internet search engine
-
యాహూ! సరికొత్తగా...
ఒకప్పుడు ఇంటర్నెట్ సెర్చి ఇంజిన్‌గా, ఈ–మెయిల్‌కు పర్యాయపదంగా వెలిగిన యాహూ ఆ తర్వాత మిగతా సంస్థల నుంచి పోటీ ని తట్టుకోలేక వెనుకబడిపోయింది. అయితే, పూ ర్వ వైభవాన్ని సంపాదించుకునేందుకు యాహూ మెయిల్ తాజాగా ప్రయత్నాల్లో ఉంది. ఇందులో భాగంగా సరికొత్త ఫీచర్స్‌తో పాటు మొబైల్ యాప్‌ను రీబ్రాండింగ్ చేయడం ద్వారా యూజర్లను ఆకర్షించేందుకు కసరత్తు చేస్తోంది. పోటీ సంస్థలు గూగుల్‌కి చెందిన జీమెయిల్, మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్ వంటివి తమ యాప్స్‌ను ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లు, సర్వీసులతో రీ–బ్రాండ్ చేసుకుంటూనే ఉన్న నేపథ్యంలో యాహూ తాజా ప్రయత్నాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 22 కోట్ల మంది యూజర్లు.. యాహూ మెయిల్‌కు ప్రపంచవ్యాప్తంగా 22.76 మిలియన్ల మంది నెలవారీ యూజర్లు ఉన్నారు. మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీలు, కంప్యూటర్స్ మొదలైన వివిధ డివైజ్‌ల ద్వారా వీరిలో చాలా మంది ఈమెయిల్ సర్వీసులు ఉపయోగించుకుంటున్నారు. మొత్తం యూజర్లలో ప్రతి నెలా 7.5 కోట్ల మంది యూజర్లు కేవలం తమ మొబైల్స్, ట్యాబ్లెట్స్ ద్వారానే యాహూ మెయిల్‌ను ఉపయో గిస్తున్నారు. యాహూ మెయిల్ వినియోగదారుల్లో 60 శాతం మంది అమెరికాయేతర దేశాలవారే. ప్రస్తుతం ఉన్న యూజర్లు మరో ఈమెయిల్ సేవల సంస్థ వైపు మళ్లకుండా తమవద్దే అట్టే పెట్టుకునే దిశగా కొత్త మొబైల్ యాప్ ఫీచర్స్‌ను తీర్చిదిద్దినట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. దీంతో పాటు భారత్‌లో తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, గుజ రాతీ, బెంగాలీ, మరాఠీ వంటి ఏడు ప్రాంతీయ భాషల్లో సేవలు అందిస్తున్నట్లు వివరించాయి. కొత్త ఫీచర్స్‌లో కొన్ని .. అన్నింటికన్నా ప్రధానంగా మిగతా సంస్థలతో పోలిస్తే యాహూ మెయిల్ అత్యధికంగా 1 టెరాబైట్ (టీబీ) స్టోరేజీ స్పేస్ అందిస్తోంది. సుమారు 250–300 సినిమాలకు సరిపడేంత స్టోరేజీ ఇది. పోటీ సంస్థ జీమెయిల్ కేవలం 15 జీబీ స్టోరేజీ ఇస్తోంది. ఈ పరిమితి దాటితే.. అప్పటికే ఉన్న మెయిల్స్ కొన్నింటిని డిలీట్ చేసుకుని.. ఆ మేరకు పెరిగిన స్పేస్‌ను వాడుకోవాల్సి ఉంటోంది. లేదా నెలవారీ కొంత మొత్తం చెల్లించి అదనంగా స్టోరేజీ స్పేస్ కొనుక్కోవాల్సి వస్తోంది. ఇక, ఇన్‌బాక్స్‌లో స్పామ్ బాదరబందీ లేకుండా కాంటాక్ట్స్ నుంచి వచ్చే మెయిల్సే కనిపించేలా .. యాహూ మెయిల్ యూజర్లు..‘పీపుల్ వ్యూ’ పేరిట మరో కొత్త ఫీచర్ వినియోగించుకోవచ్చు. పీపుల్, ట్రావెల్, రిసీట్స్ వంటి మూడు కేటగిరీల్లో కింద మెయిల్స్‌ను విడగొట్టుకోవచ్చు. ఇవే కాకుండా పలు రకాల ఫిల్టర్స్, అటాచ్మెంట్ ఆప్షన్లు మొదలైనవి ఇందులో ఉన్నాయి. మిగతా ఈ–మెయిల్ సర్వీస్ ప్రొవైడర్స్ తరహాలోనే బహుళ ఈ–మెయిల్ ఖాతాలను యాహూ మెయిల్ యాప్‌నకు అనుసంధానించుకోవచ్చు. పెద్ద ఫోన్స్‌ను ఒంటి చేత్తో ఆపరేట్ చేసేటప్పుడు కూడా సులువు గా ఉపయోగించుకోగలిగేలా యాప్‌లో ఫీచర్స్‌ను తీర్చిదిద్దినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. మెయిల్ ప్రో రీబ్రాండింగ్.. యూజర్లకు ఉచిత సర్వీసులు అందిస్తున్నప్పటికీ.. మెయిల్స్‌లో ప్రకటనల ద్వారా యాహూ మెయిల్‌కు కొంత ఆదాయం లభిస్తుంది. దీనితో పాటు ప్రకటనల బాదరబందీ లేని సబ్స్క్రిప్షన్ ఆధారిత యాహూ మెయిల్ ప్రో సర్వీసును కూడా సంస్థ గతంలో ప్రవేశపెట్టింది. సుమారు 6–7 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టిన ఈ సర్వీసును కూడా ప్రస్తుతం రీబ్రాండ్ చేస్తోంది. అలాగే, కొత్త యాహూ మెయిల్ అప్లికేషన్‌ను మొబైల్ ఫోన్స్‌లో ప్రీ–ఇన్స్టాల్ చేసేలా ఫోన్స్ తయారీ సంస్థలతోనూ చర్చలు జరుగుతున్నాయని సంస్థ వర్గాలు తెలిపాయి. ఎంటర్ప్రైజ్ ఈ–మెయిల్ విభాగంలో ప్రవేశించే యోచనేదీ లేదని.. సాధారణ యూజర్లపైనే ప్రధానంగా దృష్టి పెట్టనున్నామని పేర్కొన్నాయి. -
రెండ్రోజుల్లోనే 30 శాతం పెరిగిన ‘జస్ట్ డయల్’ షేర్లు
హైదరాబాద్: ఇంటర్నెట్ సర్చ్ సంస్థ ‘జస్ట్ డయల్’ షేర్లు గత రెండు రోజుల్లోనే 30 శాతం మేర పెరిగాయి. బుధవారం నాడు ఏకంగా 19 శాతం పెరగ్గా, గురువారం నాడు పదిశాతం పెరిగాయి. సంస్థ షేర్ల ధర క్రమంగా పడిపోతున్న నేపథ్యంలో హఠాత్తుగా ఎలా పెరిగాయని వినియోగదారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా, ఇది తాత్కాలికమేనని, వ్యవహారం మళ్లీ మొదటికే వస్తుందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. ‘బై బ్యాక్’ విధానాన్ని ప్రవేశ పెట్టడం వల్లనే జస్ట్ డయల్ సంస్థ షేర్ల ధరలు హఠాత్తుగా పెరిగాయనడంలో సందేహం లేదు. ఈ బై బ్యాక్ విధానం అమలుకు కంపెనీ 164.5 కోట్ల రూపాయలను కేటాయించింది. ఈ సొమ్ముతో ఈక్విటి షేర్‌ను 1,550 రూపాయలతో దాదాపు పదిన్నర లక్షల షేర్లను తిరిగి వినియోగదారుడి నుంచి కొనేందుకు బై బ్యాక్ కింద కంపెనీ గ్యారంటీ ఇచ్చింది. మరోసారి బై బ్యాక్ విండోను ఫిబ్రవరి 25 నుంచి మార్చి పదో తేదీ వరకు తెరచి ఉంచుతామని, దాని వల్ల తమ షేర్ల విలువ మరింత పెరుగుతుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. తమ వ్యాపారం అభివృద్ధిపై కంపెనీ యాజమాన్యానికి అపారమైన నమ్మకం ఉండడం వల్లనే బై బ్యాక్ విధానాన్ని ప్రవేశపెట్టిందని కొన్ని మార్కెట్ శక్తులు చెబుతుండగా, ఈ పెరుగుదల తాత్కాలికమేనని, బై బ్యాక్ విధానం ఉపసంహరించుకున్నాక షేర్ల ధర 400 రూపాయలకు పడిపోవడం ఖాయమని కొన్ని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. -
గూగుల్ డూడుల్ పోటీ విజేత వైదేహి రెడ్డి
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ కంపెనీ నిర్వహించిన ‘డూడుల్4గూగుల్’ పోటీలో పుణే విద్యార్థిని వైదేహి రెడ్డి విజేతగా నిలిచింది. పుణేలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్లో చదువుతున్న వైదేహి ‘సహజ, సాంస్కృతిక స్వర్గం- అస్సాం’ పేరుతో డూడుల్‌ను రూపొందించి ఈ పోటీలో విజయం సాధించింది. గూగుల్ హోం పేజీలో ప్రత్యేక సందర్భానికి అనుగుణంగా బొమ్మలతో రూపొందించే ‘గూగుల్’ లోగోను డూడుల్‌గా పిలుస్తారు. ‘భారత్‌లో నేను చూడాలనుకుంటున్న ప్రదేశం’ అనే కాన్సెప్ట్‌తో డూడుల్‌ను రూపొందించాలని ఈ ఏడాది 50 పట్టణాల్లోని 1700 స్కూళ్లలో డూడుల్ పోటీ నిర్వహించగా 12 మంది విద్యార్థులు ఫైనల్‌కు చేరుకున్నారు. ఈ పోటీకి ఏకంగా పది లక్షల ఎంట్రీలు రావడం విశేషమని కంపెనీ వర్గాలు తెలిపాయి. -
హ్యాక్ చేయండి.. లక్షలు పట్టుకుపోండి!
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ కంపెనీ హ్యాకర్లకు ఈ ఏడాది కూడా బంపర్ ఆఫర్ ప్రకటించింది. క్రోమ్ ఓఎస్(ఆపరేటింగ్ సిస్టమ్)తో పనిచేసే తమ బ్రౌజర్‌ను నియంత్రణలోకి తీసుకుంటే భారీ మొత్తంలో ప్రైజ్‌మనీని ఇస్తామంటూ ‘పోనియమ్ 4 హ్యాకింగ్ కాంటెస్ట్’ పేరుతో సవాల్ విసిరింది. మార్చిలో కెనడాలోని వాంకోవర్‌లో జరిగే ‘కాన్సెక్వెస్ట్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్’లో ఈ పోటీని నిర్వహిస్తారు. క్రోమ్‌ని హ్యాక్ చేసినవారికి మొత్తం 2.7 మిలియన్ డాలర్ల (రూ.16.92 కోట్లు) బహుమతులు అందజేస్తారు. క్రోమ్‌ను గెస్ట్మోడ్లో లేదా లాగ్డ్-ఇన్ యూజర్ రూపంలో నియంత్రణలోకి తీసుకుంటే రూ.68 లక్షలు, హెచ్‌పీ, ఏసర్ క్రోమ్‌బుక్‌లను రీబూట్ తర్వాత హ్యాక్ చేస్తే రూ.94 లక్షలు అందుతాయి. గూగుల్ బ్రౌజర్లో లోపాలను తెలుసుకునేందుకే ఈ పోటీ నిర్వహిస్తున్నారు. ఇంతకుముందు ఇంటెల్ ఆధారిత క్రోమ్ ఓఎస్ డివైస్ల మీదే పోటీలు పెట్టగా.. ఈసారి ఏఆర్ఎం క్రోమ్ బుక్, హెచ్‌పీ క్రోమ్‌బుక్, ఏసర్ సీ720 క్రోమ్బుక్లపైనా హ్యాకింగ్‌కు అవకాశం కల్పించారు.