన్ని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.